మరోసారి ట్రంప్ స్వోత్కర్ష.. తనను మించిన శాంతి దూత ఎవరని నిలదీత
Publish Date:Jan 10, 2026
Advertisement
నోబెల్ శాంతి పురస్కారానికి తనను మించిన అర్హులెవరున్నారంటూ అగ్రరాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్ మరోసారి తన భుజాలను తానే చరుచుకుని స్వోత్కర్షలో తనకు తానే సాటి అని చాటుకున్నారు. వైట్‌హౌస్‌లో చమురు సంస్థల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ప్రసంగించిన ఆయన తన హయాంలో ఎనిమిది యుద్ధాలను ఆపానని చెప్పుకున్నారు. అంతే కాదు.. భారత్ పదేపదే ఖండిస్తున్నప్పటికీ భారత్, పాకిస్థాన్ ల మధ్య అణుయుద్ధాన్ని తానే నివారించానని పునరుద్ఘాటించారు. గత ఏడాది భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తి యుద్ధం అనివార్యం అన్న పరిస్థితులు నెలకొన్న సమయంలో తాను జోక్యం చేసుకుని ఇరు దేశాల మధ్యా యుద్ధం జరగకుండా అడ్డుకున్నానని చెప్పుకున్నారు. తాను జోక్యం చేసుకోకుంటే అణుయుద్ధం జరిగేదని చెప్పుకొచ్చారు. తన చొరవ వల్లే కనీసం కోటి మంది ప్రాణాలు దక్కాయని పాకిస్థాన్ ప్రధాని అప్పట్లో చేసిన బహిరంగ ప్రకటనను ఆయనీ సందర్భంగా గుర్తు చేశారు. ఇన్ని యుద్ధాలను ఆపిన తన కంటే నోబెల్ శాంతి పురస్కారం పొందేందుకు ఎవరికి అర్హత ఉందని చెప్పుకున్నారు. అయితే తనకు శాంతి పురస్కారాల కంటే.. జనం ప్రాణాలు కాపాడటమే ముఖ్యమని చెప్పుకున్నారు.
http://www.teluguone.com/news/content/trump-boasts-t-himself-once-again-36-212325.html





