కేసిఆర్ గొంతెమ్మ కోరికలే తెలంగాణాని జాప్యం చేస్తున్నాయా?
Publish Date:Jan 30, 2013
Advertisement
మొన్నతెలంగాణా జేయేసీ అద్వర్యంలో నిర్వహించిన సమరదీక్ష అనంతరం తెరాస నేతలు కాంగ్రెస్ పై దాడి మొదలుపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే, తెలంగాణా ఈయని కారణంగా కాంగ్రెస్ పార్టీని లక్ష్యం చేసుకొని దాడులు చేస్తామని ప్రకటించిన, కేసిఆర్ అదే సమయంలో తాము తెరసాను కాంగ్రెస్ లో విలీనం చేయడానికి సిద్దపడిన కూడా కాంగ్రెస్ వెనకంజ వేసిందని ఆరోపించారు. ఆ మరునాడే, కాంగ్రెస్ నాయకుడు వి.హనుమంతరావు తెరాసాను కాంగ్రెస్ లో విలీనం చేయనందునే తెలంగాణా విషయంలో ఆలశ్యం అవుతున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేసారు. అదే సమయంలో, సమరదీక్షను కేసిఆర్ హైజాక్ చేసినట్లు భావిస్తున్న తెలంగాణా ప్రజాసంఘాల నాయకుడు గజ్జెల కాంతం కూడా తెరాసా, కాంగ్రెస్ పార్టీల విలీనానికి ఏమి ఒప్పందం కుదుర్చుకోన్నారో ప్రజలకి తెలియజేయాలని డిమాండ్ చేసారు. ఇంతవరకు, చంద్రబాబు ఆదేశాలతో జరుగుతున్న పరిణామాలను చేతులు ముడుచుకొని చూస్తున్న తెలుగుదేశం పార్టీ తెలంగాణా నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి కూడా రంగంలోకి దూకారిప్పుడు. కేసిఆర్, అతని కుమారుడు కేటీర్ ఇద్దరూ కలిసి కాంగ్రెస్ పార్టీతో తెలంగాణా అంశంపై చర్చలు పేరిట గత సెప్టెంబర్ నెలలో డిల్లీలో నెలరోజులు మకాంవేసినప్పుడే తాము అనుమానించామని, వారు తెలంగాణా విషయం గురించికాక తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినందుకు తమ కుటుంభ సభ్యులందరికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పదవులు, ప్యాకేజీలు మాట్లాడుకొనేందుకే అక్కడ తిష్టవేసారని తాము చెప్పిన సంగతిని మళ్ళీ ఇప్పుడు గుర్తు చేస్తూ, ఆ రెండు పార్టీల విలీనం కోసం చేసుకొన్న ఒప్పంద వివరాలను బహిరంగ పరచాలని వారు డిమాండ్ చేసారు. హనుమంతరావు మాటలకు స్పందిస్తూ కేసిఆర్ తెరాస కాంగ్రెస్ పార్టీలో విలీనం గురించి తాము చిన్నా చితక నేతల మాటలకు జవాబునీయనవసరం లేదని, తాము నేరుగా కాంగ్రెస్ అధిష్టానంతోనే చర్చించడానికి సిద్దమని అన్నారు. అయినా కూడా, తెదేపా, కాంగ్రెస్ పార్టీల నేతలు కేవలం విలీన సమస్య వల్లనే తెలంగాణాపై జాప్యం జరుగుతున్నట్లు, పార్టీ విలీనానికి కేసిఆర్ కోరుతున్న గొంతెమ్మ కోరికల కారణంగానే కేంద్రం వెనకడుగువేస్తోందనట్లు, కేసిఆర్ దీనికి మూల కారకుడనట్లు మాట్లాడుతుంటే, తెరసా నాయకుడు హరీష్ రావు నష్ట నివారణ చర్యలకు పూనుకొని , తాము ఇప్పటికీ తమ పార్టీనికాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సిద్దంగా ఉన్నామని, అయితే తమను నిందిస్తున్న హనుమంతరావు, మధు యాష్కీ వంటి కాంగ్రెస్ నేతలు తమ అధిష్టానాన్ని వారం రోజులలోపు తెలంగాణా ఇస్తామని ప్రకటన చేయించగలరా? అలాగయితే తక్షణమే తాము విలీనానికి ఆమోదం తెలుపుతూ కాగితం వారి చేతికే ఇస్తామని సవాలు విసిరారు. హరీష్ రావు ఆ విదంగా అన్నవెంటనే హనుమంతరావు హుటాహుటిన డిల్లీ వెళ్లి పార్టీ అధిష్టానాన్ని కలవడంతో, కేవలం రెండు పార్టీల విలీన సమస్య కారణం గానే తెలంగాణా జాప్యం అవుతోందనే వాదనకు బలం చేకూరింది. ఇదే నిజమయితే, తెలంగాణా ఆకాంక్ష కన్నాతమ స్వార్ద రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమనుకొని తమను నమ్ముకొని తమ వెంటనడుస్తున్న తెలంగాణా ప్రజలను వారు మోసంచేస్తున్నట్లే భావించక తప్పదు.
http://www.teluguone.com/news/content/trs-37-20715.html