జీవీరెడ్డిలా పని చేయండి.. కూటమి నేతలు, మంత్రులపై పెరుగుతున్న ఒత్తిడి!
Publish Date:Dec 26, 2024
Advertisement
వైసీపీ హయాంలో మంచి చెడ్డలు, తప్పొప్పులతో పని లేకుండా జగన్ కు వ్యతిరేకం అని భావించిన వాళ్ల కోసం జైళ్లు నోళ్లు తెరిచేవి. పోలీసుల జులం స్వాగతం పలికేది. అర్థరాత్రి, అపరాత్రి అన్న తేడా లేకుండా తెలుగుదేశం నేతలు, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టులు చేసే వారు. నోటీసుల మాటే లేదు. అనుకుంటే జైల్లో తోసేయడమేనన్నట్లుగా పరిస్థితి ఉండేది. తెలుగుదేశం, జనసేన నేతలూ కార్యకర్తలనే కాదు.. జగన్ విధానాలకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే చాలు వారికి ఇక భూలోకంలో నరకం చూపించడానికే రక్షక భటులు ఉన్నారన్నట్లుగా జగన్ హయాంలో అరాచకత్వం రాజ్యమేలింది. ఐదేళ్ల పాటు జగన్ అరాచక, విధ్వంస పాలనను పంటి బిగువున భరించిన ప్రజలు ఎన్నికలలో తమ సత్తా చాటారు. కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా అవకాశం ఇవ్వకుండా జగన్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించారు. తెలుగుదేశం కూటమికి అధికారం కట్టబెట్టారు. జగన్ ఐదేళ్ల హయాంలో అష్టకష్టాలూ పడిన తెలుగుదేశం శ్రేణుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. జగన్ మెప్పు కోసం ఉచ్ఛ నీచాలు మరిచి మరీ చెలరేగిపోయిన వారిపై చర్యలు ఉంటాయని ఆశించారు. అయితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి ఆరు నెలలు గడిచినా గత పాలనలోని అవినీతి నాయకులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్న నిరాశ తెలుగుదేశం శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది. అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడిన నేతలు, అధికారుల పేర్లు నమోదు చేశానంటూ లోకేష్ చూపిన రెడ్ బుక్ లో ఉన్న వారిపై చర్యలూ ప్రారంభం కాలేదు. అంతే కాదు.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అనుచిత వ్యాఖ్యలు, అసత్య ఆరోపణలతో చెలరేగిపోయిన వైసీపీయుల తీరు ఇప్పటికీ మారలేదు. దీంతో తెలుగుదేశం శ్రేణులలో అసహనం పెచ్చరిల్లుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సరిగ్గా ఈ తరుణంలో ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన జీవీ రెడ్డి జగన్ హయాంలో ఫైబర్ నెట్ లో జరిగిన అవినీతిని వెలికి తీశారు. అక్కడితో ఆగకుండా ఫైబర్ నెట్ లో దొడ్డిదారిన కొలువులు పొందిన అనర్హులను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతే కాకుండా జగన్ కోసం తీసిన సినిమాలకు ఫైబర్ నెట్ ద్వారా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అందిన మొత్తాన్ని వెనక్కు ఇచ్చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దారితప్పిన నిధుల రికవరీ కోసం లీగల్ నోటీసు కూడా పంపాడు. అంతే కాకుండా జగన్ ప్రాపంకంతో ఫైబర్ నెట్ కార్పొరేషన్ ద్వారా దొడ్డిదారిన అక్రమంగా కొలువులు పొందిన 410 మంది ఉద్యోగులను ఒకేసారి తొలగించారు. మరో 200 మందికి ఉద్యోగాల నుంచి ఎందుకు ఉద్వాసన పలకరాదో తెలపాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇలా దొడ్డిదారిన ఏపీ ఫైబర్ నెట్ లో కొలువులు పొందిన వారు ఎన్నడూ కార్యాలయానికి వచ్చిన పాపాన పోలేదు. కానీ కార్పొరేషన్ నుంచి పెద్ద పెద్ద మొత్తాలలో జీతాలు తీసుకుంటున్నవారే. జగన్ హయాంలో ఫైబర్ నెట్ కార్పొరేషన్ లో అవకతవకలను బటయపెట్టి చర్యలకు ఉపక్రమించి జీవీ రెడ్డిపై తెలుగుదేశం కార్యకర్తల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు జగన్ హయాంలో అవినీతికి పాల్పడిన వారిపై, అక్రమాలకు తెగించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ, రెడ్ బుక్ లో పేర్లు ఉన్నవారిపై కొరడా ఝుళిపించడంలో ఇంకా జాప్యం ఎందుకంటూ లోకేష్ సహా మంత్రులపై ఒత్తిడి పెరుగుతోంది. జీవీరెడ్డి మాదిరిగానే అక్రమార్కులపై చర్యల విషయంలో వేగంగా స్పందించాలన్న డిమాండ్ పేరుగుతోంది.
http://www.teluguone.com/news/content/gvreddt-gets-tdp-cadre-respect-39-190351.html