సీఎం పేరుతో భూకబ్జాలు.. పందేలకు రెడీ.. ఒమిక్రాన్ డబుల్ సెంచరీ.. టాప్ న్యూస్@1PM
Publish Date:Dec 21, 2021
Advertisement
బీజేపీ ఎంపీ సుజనా చౌదరి జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. విశాఖలో జగదీశ్వరుడు, ఒంగోలులో సుబ్బారావు గుప్తాపై దాడి ఘటనలు ఏపీలో జరుగుతున్న అరాచకానికి పరాకాష్ట అని అన్నారు. సీఎం, మంత్రులు, ఎంపీల పేర్లతో బెదిరించడం, కబ్జాలకు పాల్పడడం రివాజుగా మారిందని ఆరోపించారు. బాధితులు వేధింపులకు భయపడకుండా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదుల కాపీలు తనకు పంపించాలని, బాధితులకు అండగా ఉంటానని సుజనా చౌదరి హామీ ఇచ్చారు.
----
ముఖ్యమంత్రి జగన్ కు మాజీ మంత్రి, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. సంక్రాంతి, ఉగాది పండుగలకు ఎడ్లు, గుర్రం, కోడిపందేలు నిర్వహించుకునేందుకు అనుమతిని ఇవ్వాలని లేఖలో ఆయన కోరారు. సంక్రాంతి, ఉగాది ఉత్సవాల్లో గుర్రం, కోడి పందేలు, ఎడ్లు బరువు లాగే పోటీలు తదితర కార్యక్రమాలను ఐదు రోజుల పాటు జరుపుకోవడం ఆనవాయతీగా వస్తోందని చెప్పారు.
----
కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లేఖ రాశారు. కొత్త రకం తెగుళ్ల ముప్పుతో రైతులు కుంగిపోతున్నారని చెప్పారు. ఇప్పటికే అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఇప్పుడు మరో కష్టం వచ్చిందని, వారిని ఆదుకోవాలని కోరారు. పంట నష్టం అంచనా వేసి తక్షణమే పరిహారం ఇచ్చి ఆర్థికంగా ఆదుకోవాలని కేంద్రమంత్రిని కోరామని గల్లా జయదేవ్ ట్వీట్ చేశారు.
------
ఒంగోలులో సొంత పార్టీ నేతపై వైసీపీ నేతలు దాడికి దిగడం సంచలనంగా మారింది. అయితే ఈ ఘటన జరిగిన కొన్ని గంటలకే మరో ట్విస్ట్ జరిగింది. సొంత పార్టీ నేతలతో దెబ్బలు తిన్న వైసీపీ నేత సుబ్బారావు గుప్తా.. మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని కలిశాడు. మంత్రితో కలిసి సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నాడు.
--------
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సీఎం టూరులో వైసీపీ నేతలు సొంత డబ్బా ప్లకార్డులను ప్రదర్శిస్తూ హల్‌చల్ చేశారు. సభా ప్రాంగణం గేటు వద్ద మహిళలకు జై జగన్.. హ్యాపీ బర్త్ డే అని ఉన్న ప్లకార్డులను పార్టీ నాయకులు అందజేశారు. పార్టీ నేతల వైఖరిపై మహిళలు విస్మయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమంలో పార్టీ నేతలు హడావుడి చేయడం ఏంటని మండిపడ్డారు.
--------
మంత్రి కేటీఆర్ నియోజకవర్గంలో రైతుల ఆత్మహత్యలు చేసుకోవడం సిగ్గు చేటని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. టీఆర్‌ఎస్ కు కనీసం ఇంగిత జ్ఞానం లేదని, రైతులకు పంట నష్ట పరిహారం కూడా ఇవ్వడం లేదని తీవ్రస్థాయిలో విమర్శించారు. రుణమాఫీ ఇంకా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. రైతు ఆవేదన యాత్రలో భాగంగా ఆమె రాజన్న సిరిసిల్ల జిల్లాలో షర్మిల పర్యటిస్తున్నారు.
-------
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశానని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నేతృత్వంలో అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా సారంగపూర్ జెడ్పీటీసీ పి రాజేశ్వర్ రెడ్డి నామినేషన్ వేశారని, ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి నామినేషన్ వెనక్కి తీసుకున్నట్టు పత్రాలు సమర్పించారన్నారు.
-------
తెలంగాణలో మరో ఒమిక్రాన్ కేసు నిర్ధారణ అయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెంకు చెందిన వ్యక్తి దుబాయ్ నుంచి వచ్చాడు. ఇంటికి చేరుకున్న అతనికి ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయనను వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాదుకు తరలించారు. ఆయన కుటుంబ సభ్యులను, ఆయనతో కాంటాక్ట్ లోకి వచ్చిన మరో ఏడుగురిని క్వారంటైన్ చేశారు.
---
భారతదేశంలో ఇప్పటివరకు 200 మంది రోగులు ఒమైక్రాన్ వేరియంట్ కరోనావైరస్ బారిన పడినట్లు నిర్ధారణ అయింది. ఒమైక్రాన్ వేరియెంట్ సోకిన వారిలో 77 మంది రోగులు కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.మహారాష్ట్ర, ఢిల్లీలలో 54 ఒమైక్రాన్ వేరియంట్ కేసులు నమోదవగా, తెలంగాణలో 20, కర్ణాటకలో 19, రాజస్థాన్‌లో 18, కేరళలో 15, గుజరాత్‌లో 14 కేసులు నమోదయ్యాయి.
----
జమ్మూ-కశ్మీరు శాసన సభ నియోజకవర్గాల పునర్విభజనపై రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జమ్మూ ప్రాంతంలో కొత్తగా ఆరు నియోజకవర్గాలను, కశ్మీరు ప్రాంతంలో కొత్తగా ఒక నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయాలని డీలిమిటేషన్ కమిషన్ ప్రతిపాదించడంతో పార్టీలు ఆగ్రహంగా ఉన్నాయి.
---
http://www.teluguone.com/news/content/top-news-25-128801.html





