నేవీలో విశాఖ కలకలం.. కోడెల హౌజ్అరెస్ట్.. పునీత్ ఫ్యాన్ మృతి.. టాప్‌న్యూస్ @1pm
Publish Date:Nov 6, 2021
Advertisement
1. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ఇండియన్ నేవీ గుర్తించడం కలకలం రేపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా గుర్తించిన తర్వాత యుద్ధ నౌకకు విశాఖపట్నం పేరుతో నామకరణం చేశామని నేవీ అధికారులు తెలిపారు. డిసెంబర్ 4న విశాఖలో జరిగే నేవీ వేడుకలకు రావాలని సీఎం జగన్‌కు నేవీ అధికారులు ఆహ్వానించారు. 2. సీఎం జగన్ జనం నడ్డి విరగ్గొడుతున్నారని.. బార్డర్లో బంకులను మూసి వేస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. ముడిచమురు ధరలు పెరిగినప్పుడల్లా.. ఏపీలో పన్నులు పెంచుకుంటూ ఆదాయమే చూసుకున్నారన్నారు. పెట్రోల్, బ్రాండెడ్ మద్యం కోసం ఇక్కడి ప్రజలు సరిహద్దులు దాటుతుంటే.. గంజాయి కోసం మాత్రం దేశమంతా ఏపీ వైపు చూస్తోందని సోమిరెడ్డి మండిపడ్డారు. 3. చంద్రన్న ఆశయ సాధన పేరుతో పాదయాత్ర చేసేందుకు టీడీపీ నేత కోడెల శివరాం సిద్ధమవగా.. ఆయనను పోలీసులు హౌస్ అరెస్టు చేయడం ఉద్రిక్తంగా మారింది. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే పోలీసులు ద్వారా అడ్డుకుంటున్నారని కోడెల శివరాం మండిపడ్డారు. పోలీసుల ద్వారా ప్రజా తిరుగుబాటును ప్రభుత్వం అడ్డుకోలేదని.. న్యాయ పోరాటం చేస్తామని, పాదయాత్ర చేసి తీరతామని స్పష్టం చేశారు. 4. టీఆర్ఎస్ సభా స్థలం కోసం పోలీసులు అత్యుత్యాహం ప్రదర్శించారు. దేవన్నపేటలో ఉద్రిక్తత కొనసాగుతుంది. పోలీసుల అండతో సభా స్థలంలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించాలని భావించారు. అయితే.. రైతులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఎమ్మెల్యే కార్యక్రమానికి రాకుండా జారుకున్నారు. సభకు వ్యతిరేకంగా నిరసనకు దిగిన మహిళలతో పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో.. రైతులు ఆందోళనకు దిగారు. 5. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌కు షాక్ తగలనుంది. మాజీ ఎమ్మెల్సీ ఒకరు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ కమిటీలను ఇష్టారాజ్యంగా మార్చడంపై మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లాలోని తన వర్గం నేతలతో భేటీ కానున్నారు. భవిష్యత్ కార్యాచరణను ప్రేమ్ సాగర్‌రావు ప్రకటించనున్నారు. 6. నల్గొండ, మిర్యాలగూడ ఆర్టీసీ బస్సు డిపోల్లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తనిఖీలు అనంతరం అధికారులతో సజ్జనార్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దేశవ్యాప్తంగా 30 శాతం డీజిల్ ధరలు పెరగడంతో ఆర్టీసీపై భారం పడిందన్నారు. బస్టాండ్ ఆవరణలో, ఆర్టీసీ ఆస్తులపై అనుమతి లేకుండా సినిమా పోస్టర్లు ఉంచితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 7. రాజధాని రైతులు, మహిళలు చేస్తున్న మహాపాదయాత్ర ఆరో రోజు కొనసాగుతోంది. శనివారం ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించింది. పెదనందిపాడు నుంచి పర్చూరు వరకు 14 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది. 3 రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. మొత్తం 45 రోజుల పాటు పాదయాత్ర సాగనుంది. డిసెంబరు 15న తిరుపతిలో ముగియనుంది. 8. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలంలో దారుణం చోటు చేసుకుంది. నడుకూరులోని గ్రామ సచివాలయంలో బాలికపై వాలంటీర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. 9. బద్వేలులో ముగ్గురు 10వ తరగతి విద్యార్థులు అదృశ్యమయ్యారు. శుక్రవారం స్కూల్‌కు వెళ్లిన విద్యార్థులు ముగ్గురు విద్యార్థులు ఇంటికి తిరిగి రాలేదు. తల్లిదండ్రులు బద్వేలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదృశ్యమైన విద్యార్థులు హైదరాబాద్‌లో పోలీసులు ఉన్నట్లు గుర్తించారు. 10. పునీత్ రాజ్‌కుమార్ మృతిచెందినప్పటి నుంచి ఆహారం మానేసిన చామరాజనగర్ జిల్లా కొళ్ళేగాల భీమానగర్ నివాసి శివమూర్తి(31) చని పోయారు. అక్టోబరు 29న శుక్రవారం పునీత్ మృతిచెందినప్పటి నుంచి అహారం మానేశారు. ఫొటోగ్రాఫర్‌గా కొనసాగే శివమూర్తి పలుమార్లు పునీత్‌ను కలిశారు. పునీత్ తరహాలోనే డ్యాన్సులు చేసేవారు. వారం రోజులుగా ఆహారం తీసుకోని శివమూర్తిని కుటుంబ సభ్యులు, మిత్రులు తీరుమార్చుకోవాలని సూచించారు. వినకపోగా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్సలు పొందుతూ శివమూర్తి మృతిచెందడం విషాదకరం.
http://www.teluguone.com/news/content/top-news--1pm-39-125907.html





