టాప్ న్యూస్ @ 7pm
Publish Date:Oct 9, 2021
Advertisement
1. తెలంగాణ ప్రజలు తనను పిలిచే వరకు ఇక్కడకు రానని జనసేనాని పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు. తెలంగాణ సమస్యలపై పోరాడే వారిని అసెంబ్లీకి పంపించటానికి కృషి చేస్తానన్నారు. కులం, మతం, రంగు, ప్రాంతం మనకు తెలియకుండా జరిగిపోతాయని, కులాలను రెచ్చగొట్టడం తన ఉద్దేశం కాదని చెప్పారు.. కులాల కొట్లాటతో ఏపీ అభివృద్ధి దిగజారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో వైసీపీ నాయకులు తనకు శత్రువులు కాదని.. దౌర్జన్యం, అవినీతి, పేదరికమే జనసేనకు బద్దశత్రువులని పవన్ అన్నారు. 2. ఏపీ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని.. వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారం అప్పులు చేస్తోందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.6 లక్షల కోట్ల అప్పు చేసిందని.. అమరావతిని కూడా తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నారని తప్పుబట్టారు. ఎంతో మంది సలహాదారులు ఉన్న ఈ ప్రభుత్వం ఆర్థిక దయనీయ పరిస్థితులు ఉండటం దారుణమన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏపీకి గడ్డు పరిస్థితి తప్పదని ఉండవల్లి హెచ్చరించారు. 3. హరీష్‌రావు, ఈటల రాజేందర్.. ఇద్దరూ తోడు దొంగలేనని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. ఈటల వందల కోట్లు, కేసీఆర్ వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ నామినేషన్ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. కౌశిక్‌రెడ్డి టీఆర్ఎస్లోకి పోతే పదవి వస్తుందని అనుకున్నారని.. పదవీ రాలే.. పైసలు కూడా రాలేదని రేవంత్‌రెడ్డి సెటైర్లు వేశారు. 4. తాము బీజేపీతో కలిసే ఉన్నామని జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. పార్టీ స్టాండ్ ప్రకారమే బద్వేలులో తమ అభ్యర్థిని నిలబెట్టడం లేదని తెలిపారు. బద్వేల్ ఉపఎన్నికలో బీజేపీ గెలుపు కోసం సహకరిస్తామని ప్రకటించారు. పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తిగత విమర్శలు మానుకొని అభివృద్ధిపై దృష్టి సారించాలని ప్రభుత్వానికి నాదెండ్ల మనోహర్ సూచించారు. 5. ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు తీర్పు హర్షణీయమని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని మంత్రి బొత్స మాట్లాడడం దిగజారుడుతనమని దుయ్యబట్టారు. ఒక సెంటు, ఒకటిన్నర సెంటు స్థలంలోనే ఇంటి నిర్మాణం అవుతుందా? అని ప్రశ్నించారు. ఇళ్ల పట్టాలకు భూ సేకరణలో అవినీతి జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నించేవారిపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. 6. హెటిరో డ్రగ్స్‌లో రూ.142 కోట్ల నగదును ఐటీ అధికారులు సీజ్ చేయడం సంచలనంగా మారింది. మరో రూ.550 కోట్ల నగదు నిల్వల లెక్కలు తేలాల్సి ఉందని అంటున్నారు. 4 రోజులుగా 6 రాష్ట్రాల్లో 50 ప్రాంతాల్లో హెటిరో సంస్థ కార్యాలయాలు, డైరెక్టర్ల ఇళ్లల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. సోదాల్లో పెన్‌డ్రైవ్‌లు, హార్డ్ డిస్కులతో పాటు ఎలక్ట్రానిక్ డివైజ్‌లను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని ఆధారాలను హెటిరో సిబ్బంది ధ్వంసం చేసినట్టు ఐటీ అధికారులు గుర్తించింది. చాలా వరకు నకిలీ ఇన్వాస్లు తయారు చేసినట్లుగా గుర్తించారు. కంపెనీ డబ్బులతో యాజమాన్యం భారీగా స్థలాలు కొనుగోలు చేసినట్టు తేలింది. 7. దుర్గగుడిలో కొవిడ్ నిబంధనలను అధికారులు బేఖాతరు చేస్తున్నారు. వీవీఐపీలు కాని వారిని కూడా అంతరాలయంలోకి అనుమతిస్తుండటం వివాదాస్పదమవుతోంది. అంతరాలయంలో రద్దీతో క్యూలైన్లలో సామాన్య భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే వ్యవహారంపై కలెక్టర్ సీరియస్ అయినా అధికారులు పట్టించుకోవట్లేదు. దుర్గగుడిలో అధికారుల తీరుపై దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్ వాకబు చేసినట్టు తెలుస్తోంది. 8. ప్రధాని మోదీతో డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫ్రెడరిక్సన్ న్యూఢిల్లీలో సమావేశమ్యయారు. కీలక రంగాలైన ఆరోగ్యం, వ్యవసాయం, జల నిర్వహణ, వాతావరణ మార్పులు, పునరుత్పాదక ఇంధనం తదితర రంగాల్లో పరస్పర సహకారానికి ఫల ప్రదమైన చర్యలు జరిపినట్టు ఇరుదేశాల ప్రధానులు సమావేశానంతరం సంయుక్తంగా ప్రకటించారు. శాస్త్ర, సాంకేతిక రంగం, వాతావరణ మార్పులు, నైపుణాభివృద్ధి వంటి రంగాల్లో మరింత సహకారానికి నాలుగు ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. 9. క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ అగ్రనటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు అర్యన్ ఖాన్ డ్రైవర్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ప్రశ్నించింది. మరోవైపు, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఎన్సీబీపై తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ నేత మోహిత్ కాంభోజ్ బావమరిదిని కూడా ఎన్సీబీ తొలుత అరెస్ట్ చేసిందని అయితే, ఆ తర్వాత కొన్ని గంటల్లోనే అతడిని విడిచిపెట్టిందని ఆరోపించారు. ఢిల్లీ, మహారాష్ట్ర బీజేపీ పెద్దల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్‌తోనే అతడిని విడిచిపెట్టారని అన్నారు. 10. ఆదివారం జరిగే "మా" ఎన్నికలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. పోలింగ్ సందర్భంగా 3 ప్లాటూన్ల పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ‘మా’ ఎన్నికల్లో మొత్తం 883 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
http://www.teluguone.com/news/content/top-news--7pm-39-124311.html





