టీఆర్ఎస్ ఎంపీ నామా ఆస్తులు జప్తు
Publish Date:Jul 2, 2022
Advertisement
టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు కంపెనీకి చెందిన ఆస్తులను ఈడీ శనివారం జప్తు చేసింది. హైదరాబాద్ లో ఓ వైపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. మరో వైపు విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కు మద్దతుగా టీఆర్ఎస్ సభ జరుగుతోంది. సందడ్లో సడేమియా అన్నట్లుగా ఈడీ అధికార టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు కంపెనీ ఆస్తులను జప్తు చేసింది. బీజేపీ తెరాసల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమని పరిస్థితి ఉన్న నేపథ్యంలో నామా ఆస్తుల జప్తు రాజకీయంగా మరింత వేడి పుట్టంచే అవకాశం ఉంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో హైదరాబాద్ లో మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలవడం, కేంద్రం రాష్ట్రానికి అన్ని విధాలుగా అన్యాయం చేస్తోందంటూ టీఆర్ఎస్ తన విమర్శల దాడిని పెంచడం, యశ్వంత్ సిన్హాను సరిగ్గా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యే రోజునే టీఆర్ఎస్ హైదరాబాద్ కు ఆహ్వానించడం వంటి సంఘటనల నేపథ్యంలో నామా ఆస్తుల జప్తునకు రాజకీయ ప్రాధాన్యత ఏర్పడిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే కేంద్రం తన రాజకీయ ప్రత్యర్థులను ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థల దాడులతో వేధిస్తున్నదన్న ఆరోపణలు ఉండనే ఉన్నాయి. కాగా నామా కంపెనీ విషయానికి వస్తే మధుకాన్ ప్రాజెక్ట్స్ పేర నామా నాగేశ్వరరావు ఆయన రాజకీయాలలోకి రావడానికి మందే ఓ కంపెనీని స్థాపించారు. ఆ కంపెనీ పలు రంగాలకు విస్తరించి మధుకాన్ గ్రూప్ అయ్యింది. నిర్మాణ రంగంలో ఉన్న నామా కంపెనీ రాంచీలో గతంలో నిర్మించిన ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణం కోసం తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించలేదన్న ఆరోపణలపై ఈడీ 2002లో కేసు నమోదు చేసింది. ఆ కేసుకు సంబంధించే ఇప్పుడు ఈడీ కంపెనీ ఆస్తులతో పాటు ఆ కంపెనీ డైరెక్టర్లు, ప్రమోటర్లకు చెందిన రూ.92.21 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేసింది. నామా నాగేశ్వరరావు హైదరాబాద్ లో రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కోసం జలవిహార్ లో టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఆయన ఆ సభలో ఉన్న సమయంలోనే ఈడీ ఆయన కంపెనీకి సంబంధించిన ఆస్తులను జప్తు చేయడం గమనార్హం
http://www.teluguone.com/news/content/trs-mp-nama-company-assets-seized-by-ed-39-138941.html





