యూపీలో మరో మంత్రి రాజీనామా.. క్యూలో ఇంకొందరు..
Publish Date:Jan 12, 2022
Advertisement
ఉత్తర్ ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార బీజేపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు క్యూకట్టి పార్టీకి గుడ్ బై చెపుతున్నారు. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ మంత్రి వర్గంలో కీలక మంత్రి, ఓబీసీ నేత స్వామి ప్రసాద్ మౌర్యరాజీనామా చేసి ఇంకా 24 గంటలు అయినా గడవక ముందే మరో మంత్రి, మంత్రి దారా సింగ్ చౌహన్ కూడా ఈరోజు (బుధవారం) రాజీనామా చేశారు. స్వామి ప్రసాద మౌర్యతో పాటుగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా రాజీనామాకు సిద్దమైన విషయం తెలిసిందే. అయితే ఇంతవరకు రాజీనామా చేసిన మంత్రి మౌర్య సహా ఎమ్మెల్యేలు ఎవరు పార్టీ కి రాజీనామా చేయక పోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అలాగే, మంత్రి మౌర్యతోపాటుగా ఎమ్మెల్యేలు సమాజ వాదీ పార్టీలో చేర్తుతున్నట్లు వార్తలు వచ్చినా, మౌర్య అలాంటి నిర్ణయం ఏదీ ఇంతవరకు తీసుకోలేదని స్పష్టం చేశారు. అదలా ఉంటే, తాజాగా మంత్రి పదవికి రాజీనామా చేసిన యోగి క్యాబినెట్లోని మంత్రి దారా సింగ్ చౌహన్ కూడా, తమ రాజీనామాకు మౌర్య ఏ కారణాలు అయితే చెప్పారో అవే కారణాలు చెప్పారు. ముఖ్యమంత్రి ఫై అవే ఆరోపణలు చేశారు. ఆయన మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో, ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో రైతులు, దళితులు, వెనుకబడిన వర్గాలు, నిరుద్యోగ యువత నిర్లక్ష్యానికి గురయ్యారని ఆరోపించారు. వెనుకబడిన, దళితుల రిజర్వేషన్లు మోసం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ వైఖరి వల్ల మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేస్తున్నానని దారా సింగ్ చౌహాన్ అన్నారు. దారాసింగ్ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బధుబన్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్ధిగా పోటీచేసి విజయం సాధించారు. అదలా ఉంటే రాజీనామాల ప్రహసనం ఇప్పట్లో ముగియదాని, వరసగా ఒక్కొక్కరుగా బయటకు వస్తారని, ఆ విధంగా బీజేపీని ప్రతి రోజు ఇరకాటంలోకి నెట్టే వ్యూహంతోనే ఇలా వరస రాజీనామాల వ్యూహం మాలు చేస్తున్నారని అంటున్నారు. అందరు బయటకు వచ్చిన తర్వాత ఒకేసరి ఎస్పీలో చేరే అవకాశం ఉందని అంటున్నారు. ఏమైనా, అధికార బీజేపీకి రాజీనామాల ప్రహసనం తలనొప్పిగా మారింది. కాగా, తాను పార్టీని వీడటంతో బీజేపీలో భూకంపం వచ్చిందని మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య వ్యాఖ్యానించారు. తాను మంత్రి పదవికి రాజీనామా చేయడాన్ని స్వామి ప్రసాద్ సమర్ధించుకున్నారు. నేను కేవలం మంత్రి పదవికే రాజీనామా చేశాను.. త్వరలోనే బీజేపీకి రాజీనామా చేస్తాను.. ప్రస్తుతం నేను సమాజ్వాదీ పార్టీలో చేరలేదు.. బీజేపీని నేను తిరస్కరించాను.. తిరిగి ఆ పార్టీలోకి వెళ్లే ప్రశ్నే లేదు’’ అని స్పష్టం చేశారు. ఇదే సమయంలో జనవరి 14న ఎస్పీలో చేరుతున్నట్టు చెప్పారు. తనకు ఏ రాజకీయ నేత నుంచి కూడా పిలుపు రాలేదని తెలిపారు. మౌర్య ప్రసాద్, దారా సింగ్ నలుగురు ఎమ్మెల్యేలు రోషన్ లాల్ వర్మ, బ్రిజేష్ ప్రజాపతి, భగవతి సాగర్, వినయ్ శాక్యలు మంగళ వారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
http://www.teluguone.com/news/content/another-minister-resigned-in-uttar-pradesh-39-130117.html





