బ్రోతల్ హౌజ్‌గా బిగ్‌బాస్ హౌజ్!.. భీమ్లాకు బెదుర్స్.. ఉక్రెయిన్ వర్రీ.. టాప్‌న్యూస్ @7pm
Publish Date:Feb 26, 2022
Advertisement
1. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను తీసుకురావటానికి కేంద్రం అన్ని ఏర్పాట్లు చేస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. భారతీయల తరలింపులో ప్లాన్ ఏ..బీ..సీలను అమలు చేస్తున్నామన్నారు. విద్యార్థులు ఉన్న యూనివర్సిటీలు, హాస్టళ్లను గుర్తిస్తున్నామని తెలిపారు. భారతీయ విద్యార్థులు ధైర్యంగా ఉండాలన్నారు. విదేశాంగ శాఖ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోందని కిషన్‌రెడ్డి తెలిపారు. 2. ఉక్రెయిన్ విద్యార్థులకు విమాన టికెట్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ నుంచి సొంత ప్రాంతాలకు చేరేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఏపీ విద్యార్థులను తీసుకొచ్చేందుకు టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. ఉక్రెయిన్‌లో ఉన్న 423 మంది ఏపీ విద్యార్థులను మ్యాపింగ్ చేశారు. 23 మంది విద్యార్థులు వస్తున్నారని కేంద్రం సమాచారం ఇవ్వగా.. అందులో ఏపీకి చెందిన వారు ముగ్గురే ఉన్నట్టు తెలుస్తోంది. 3. భీమ్లానాయక్ సినిమా విడుదల సందర్బంగా ఏపీ ప్రభుత్వ తీరుపై జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహార్ తీవ్ర విమర్శలు చేశారు. సినిమాకు వచ్చేవారిని భయబ్రాంతులకు గురిచేసేందుకు ప్రభుత్వ ఉద్యోగులను థియేటర్ల దగ్గర ఉంచారని మండిపడ్డారు. సీఎం జగన్ అహాంకారంతో.. నియంతలా వ్యవహారిస్తున్నారని నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. 4. వివేకా హత్యలో వాస్తవాలు బయటికి వచ్చాయని సీపీఐ నారాయణ అన్నారు. స్వయానా సీఎం జగన్ కుటుంబం నుంచి ఇలాంటి హత్య సంస్కృతి వచ్చిందా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వివేకా హత్యపై జగన్ ఫ్యామిలీ నైతిక బాధ్యత వహించాలన్నారు. బిగ్‌బాస్ హౌస్ బ్రోతల్ హౌస్‌గా మారిందని.. లైసెన్స్ పొందిన వ్యభిచార గృహం నిర్వహించడానికి షో నిర్వహిస్తున్నారంటూ సీపీఐ నారాయణ విమర్శించారు. 5. నెల్లూరు జిల్లా వైసీపీ నేతలపై ఆ పార్టీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. తన పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న నాయకులపై ఆయన మండిపడ్డారు. ఇళ్ల పట్టాల కోసం ఎవరూ డబ్బులు ఇవ్వవద్దన్నారు. తన పేరుతో డబ్బులు వసూలు చేయవద్దని చెప్పినా వినడం లేదని ప్రసన్నకుమార్‌రెడ్డి మండిపడ్డారు. 6. రైతు చస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాజకీయాలు మాత్రమే కావాలని.. రైతు బతుకు గురించి మాత్రం సోయి లేదని వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల విమర్శించారు. ‘‘ఢిల్లీ కోటలు బద్దలు కొడుతాం, మోదీని తరిమేస్తాం అని చెప్పుకొనే కేసీఆర్.. రైతుల వడ్లు కేంద్రం చేత కొనిపించడం చాతకాదా? మీవన్నీ ఊకదంపుడు ఉపన్యాసాలేనా? మీకు దమ్ముంటే రాష్ట్రంలో పండిన ప్రతి గింజ కొనండి. కేంద్రం మెడలు వంచి కొనిపించండి’’ అంటూ షర్మిల మండిపడ్డారు. 7. రాయలసీమలో జిల్లాల పునర్విభజనపై 1600 వరకు అభ్యంతరాలు వచ్చాయని ఏపీ ప్లానింగ్ సెక్రటరీ విజయ్ కుమార్ అన్నారు. ప్రతి అంశాన్ని పూర్వపరాలు పరిశీలించి వాస్తవ పరిస్థితి ఏంటనేది చూస్తున్నామన్నారు. పెనుకొండ, హిందూపురం జిల్లా కేంద్రంగా ఏర్పాటు కోసం డిమాండ్ ఉందన్నారు. ఏ విధంగా జిల్లా కేంద్రం ఏర్పాటు ఉండాలనేది పరిశీలనలో ఉందని చెప్పారు. 8. ఏపీ ప్రభుత్వం రద్దు చేసిన ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాలను ప్రారంభించాలని మాజీ జడ్జి, హైకోర్టు న్యాయవాది శ్రవణ్ కుమార్ దీక్ష చేపట్టారు. విజయవాడ ధర్నా చౌక్‌లో ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. సబ్ ప్లాన్ నిధులను నవరత్నాలకు బదిలీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను వైసీపీ ప్రభుత్వం దారి మళ్లిస్తోందని మండిపడ్డారు. 9. గుంటూరు జిల్లాలోని వేమూరు నియోజకవర్గంలో వైసీపీ సర్పంచ్‌లు ఆందోళనకు దిగారు. కొల్లూరు మండలం గాజుర్లంక ఇసుక రిచ్ దగ్గర ఇసుక లారీలను సర్పంచులు అడ్డుకున్నారు. జేపీ కంపెనీ.. ఇసుక పేద ప్రజలకు అందకుండా చేస్తుందని ఆరోపణలు చేశారు. ఇసుక అధిక లోడ్‌తో లారీలు నడవటం వల్ల గ్రామాల్లో ఉన్న రోడ్డు మొత్తం నాశనం అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక లోతుగా తవ్వడం వల్ల చుట్టుపక్కల గ్రామాలలో భూగర్భజలాలు ఎండిపోతున్నాయన్నారు. 10. నల్లగొండ జిల్లా తుంగతుర్తి దగ్గర శిక్షణ విమానం కూలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు చనిపోయారు. ట్రైనింగ్ విమానం మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతుల్లో తమిళనాడుకు చెందిన ట్రైనీ పైలెట్ ఉన్నారు. ప్లైటెక్ ఏవియేషన్ అకాడమీకి చెందిన విమానంగా గుర్తించారు.
http://www.teluguone.com/news/content/top-news-7pm-39-132347.html





