కెసిఆర్ పిచ్చి మాటలు మాను..ఎర్రబెల్లి హెచ్చరిక
Publish Date:Feb 11, 2012
Advertisement
హైదరాబాద్: టీఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ బుద్ది తెచ్చుకుని పిచ్చి మాటలు మానుకోవాలని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు. తెలంగాణకు 11 ఏళ్లుగా కెసిఆర్ ద్రోహం చేస్తూ వచ్చారని, ఇక కెసిఆర్ మోసాలు సాగవని ఆయన అన్నారు. అవినీతి ఆరోపణలు బయటపెట్టినందుకే కెసిఆర్ తమపై అక్కసు పెంచుకున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. పోలవరం టెండర్లను తాము రద్దు చేయించామనే కక్షతో తమపై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. తాము మహబూబ్‌నగర్, సిద్ధిపేట, కరీంనగర్ ఎక్కడైనా కెసిఆర్‌తో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని, కెసిఆర్ చెప్పిన చోటనే వేదికను ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. తెలంగాణ కోసం కెసిఆర్ ఒక్క త్యాగమైనా చేశాడా అని ఆయన అడిగారు. తెలంగాణ వచ్చే వరకు ఎన్నికల్లో పోటీ చేయవద్దనే తమ సూచనకు అంగీకరించాలని ఆయన అన్నారు. తెలంగాణను మోసం చేసిన కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని, ఆ పార్టీని కెసిఆర్ ఏ రోజు కూడా విమర్శించలేదని, పార్లమెంటులో తెలంగాణ గురించి మాట్లాడలేదని ఆయన విమర్శించారు. తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్‌పై కూడా ఆయన ధ్వజమెత్తారు. ప్రజలను మోసం చేయడం మానుకోవాలని, కెసిఆర్‌కు తొత్తుగా వ్యవహరించడం మానుకోవాలని ఆయన కోదండరామ్‌కు సూచించారు.
http://www.teluguone.com/news/content/trs-24-11815.html





