వైసీపీలో వర్గ పోరు.. ముందస్తు ముచ్చట.. కేటీఆర్ కోవర్టు కాడట.. శ్రీవారి అలర్ట్.. టాప్ న్యూస్@7PM
Publish Date:Jan 2, 2022
Advertisement
పెట్రోల్, డీజిల్ ధరలు ఏపీలో ఉన్నంతగా దేశంలో మరెక్కడా లేవని టీడీపీ సీనియర్ నేత ధూళిపాల నరేంద్ర విమర్శించారు. సినిమా టికెట్లపై ఉన్న శ్రద్ధ సామాన్య ప్రజలపై లేదని అన్నారు. రూ.3 వేలు పెన్షన్ ఇస్తానన్న జగన్ మాటతప్పారని, దశల వారీగా అంటున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ పర్యటనలో 2 కిలోమీటర్ల వరకు బారికేడ్లు ఏర్పాటు చేశారని... భారత్, పాకిస్థాన్ దేశాల మధ్యన కూడా ఇంత ఎత్తు బారికేడ్లు ఏర్పాటు చేయరని ఎద్దేవా చేశారు.
-------
ముందస్తు ఎన్నికలు వస్తే తాము సిద్ధంగా ఉన్నామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించడంపై వైసీపీ యువ ఎంపీ మిథున్ రెడ్డి స్పందించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ఐదేళ్ల పాటూ తాము అధికారంలో ఉంటామని తెలిపారు. పార్టీని కాపాడుకునేందుకే చంద్రబాబు ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడుతున్నారని మిథున్ రెడ్డి విమర్శించారు.
------
పాయకరావుపేట వైసీపీలో కుమ్ములాటలు రోజురోజుకు ముదురుతున్నాయి.ఎమ్మెల్సే బాబూరావు తీరుపై సొంత పార్టీ నేతలే భగ్గుమన్నారు. ఎమ్మెల్యే బాబూరావుకు వ్యతిరేకంగా వైసీపీ నేతల పాదయాత్రకు చేశారు. ఎంసీటీసీ బొలిశెట్టి గోవింద్ ఆధ్వర్యంలో పెద్దగుమ్ములూరు దగ్గర పాదయాత్ర చేశారు. బాబూరావు వద్దు జగన్ ముద్దు అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. జాతీయ రహదారిపై నేతలు బైఠాయించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు
---------
విజయవాడ శివార్లలోని ఇబ్రహీంపట్నం వద్ద జుంబా డే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ కూడా డ్యాన్స్ చేశారు. టాలీవుడ్ హీరో సంపూర్ణేశ్ బాబుతో కలిసి ఆయన జుంబా డ్యాన్స్ చేశారు. యువతను జుంబా డ్యాన్స్ పట్ల ప్రోత్సహించేందుకు ఎమ్మెల్యే జోగి రమేశ్, హీరో సంపూ వేదికపై ఉత్సాహంగా కాలు కదిపారు. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు.
-------
తాను కేటీఆర్ కోవర్టునంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ నేతలు ఎవరూ కేటీఆర్ ను కలవలేదా? అని ప్రశ్నించారు. ప్రత్యర్థి పార్టీల నేతలు ఎదురుపడినప్పుడు పలకరించడం, మాట్లాడడం సంస్కారం అని స్పష్టం చేశారు. కేటీఆర్ తోనూ ఆ విధంగానే మాట్లాడానని అన్నారు. కేటీఆర్ తన భుజంపై చేయి వేసినా, తాను ఆయన భుజంపై చేయి వేయలేదని వివరణ ఇచ్చారు.
----
ఒపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ 'గిట్ హబ్' వేదికగా కార్యకలాపాలు నిర్వహించే 'బుల్లి బాయి' అనే యాప్ లో ముస్లిం మహిళల ఫొటోలు పోస్టు చేస్తూ వారిని వేలం వేస్తున్నట్టు ప్రచారం చేస్తుండడంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని ఊరికే వదలరాదని మండిపడ్డారు. ఇలాంటి చెదపురుగులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ తెలంగాణ సీఎం కార్యాలయాన్ని, మంత్రి కేటీఆర్ ను, తెలంగాణ డీజీపీని, హైదరాబాద్ సీపీని డిమాండ్ చేశారు.
-----
శ్రీశైల దేవస్థానం మర్యాదను కాపాడటంలో సీఎం జగన్ విఫలమయ్యారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు.హిందూ దేవాలయాల పరిధిలో అన్యమతస్తులు వ్యాపారాలు చేయకూడదని, మాజీ సీఎం వైఎస్ హయాంలో 426 జీవో తీసుకొచ్చారని గుర్తుచేశారు. జగన్ పాలనలో 426 జీవోను పక్కన బెట్టి.. ఇతర మతస్తులు వ్యాపారాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ హిందువులు హైకోర్టుకు వెళితే ఇతర మతస్తులు సుప్రీంకోర్టుకు వెళ్లారని తెలిపారు.
--------
ఈసారి జనవరి 13 నుంచి 22 వరకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నట్టు టీటీడీ వెల్లడించింది. ఈసారి వైకుంఠద్వార దర్శనానికి సిఫారసు లేఖలు తీసుకోబోమని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. వీఐపీలు స్వయంగా వస్తేనే వైకుంఠద్వార దర్శన టికెట్లు జారీ చేస్తామని చెప్పారు. వీఐపీలకు నందకం, వకుళమాత వసతి భవనంలో గదులు కేటాయిస్తామని, తిరుమలలో గదులు లభ్యం కాకపోతే తిరుపతిలోనే వసతి ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
---
ఆర్కే బీచ్‌లో విషాదం చోటు చేసుకుంది. సముద్రంలో నలుగురు గల్లంతయ్యారు. ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. మృతులు సునీత త్రిపాఠి(ఒడిషా), శివ(హైదరాబాద్)గా గుర్తించారు. సునీత త్రిపాఠి.. పిక్‌నిక్ కోసం ఒడిషా నుంచి వచ్చినట్లు గుర్తించారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.
-----------
ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్, దాని పరిసర ప్రాంతాలు స్వతంత్ర భారత దేశానికి నూతన దిశానిర్దేశం చేస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దేశ రక్షణ, క్రీడా రంగాల్లో దేశ భక్తి జ్వాలను రగిలిస్తున్నారన్నారు. మేజర్ ధ్యాన్‌చంద్ క్రీడా విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. భరత మాత ముద్దు బిడ్డ మేజర్ ధ్యాన్‌చంద్ పుట్టిన గడ్డ మీరట్ అని పేర్కొన్నారు. కొద్ది నెలల క్రితం క్రీడా రంగంలో దేశంలో అత్యున్నత స్థాయి పురస్కారానికి ఆయన పేరు పెట్టామని చెప్పారు
--
http://www.teluguone.com/news/content/top-news-39-129479.html





