రాజద్రోహచట్టం అమల్లో లేదు..ఇక ఛార్టిషీటుతో పనేమిటి?
Publish Date:Jun 22, 2022
Advertisement
మనది ప్రజాస్వామ్య దేశం. ప్రతీ ఒక్కరూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. సామాజిక, రాజకీయ అంశాలమీద తమదయిన రీతిలో! కొందరు సౌమ్యంగా, మరికొందరు కాస్తంత ఘాటుగా. పార్టీలతో సంబంధం లేకుండా, పార్టీలో వున్నప్పటికీ, ప్రభుత్వంలో వున్నప్పటికీ నిరసన వ్యక్తం చేసేంత స్వేచ్ఛ మన దేశంలోనే ఎక్కువ. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారని వైసీపీ ఎంపీ రఘురామ రాజుపై ఏకంగా రాజ ద్రోహం కేసు పెట్టారు అసలు రాజద్రోహం చట్టం అమలే నిలిచిపోయిన తర్వాత దర్యాప్తు పూర్తి చేసిన ఛార్జిషీటు కూడా దాఖలు చేయ లేరు కదా అని హైకోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం. మిగిలిన సెక్షన్ల ఆధా రంగా ఆయన మీద దర్యాప్తు కొనసాగిస్తే మాత్రం ఉపయోగం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. దర్యాప్తు నిలిపేయాలన్న ఎంపీ అభ్యర్థన పై గురువారం తగిన ఉత్తర్వులు ఇస్తామంటూ విచారణను న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ వాయిదా వేశారు. రాజద్రోహంతో పాటు 153ఏ, 505, 120బీ సెక్షన్ల కింద సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ రఘురామరాజు దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. ఆయన తరఫు సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారనే కారణంతో రాజద్రోహం (సెక్షన్ 124ఏ) కింద సీఐడీ కేసు నమోదు చేయడం సరికాదని తెలి పారు. రాజద్రోహం చట్టాన్ని సుప్రీంకోర్టు నిలుపుదల చేసిందని గుర్తుచేశారు. పిటిషనర్ వ్యాఖ్యలు సామాజిక వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేవిగా లేవని.. ఆ వ్యాఖ్యల వల్ల ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోలేదని.. ఈ నేపథ్యంలో ఆయనపై సీఐడీ నమోదు చేసిన సెక్షన్లు చెల్లుబాటు కావని తెలిపారు. సీఐడీ తరఫున అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ఇదే వ్యవహారంలో సీఐడీ నమోదు చేసిన కేసును సవాల్ చేస్తూ రెండు మీడియా యాజమాన్యాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయని.. తొందరపాటు చర్యలు తీసుకోవద్దని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింద న్నారు. రాజద్రోహం సెక్షన్ ఆధారంగా తాము ముందుకెళ్లబోమని మిగిలిన సెక్షన్ల విషయంలో దర్యాప్తు కొనసాగిస్తామని సహకరించేలా పిటిషనర్‌ను ఆదేశించాలని కోరారు.
http://www.teluguone.com/news/content/that-law-does-not-exist-why-charge-sheet-39-138171.html





