జగన్‌ను టచ్ చేస్తే షాక్.. మంచు ముచ్చట్లు.. రోగ్ ఎవరు?.. టాప్‌న్యూస్ @7pm
Publish Date:Feb 15, 2022
Advertisement
1. ఏజెన్సీలో గంజాయి సాగు అవుతుందని, వైసీపీ వస్తే చీకటి రాజ్యం వస్తుందని తాను ముందే చెప్పానన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఒక్క చాన్స్ అని కరెంటు తీగని ఒక్కసారి పట్టుకుంటే ఏమవుతుందో.. ఇపుడు చూస్తున్నారని విమర్శించారు. 2. ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై బదిలీ వేటు పడింది. గౌతమ్ సవాంగ్‌కి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. జీఏడీలో రిపోర్ట్ చేయాలని గౌతమ్ సవాంగ్‌కి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డికి డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. 1992 బ్యాచ్‌కి చెందిన కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి 2026 ఏప్రిల్ 30 వరకు విధుల్లో ఉండే అవకాశముంది. 3. విశాఖలో పరిశ్రమ అభివృద్దికి తోడ్పడతామని సీఎం జగన్ చెప్పారని మా అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. తిరుపతిలో తాను సినిమా స్టూడియో కడతానని చెప్పారు. మోహన్‌బాబుతో పాటు మరో ఇద్దరు, ముగ్గురు హీరోలకు ఆహ్వానం పంపారని.. అది తమకు అందకుండా చేశారంటూ కలకలం రేపారు మంచు విష్ణు. 4. సీఎం జగన్‌ను నటుడు అలీ కలవడం ఆసక్తికరంగా మారింది. అలీకి రాజ్యసభ సీటు ఇవ్వనున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతున్న ఈ సమయంలో వారి భేటీకి ప్రాధాన్యం వచ్చింది. త్వరలోనే పార్టీ నుంచి ఓ నిర్ణయం వస్తుందంటూనే.. తాను పదవుల కోసం వైసీపీలోకి రాలేదన్నారు అలీ. 5. సీఎం కేసీఆర్‌కు మాజీ ప్రధాని, జేడీఎస్ అధ్యక్షుడు దేవెగౌడ మద్దతు పలికారు. దేశంలో మత తత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారని అభినందించారు. యుద్ధం కొనసాగించాలని కేసీఆర్‌కు సూచించారు. కేసిఆర్ కు ఫోన్ చేసిన దేవెగౌడ దేశ లౌకికవాద సంస్కృతిని కాపాడుకునేందుకు అంతా అండగా ఉంటామన్నారు. త్వరలోనే బెంగళూరుకు వచ్చి కలుస్తానని కేసీఆర్ దేవెగౌడకు తెలిపారు. 6. అందరు పదవుల కోసం పాకులాడుతే.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ఉద్యమం కోసం మంత్రి పదవి త్యాగం చేశారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొనియాడారు. భవిష్యత్ కార్యచరణపై ఇద్దరం కలిసి చర్చించామన్నారు. తాము చర్చించిన అంశాలను పార్టీలో చర్చకు పెట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కేసీఆర్ మోడీ కోవర్ట్ అని, కాంగ్రెస్ భాగస్వామ్య పక్షాలను చీల్చేందుకు కేసీఆర్ పనిచేస్తున్నారని విమర్శించారు. ఫ్రంట్ పేరుతో టెంట్ వేసి.. కాంగ్రెస్‌ను బలహీనపరిచే కుట్ర చేస్తున్నారన్నారు. 7. తెలంగాణలో అరాచక పరిపాలన కొనసాగుతుందని.. ఉద్యోగాలు భర్తీ చేయాలని తాను ప్రశాంతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే అరెస్టు చేసి నిర్బంధించడం దారుణమన్నారు వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల. ఉదయం టీఎస్పీఎస్సీ కార్యాలయం ముందు షర్మిల ఆందోళనకు దిగి బైఠాయించారు. పోలీసులు ఆమెను అరెస్టు చేసి 4 గంటలు పోలీస్ స్టేషన్లోనే ఉంచి అనంతరం విడిచి పెట్టారు. 8. వైసీపీలో ఒక రోగ్ ఉన్నాడని.. రాష్ట్రానికి అప్పులు ఇవ్వొద్దు అని లేఖలు రాస్తున్నాడని ప్రధానికి సీఎం జగన్ లేఖ రాశారని.. ఇంతకీ ఆ రోగ్ ఎవరని ప్రజలందరికీ సందేహం కలుగుతోందన్నారు ఎంపీ రఘురామ. రాష్టాన్ని అప్పుల్లో ముంచి నాశనం చేస్తున్నవారు రోగ్ అవుతారా? లేక, ప్రశ్నించిన వారిని రోగ్ అంటారా?.. అసలు రోగ్ ఎవరని ప్రశ్నించారు. 9. కడప సెంట్రల్ జైలు ఇన్‌చార్జి సూపరిండెంట్ వరుణారెడ్డి ఒంగోలుకు బదిలీ అయ్యారు. గతంలో పరిటాల రవి హత్య కేసులో నిందితుడు మొద్దుశీను హత్యకేసులో నాటి అనంతపురం జైలర్‌గా అనేక ఆరోపణలు ఎదుర్కొని సస్పెండ్‌కు వరుణారెడ్డి గురయ్యాడు. ఇటీవల కడప సెంట్రల్ జైలు ఇన్ చార్జి సూపరిండెంట్‌గా వరుణారెడ్డిని నియమించడం తీవ్ర వివాదాస్పదం కావడంతో ఆయనపై బదిలీవేటు పడింది. 10. చార్మినార్ దగ్గర పురావస్తు శాఖ తవ్వకాల్లో అండర్‌గ్రౌండ్ స్టెప్స్ బయటపడ్డాయి. వెంటనే తవ్వకాలను అధికారులు నిలిపివేశారు. చార్మినార్ దగ్గర తవ్వకాలపై ఎంఐఎం ఆగ్రహం వ్యక్తం చేసింది. భూగర్భ మెట్లను పురావస్తు అధికారులు పరిశీలిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/top-news-7pm-39-131832.html





