పీఆర్సీ రగడ.. వనమా మరో చిట్టా.. పీఎంకు లేఖాస్త్రం.. టాప్ న్యూస్@7PM
Publish Date:Jan 8, 2022
Advertisement
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన మూడవ రోజు కొనసాగుతోంది. శనివారం ఉదయం కుప్పం ఆర్అండ్‌బి అతిథిగృహం వద్ద టీడీపీ కార్యకర్తలు, నాయకులు.నియోజకవర్గ ప్రజల సమస్యలపై బాబుకు వినతి పత్రాలు అందించారు. అక్కడి నుంచి పార్టీ కార్యాలయానికి చేరుకున్న టీడీపీ అధినేత... పార్టీ ఆఫీస్‌ను పరిశీలించారు. అనంతరం సొంత నివాసం నిర్మాణ పనులు ప్రారంభించడానికి స్థలం ఎంపిక, పరిశీలన వంటి అంశాలపై నాయకులతో పార్టీ కార్యాలయంలో చంద్రబాబు చర్చలు నిర్వహించారు
-------
ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు విషయంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం అటు ఉద్యోగులను, ఇటు నిరుద్యోగులను ఇద్దరినీ నిరాశ పరిచిందన్నారు. పదవీ విరమణ వయస్సును 60నుంచి 62 ఏళ్లకు పెంచడం ద్వారా నిరుద్యోగుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లిందన్నారు. సీపీఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశంలోనూ చేతులెత్తేసినట్లు తులసిరెడ్డి వ్యాఖ్యలు చేశారు.
----
సీఎం జగన్ పీఆర్సీ విషయంలో ఉద్యోగులను నిరుత్సాహానికి గురిచేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కొందరు ఉద్యోగ సంఘ నేతలు బాగానే ఉందని కంటి తుడుపు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సజ్జల ఉద్యోగ సంఘాల నేతలతో సంతృప్తిగా ఉందని పాజిటివ్ స్టేట్ మెంట్స్ ఇప్పించారన్నారు.
----
ఆదివారం జరగాల్సిన జనసేన పార్టీ కార్యనిర్వాహక సమావేశం వాయిదా పడింది. కోవిడ్ కేసులు పెరుగుతున్నందున వాయిదా వేసినట్లు పార్టీ నేతలు ప్రకటించారు.ఈనెల 9న సమావేశంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నట్లు తొలుత ప్రకటించారు. కాగా మూడు రోజుల నుంచి పెరుగుతున్న కేసులతో పార్టీ పునరాలోచనలో పడింది. కార్యకర్తలు, అభిమానుల శ్రేయస్సు దృష్ట్యా వాయిదా వేసినట్లు ప్రకటించింది.
----------
కాంగ్రెస్ శిక్షణ శిబిరాలు వాయిదా పడ్డాయి. కొవిడ్ కారణంగా వాయిదా వేస్తున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు సెలబ్రిటీ రీసార్ట్స్‌లో ఏఐసీసీ శిక్షణ శిబిరాన్ని నిర్వహించేందుకు టీపీసీసీ ఏర్పాట్లు చేసుకుంది. దేశంలో.. రాష్ట్రంలో రోజు రోజుకూ కరోనా పెరిగిపోతోంది. ఈ క్రమంలనే కాంగ్రెస్ శిక్షణా శిబిరాలను వాయిదా వేసింది.
----
కోరుట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఇంట్లో స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శనివారం తెల్లవారుజామున ఇంట్లో పిండి పదార్థాలు చేస్తుండగా గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే భార్య సరోజకు స్వల్పగాయాలు కావడంతో వెంటనే హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు.
---
రామకృష్ణను బెదిరించినట్లు ఎమ్మెల్యే వనమా కొడుకు రాఘవ అంగీకరించాడని పాల్వంచ ఏఎస్పీ రోహిత్ రాజ్ చెప్పారు. ఈ నెల 3న పాత పాల్వంచలో రామకృష్ణ దంపతులు, ఇద్దరు కుమార్తెలు మృతి చెందారని తెలిపారు. భార్య, కుమార్తెలపై పెట్రోల్ పోసి నిప్పు అంటించి, తనకు కూడా నిప్పు అంటించుకుని రామకృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడని వివరించారు. అనంతరం రామకృష్ణ బావమరిది జనార్దన్ చేసిన ఫిర్యాదుతో తాము కేసు నమోదు చేశామని తెలిపారు.
------
‘మీ మౌనం విద్వేష గళాలకు మరింత ధైర్యాన్నిస్తోంది’’ అంటూ బెంగళూరు, అహ్మదాబాద్‌లలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విద్యార్థులు, ఫ్యాకల్టీ సభ్యులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. దీనిపై 183 మంది సంతకాలు చేశారు. మన దేశ బహుళ సంస్కృతుల కలనేతకు తాము విలువనిస్తామని, అటువంటి తమకు మన దేశంలో పెరుగుతున్నఅసహనంపై మీ మౌనం నిరుత్సాహం కలిగిస్తోందన్నారు.
---
దక్షిణ చైనాలోని చాంగ్ కింగ్ మున్సిపాలిటీలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో 16 మంది దుర్మరణం చెందగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. చాంగ్ కింగ్ నగరంలోని క్యాంటీన్‌లో గ్యాస్ లీక్ కారణంగా పేలుడు సంభవించిందని చైనా ప్రభుత్వ అధికారులు చెప్పారు. ఈ పేలుడు ధాటికి క్యాంటీన్ కుప్పకూలిపోయింది. మృతదేహాలను శిథిలాల నుంచి వెలికి తీశారు.
---
జాతీయ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షి్‌పలో హైదరాబాద్‌కు చెందిన వైష్ణవి మూడు పతకాలు సాధించి సత్తా చాటింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈనెల 6వ తేదీన జరిగిన పోటీల్లో వైష్ణవి సబ్ జూనియర్ 84 కిలోల విభాగంలో పసిడి పతకం నెగ్గింది. ఇదే విభాగంలో స్క్వాట్ అండ్ బెంచ్ ప్రెస్, డెడ్ లిఫ్ట్‌లో రెండు కాంస్యాలు కొల్లగొట్టి అదరగొట్టింది.
http://www.teluguone.com/news/content/top-news-39-129862.html





