జైలు నుంచి ఆస్పత్రికి రాజ్ కసిరెడ్డి, చెవిరెడ్డి
Publish Date:Jan 10, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో అరెస్టై విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న రాజ్ కసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డిలను జైలు అధికారులు ఈ రోజు ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య సమస్యలతో వారు బాధపడుతుండటంతో జైలు నుంచి ఆస్పత్రికి తరలించినట్లు జైలు అధికారులు తెలిపారు. వీరిలో మద్యం కుంభకోణం కేసులో ఏ1గా ఉన్న రాజ్ కసిరెడ్డి ఆర్థోపెడిక్ సమస్యలతో గత కొద్ది రోజులుగా బాధపడుతుండటంతో జైలు అధికారులు ఆయనను ఈ రోజు విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇక ఈ కేసులో ఏ38గా ఉన్న చెవిరెడ్డి భాస్కరరెడ్డి వెరికోజ్ వెయిన్స్ సమస్యలతో బాధపడుతుండటంతో ఆయనను మంగళగిరి ఎయిమ్స్ కు తరలించారు. జగన్ హయాంలో ఏపీలో జరిగిన 3,200 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం కేసులో వీరిరువురూ అరెస్టైన సంగతి తెలసిందే. రాజ్ కసిరెడ్డిని గత ఏడాది ఏప్రిల్ 21న హైదరాబాద్ విమానాశ్రయంలో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచీ ఆయన విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని గత ఏడాది జూన్ 17 బెంగళూరు విమానాశ్రయంలో సిట్ అరెస్టు చేసింది. అప్పటి నుంచీ చెవిరెడ్డి కూడా రిమాండ్ ఖైదీగా విజయవాడ సెంట్రల్ జైలులోనే ఉన్నారు. వీరిరువురూ పలుమార్ల దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్లను కోర్టులు కొట్టివేశాయి. ఇప్పుడు తాజాగా ఇరువురూ కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతుండటంతో జైలు అధికారులు వారిని వేరువేరు ఆస్పత్రులకు తరలించారు.
http://www.teluguone.com/news/content/andhra-pradesh-madayam-scam-accused-rajkasireddy-36-212340.html





