జర్నలిస్టుల అందమైన ఇంటికల.... అంతులేని విషాదం
Publish Date:Dec 9, 2024
Advertisement
వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జర్నలిస్టులకు భూ కేటాయింపులు గత నెల 25 వ తేదీన సుప్రీం ధర్మాసనం రద్దు చేసిన నేపథ్యంలో జవహార్ హౌసింగ్ సొసైటీ మరో మారు ఆత్మరక్షణలో పడిపోయింది. ఈ నెల 21 నుంచి క్రిస్మస్ సెలవులు ఉండటంతో కొత్త సంవత్సరంలోనే కోర్టు తెరచుకుంటుంది. కోర్టు తీర్పుపై క్లారిఫికేషన్ లేదా రివ్యూ పిటిషన్ వేయడానికి కేవలం వారం రోజులు మాత్రమే గడువు ఉంది. కానీ చట్ట పరిధిలో పని చేయాల్సిన హౌజింగ్ సొసైటీ ఇంతవరకు ఎటువంటి నష్ట నివారణ చర్యలు తీసుకోలేదు. తీర్పులో పొందుపరిచినట్లు ముఖ్యమంత్రి విచక్షణకే వదిలేసినప్పటికీ హౌసింగ్ సొసైటీ నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తోంది. ముఖ్యమంత్రి నుంచి నిర్దిష్టమైన హామీ తీసుకోవడంలో కమిటీ పెద్దలు వైఫల్యం చెందారు. కమిటీ సొసైటీ తీరు వెయ్యికుటుంబాలు రోడ్డున పడే విధంగా ఉంది. 2008లో వైఎస్ ప్రభుత్వం ఎంఎల్ఏల, ఎంపీలు, ఐఏఎస్ , జడ్జీలతో బాటు జర్నలిస్ట్ లకు భూ కేటాయింపులు జరిపింది. ఈ భూటాయింపుల జీవోపై విబిజె చెలికాని హైకోర్టులో పిల్ వేయడంతో న్యాయవివాదం మొదలైంది. హైదరాబాద్ లో స్వంత స్థలం లేదని అఫిడవిట్ ఇచ్చి స్థలాలు తీసుకోవచ్చని దశాబ్దన్నరక్రితం క్రితం హైకోర్టుతీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ప్రకారం సొసైటీ కమిటీ స్థలాలను స్వాధీనం చేసుకోవాలి. సభ్యుల ప్రమేయం లేకుండానే సుప్రీంకోర్టు కెక్కింది. బైలాస్ ప్రకారం కమిటీ సర్వ సభ్య సమావేశం ఆమోదంతో సుప్రీం కోర్టు గడపదొక్కాలి. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టు కెళ్లడం సొసైటీ కమిటీ చేసిన అతి పెద్ద తప్పు అని సభ్యులు ఆవేదన చెందుతున్నారు. 2017లో సుప్రీంకోర్టు జస్టిస్ చలమేశ్వర్ బెంచ్ ఇంటెరిం ఆర్డర్ ప్రకారం 70 ఎకరాలను డెవలప్ చేసుకోవచ్చు. కానీ సొసైటీ ఆ స్థలాలను స్వాధీనం చేసుకోకపోవడం సొసైటీ చేసిన రెండో తప్పు. 2022 లో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ తీర్పు ప్రకారం స్థలాలను స్వాధీనం చేసుకోకపోవడం సొసైటీ చేసిన మూడో తప్పు. సోసైటీ చేసిన ఈ మూడు తప్పులే వెయ్యికుటుంబాలు రోడ్డున పడే విధంగా చేశాయి. పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ జర్నలిస్ట్ లకు భూములను అప్పగించడంలో విఫలమైంది. సుదీర్ఘ కాలం పెండింగ్ లో ఉన్నజర్నలిస్ట్ ల భూములను పంపిణీ చేస్తామని కాంగ్రేస్ పార్టీ ఇచ్చిన హామీ నిలబెట్టుకుంది. కానీ సుప్రీం తీర్పుతో జర్నలిస్ట్ లకు ఒక్కసారిగా పిడుగుపడ్డట్టయ్యింది. ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వం ప్రాతిపదికన ఆర్థికంగా చితికి పోయిన జర్నలిస్ట్ లను ఎంఎల్ ఏ, ఎంపీలు, ఐఏఎస్ , జడ్జిలతో సమానంగా పరిగణించి భూములను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖన్నా తీర్పు ఇవ్వడం శరాఘాతంగా మారింది. రెండు దశాబ్దాలు ఎదురు చూసిన జర్నలిస్ట్ లకు విషాదాన్ని మిగిల్చే పీడకల లాంటిది.
రెండు దశాబ్దాల క్రితం వైఎస్ ఆర్ ప్రభుత్వ హాయంలో మార్కెట్ రేటు ప్రకారం పన్నెండున్నర కోట్ల రూపాయలు వెచ్చించి కుత్బుల్లాపూర్ మండలంలోని నిజాంపేట, పేట్ బషీర్ బాద్ గ్రామాల్లో జర్నలిస్ట్ లు భూములు కొనుగోలు చేశారు. ప్రతీ పన్నెండేళ్లకు నదులకు పుష్కరాలు వస్తుంటాయి. 2008 నుంచి ఈ భూములకు మోక్షం దొరకలేదు. స్వంతింటి కల ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు! ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లుతో ప్రత్యేక అనుబంధం ఉంటుంది. ఎప్పుడెప్పుడు సొంత ఇంట్లోకి వెళదామా అని తాపత్రయపడుతుంటారు. అలాంటి ఈ భూములు ఏటికేడు అన్యాక్రాంతం అవుతున్నాయని జర్నలిస్ట్ లు తల్లడిల్లిపోతున్నారు. భవిష్యత్‌లో మా భూములు అంటూ ఒకటుండేదని పిల్లలకు కథలుగా చెప్పాల్సిన దుస్థితి వస్తుందేమోనని తలచుకుంటూ గుండెలు బరువెక్కేలా రోదిస్తున్నారు. ఇంతకీ ఆ భూముల వచ్చిన ముప్పేమిటీ? ఆ జర్నలిస్ట్ ల భూమి ఎక్కడ ఉంది? వారికి వచ్చిన కష్టమేమిటో ఇప్పుడు చూద్దాం.
http://www.teluguone.com/news/content/the-beautiful-homes-of-journalists-an-endless-tragedy-39-189619.html