గవర్నర్’తో సర్కార్ సయోధ్య యత్నాలు?
Publish Date:Jun 7, 2022
Advertisement
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు మధ్య విభేదాల గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకోవలసింది ఏదీ లేదు. ఇద్దరి మధ్య దూరం చాలా చాలా పెరిగి పోయింది. అడ్డుగోడలు ఎత్తుగా లేచాయి. గవర్నర్ నివాసం రాజ్ భవన్, ముఖ్యమంత్రి నివాసం ప్రగతి భవన్ మధ్య భౌతిక దూరం చాలా తక్కువే అయినా విభేదాల దూరం మాత్రం రాష్ట్ర విస్తీర్ణం దాటిపోయింది. ఒకరినొకరు కలవక, ఒకరినొకరు చూడక ఇంచుమించుగా ఓ అర్థ సంవత్సరం పైగానే గడిచి పోయింది. ఈ నేపధ్యంలోనే గవర్నర్’ కొద్ది నెలల క్రితం ఢిల్లీ వెళ్లి ప్రధాని, నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా’ తో సమావేశ మయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించడం లేదని, గవర్నర్ వ్యవస్థను అవమానాలకు గురి చేస్తోందని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియా ముందు కొచ్చి, కొంత మర్మగర్భంగానే అయినా, రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఏమి జరుగుతోందో అందరికీ తెలుసునని చురకలు అంటించారు. ఎన్ని అవమానాలు ఎదురైనా వెనకడుగు వేసేది లేదని, రాజ్యాంగ విధులను తూచ తప్పకుండా పతిస్తానని, పేర్కొన్నారు. మరో వంక గవర్నర్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి నేరుగా స్పందించక పోయినా, మంత్రులు ఘాటుగా స్పందించారు. అయితే, ఇప్పుడు వాతావరణం కొంత చల్ల బడుతున్నట్లు తెలుస్తోంది. మంచు కరుగుతోందని రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య వార్తలు వినిపిస్తున్నాయి. విశ్వనీయ వర్గాల సమాచారం మేరకు, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు త్వరలోనే గవర్నర్’ ను కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. నిజానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గవర్నర్’తో విభేదాల కారణంగా, మంత్రి వర్గ విస్తరణ విస్తరణ వంటి కొన్ని కీలక నిర్ణయాలను వాయిదా వేసుకున్నారని, రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది. అయితే ఇప్పుడు, కొన్ని అనివార్య పరిస్థితులు ఏర్పడిన నేపధ్యంలో ముఖ్యమంత్రి ఒకడుగు ముదుకేసి గవర్నర్’తో సయోధ్య కోరుకుంటున్నారని అంటున్నారు. ఈటల రాజేందర్ రాజీనామా చేసిన నేపధ్యంలో అయన స్థానంలో, అదే ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్’ ను మంత్రి వర్గంలోకీ తీసుకుంటారని అప్పట్లో గట్టి ప్రచారం జరిగింది. అందుకే ఆయన చేత ఎంపీ పదవికి రాజీనామా చేయింఛి, ఎమ్మెల్సీ చేశారు. అప్పటినుంచి, మంత్రివర్గ విస్తరణ పై ఉహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. అలాగే, ఏడ్చే దానికి మొగుడొస్తే తన మొగుడు వస్తాడని, ఇంకొంత మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ముహూర్తం కోసం వేయి కళ్ళతో ఎదురు చూశారు. కానీ, ఆ ముహూర్తం మాత్రం ముడి పడడం లేదు. అయితే, ఇలా మంత్రివర్గ విస్తరణ వాయిదా పడడానికి కూడా, గవర్నర్’తో విభేదాలే కారణమని అంటున్నారు. అయితే, ఇప్పుడు ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచనలో ఉన్న ముఖ్యమంత్రి, కేసీఆర్, ఎన్నికలకోసం మంత్రి వర్గంలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ అంటే గవర్నర్’ అనుమతి తీసుకొనక తప్పుదు. అంతే కాదు, ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలన్నా, అసెంబ్లీ రద్దుకు గవర్నర్ ఆమోదం తప్పనిసరి. అదొకటి అలా ఉంటే, జుబ్లీ హిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ వ్యవహారానికి సంబంధించి, గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక కోరారు. ఒక విధంగా ఈ కేసు సర్కార్ మెడకు గట్టిగా చుట్టుకుంటోంది. మరోవంక, సిమిలర్ కేసులు మరికొన్ని వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే, రాష్ట్రంలో నేరాలు ఘోరాలు పెరిగిపోయాయని, ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. అది అటూ ఇటూ అయినా, గవర్నర్ రాష్ట్ర పతి పాలనకు సిఫార్సు చేసినా చేయవచ్చుననే ఆందోళన అధికార వర్గాల్లో వినవస్తోంది. అందుకే ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, రాజ్ భవన్, ప్రగతి భవాన్ మధ్య దూరాన్ని తగ్గించేందుకు, ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజ్యాంగ పదవిలో ఉన్న ఒక కేంద్ర మాజీ మంత్రితో పాటుగా, కరీంనగర్ జిల్లాకు చెందిన మరో కీలక నేత ద్వారా సయోధ్య ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్’ విషయం కేంద్ర హోం శాఖకు చేరిన నేపధ్యంలో, తాను నిర్ణయం తీసుకోలేనని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, ముఖ్యమంత్రి అప్పాయింట్మెంట్ కోరితే, రాజ్యాంగ పరిమితులకు లోబడి నిర్ణయం తీసుకునేందుకు తనకు అభ్యతరం లేదని, అదే విధంగా రాజ్యాంగ విధులను నిర్వర్తించే విషయంలో వ్యక్తిగత గౌరవ మర్యాదలు అడ్డు రావని తెలిపినట్లు తెలుస్తోంది. అయితే, ముఖ్యమంత్రి నిజంగా, గవర్నర్’తో సయోధ్య కోరుకుంటున్నారా? అందుకోసం ఒక మెట్టు దిగేందుకు సిద్ధమయ్యారా? స్వయంగా వెళ్లి గవర్నర్’ను కలుస్తారా, అంటే రాజకీయాల్లో ఉన్నవారికి పట్టువిడుపులు సర్వసాధారణమని అంటున్నారు. అందులోనూ కేసీఆర్ ఈ విద్యలో అందరికంటే ఒకాకు ఎక్కువే చదివారని, అంటారు.
హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా తెరాస గూటికి చేరిన పాడి కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసే విషయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన వివాదం అనేక మలుపులు తిరిగి చివరకు రాజ్యాంగ వ్యవస్థల మధ్య ఏకంగా అగాధమే ఏర్పడిందనే అభిప్రాయం ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం అనేక సందర్భాలలో ఉద్దేశపూర్వకంగానే గవర్నర్’ కు ఇవ్వవలసిన గౌరవం ఇవ్వడం లేదనే అభిప్రాయం సామాన్యులకు కూడా చేరింది. ప్రోటోకాల్ నిబంధనలను ఉల్లంఘించడం ఒకెత్తు అయితే, గవర్నర్’ను కించపరిచే విధంగా రాష్ట్ర మంత్రులు బహిరంగ వ్యాఖ్యలు, విమర్శలు చేయడం, కనీస మర్యాద పాటించక పోవడం ఒక్కటీ ఒక ఎత్తుగా ఇరు వ్యవస్థల మధ్య సంబంధాలు చితికి పోయాయి . ఒక విదంగా, రాజ్ భవన్, ప్రగతి భవన్ శత్రు శిబిరాలు అనుకునే స్థితికి పరిస్థితి చేరిందనే అభిప్రాయమే అంతటా వినవస్తోంది.
http://www.teluguone.com/news/content/ts-government-reconciliation-efforts-with-governer-25-137208.html





