పతనం అంచున మహా సర్కార్.. బీజేపీ మద్దతుతో షిండే సర్కార్?
Publish Date:Jun 22, 2022
Advertisement
మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ సర్కార్ కుప్పకూలిపోయే అవకాశాలే కనిపిస్తున్నాయి. శివసేన నేత ఏక్ నాథ్ షిండే తన వెంట 40 మంది ఎమ్మెల్యేలున్నారని స్పష్టం చేస్తున్నారు. వీరిలో 34 మంది శివసేన వారు కాగా మిగిలిన ఏడుగురూ స్వతంత్రులని చెబుతున్నారు. నిన్నటి వరకూ తన మద్దతుదారులతో సూరత్ లో క్యాంప్ వేసిన షిండే ప్రస్తుతం గువహటి చేరుకున్నారు. సూరత్ నుంచి ప్రత్యేక విమానంలో గువహటి చేరుకున్న రెబల్ ఎమ్మెల్యేలు హైలెవెల్ సెక్యూరిటీ మధ్య ఓ హోటల్ లో బస చేశారు. షిండేతో మంగళవారం పలు దఫాలు మహా సీఎం ఉద్ధవ్ థాక్రే ఫోన్ లో సంభాషించినా సమస్య పరిష్కారం కాలేదు. షిండే తమదే అసలైన శివసేన అని చెబుతున్నారు. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే కు నిజమైన రాజకీయ వారసులం తామేనని, ఆయన అనుసరించిన హిందుత్వ విధానానికే తాము కట్టుబడి ఉన్నామని చెబుతున్నారు. గువహటి విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడిన ఏక్నాథ్ షిండే.. బాల్ థాక్రే హిందుత్వ అజెండాతో తాము ముందుకు సాగుతామని విస్పష్టంగా చెప్పడం చూస్తుంటే శివసేనలో చీలిక అనివార్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం కూలిపోవడం అనివార్యమంటున్నారు. మహా వికాస్ అగాఢీ ప్రభుత్వ భవిష్యత్ గురించి అప్పుడే ఏం మాట్లడబోనని అన్న షిండే తన మద్దతుదారులతో కలిసి ముంబై వెళ్లనున్నట్లు చెప్పారు. మధ్యాహ్నం మహారాష్ట్ర గవర్నర్‌తో షిండే భేటీ కానున్నారు. తనతో 2/3 పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారని, దీంతో శివసేన పార్టీ తనదేనని ఆయన క్లయిమ్ చేసుకునే అవకాశం ఉందని ఆయన మాటల ద్వారా అర్థమౌతోంది. బీజేపీకి మద్దతిస్తూ గవర్నర్‌కు షిండే లేఖ ఇచ్చే అవకాశం ఉందనీ, అనంతరం బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తారని విశ్లేషిస్తున్నారు. బుధవారం ఏక్‌నాథ్ షిండే.. బీజేపీ అధిష్ఠానాన్ని కలుసుకునే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. రాష్ట్రపతి ఎన్నికల కోసం ఎన్డీఏ కూటమి తరఫున అభ్యర్థిని ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే శివసేన తిరుగుబాటు శాసన సభ్యులందరూ గుజరాత్‌ను వీడి అసోంకు వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
http://www.teluguone.com/news/content/maha-sarkar-at-the-edge-of-collapse-shina-likely-to-form-governmentwith-bjp-suppourt-39-138165.html





