వైసీపీకే బలిసింది.. జీతం కట్.. రైతు పింఛన్.. కరోనా పంజా.. టాప్‌న్యూస్@7pm
Publish Date:Jan 12, 2022
Advertisement
1, ఎవరికి బలిసిందో తెలియాలంటే వైసీపీ ఎమ్మెల్యేలు దమ్ముంటే ఓపెన్ డిబేట్‌కు రావాలని దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సవాల్ విసిరారు. "మీ ఎమ్మెల్యేలు ఎంతెంత తింటున్నారు? మీ చరిత్రలేంటి? ఎవరిని మెప్పించడానికి మీరు బలుపులు, కులాల గురించి మాట్లాడుతున్నారు? రాజకీయాల్లోకి రాకముందు మీ ఆస్తులు ఎంత...వచ్చాక ఎంత? ఎవరి ఆస్తి ఎంతుందో లెక్క తీద్దామా?" అంటూ వైసీపీ లీడర్లపై తమ్మారెడ్డి మండిపడ్డారు. 2. ఉద్యోగులకు కనీసం 27 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలంటూ సీఎం జగన్‌కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ రాశారు. గత 10 పీఆర్సీలలో ఇంటీరియం రిలీఫ్ కన్నా ఫిట్మెంట్ తక్కువగా ఇవ్వలేదని తెలిపారు. పీఆర్సీపై ప్రభుత్వ ప్రకటన ఉద్యోగులను నిరాశకు గురిచేసిందన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులకు 2021 అక్టోబర్ నాటికే రెండేళ్లు పూర్తైందని, తక్షణమే సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ ఖరారు చేసి.. పే స్కేల్‌ను అమలు చేయాలని లేఖలో రామకృష్ణ డిమాండ్ చేశారు. 3. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కారు షాకిచ్చింది. ప్రొబేషన్ డిక్లరేషన్ చేయాలంటూ ఇటీవల వార్డు గ్రామ సచివాలయ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలో 10,665 సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. విధులకు హాజరు కాకుండా నిరసనలో పాల్గొన్నందుకు వారి ఒక రోజు జీతంలో ప్రభుత్వం కోత పెట్టింది. 4. అధికారంలో నుంచి సీఎం జగన్ రెడ్డి దిగిపోతేనే నిజమైన సంక్రాంతి అని ప్రజలు భావిస్తున్నారని టీడీపీ విమర్శించింది. ధరలు దిగిరావాలి-జగన్ రెడ్డి దిగిపోవాలి.. అంటూ చేసిన నిరసన కార్యక్రమాలు భారీస్థాయిలో విజయవంతమయ్యాయని తెలిపింది. ప్రతిపక్షంలోఉన్నప్పుడు ధరలపై గొంతుచించుకున్న జగన్ రెడ్డి, ఇప్పుడేం సమాధానం చెబుతాడని ప్రశ్నించింది. సంక్రాంతి పండుగతో కళకళలాడాల్సిన రైతుల లోగిళ్లు.. ఉసూరుమంటున్నాయని టీడీపీ అధికార ప్రతినిధి ఆవేదన వ్యక్తం చేశారు. 5. జగన్ ప్రభుత్వ వైఫల్యాలపై మాజీమంత్రి దేవినేని ఉమా ఫైర్ అయ్యారు. పోలవరం నిర్వాసితులు, అమరావతి రైతులు, విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల దీక్షలతో ప్రజాగ్రహానికి జగన్ సర్కార్ గురైందన్నారు. కేంద్ర జల వనరులశాఖ మంత్రి, ఆర్థికమంత్రి, ప్రధానికి ఇచ్చిన వినతి పత్రాలను జగన్ ప్రభుత్వం మీడియా ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. కొన్ని చానెళ్ల ప్రసారాలను వీక్షించవద్దన్న అధికారపార్టీ తీరుపై ఉమా మండిపడ్డారు. 6. త్వరలో తెలంగాణ సర్కారు రైతులకు పింఛన్ ఇచ్చే స్కీమ్ తీసుకురానున్నట్టు తెలుస్తోంది. రైతులకు నెలకు 2వేలు పింఛన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారట. 47 ఏళ్లు నిండిన చిన్న, సన్నకారు రైతులకు పింఛన్ ఇచ్చే ఆలోచన చేస్తున్నారని చెబుతున్నారు. రైతు పింఛన్ సాధ్యాసాధ్యాలపై ఆర్థికశాఖ కసరత్తు మొదలుపెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. 7. దేశ వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసే దిశగా, రైతాంగం నడ్డివిరిచే దిశగా, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఎరువుల ధరల పెంపు నిర్ణయంపై సీఎం కేసీఆర్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రైతుల ఆదాయాన్ని 2022 కల్లా రెట్టింపు చేస్తామని గొప్పలు చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు విపరీతంగా పెంచి దేశ రైతాంగ నడ్డి విరిచిందని మండిపడ్డారు. ఎరువుల ధరల పెంపుపై నిరసన వ్యక్తం చేస్తూ ప్రధానికి బహిరంగ లేఖ రాశారు సీఎం కేసీఆర్. 8. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోయారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. అందుకే ఇతర రాష్ట్రాల నేతలను పిలుచుకుని మాట్లాడుతున్నారని విమర్శించారు. ఉపాధ్యాయులు చనిపోతున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదని తప్పుబట్టారు. ఉపాధ్యాయులను పిలిచి భరోసా ఇవ్వాల్సిన సీఎం కేసీఆర్.. ఇతర రాష్ట్రాల నేతలతో రాజకీయాలపై దృష్టి పెడుతున్నారని మండిపడ్డారు. 9. ఏపీలో గడిచిన 24 గంటల్లో ఏకంగా 3,205 కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 10,119 యాక్టివ్ కేసులున్నాయి. వచ్చే నాలుగు రోజులు సంక్రాంతి వేడుకలు ఉండటంతో కరోనాతో ప్రజలు మరింత హడలిపోతున్నారు. 10. ఆనందయ్యపై ఆయుష్ శాఖ సీరియస్ అయింది. ఒమైక్రాన్ పేరుతో మందు పంపిణీపై ఆనందయ్యకు ఆయుష్ శాఖ నోటీసులిచ్చింది. మందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. ఆనందయ్య పంపిణీ చేస్తోన్న ఒమైక్రాన్ మందుకు అనుమతి లేదని ఆయుష్ కమిషనర్ రాములు తెలిపారు. అనుమతి లేకుండా పంపిణీ ఎలా చేస్తారంటూ నోటీసులు ఇచ్చామని చెప్పారు.
http://www.teluguone.com/news/content/top-news--7pm-39-130115.html





