ఎన్నికల కమిషన్ ముందు తోడి కోడళ్ల పోరు!
Publish Date:Jul 24, 2022
Advertisement
పెరట్లో చెవి కమ్మ దొరికితే నాదంటే నాదని కోడళ్లు తిట్టుకున్నారు. అత్తగారు వెళ్లి ఇదెవరిదో వాళ్లు ఇవాళ కమ్మటి వంట చేస్తే నేనే తేలుస్తానన్నది. అంతే అత్తగారు పక్కింటి కలగూరగంప కబుర్లకు వెళ్లింది, కోడళ్లు తమ బంగారాన్ని కాపాడుకోవడానికి వచ్చీ రాని వంట చేయడంలో తల మునకలయ్యారు. ఆనక తిండి ఎలా గున్నా అవస్థ మాత్రం పెద్ద కోడలిదే. అదుగో అలా ఉంది ఉద్ధవ్, షిండేల సంగతి. అసలు శివసేన అంటేనే మొన్నటి దాకా ఉద్దవ్ థాక్రే నాయకత్వంలోనిదే. ఇపుడు షిండే రాజకీయ హడావుడితో ఆయన దుకాణం కూడా శివసేనగా మారింది. దీంతో పార్టీ గుర్తు తమకే ఉండాలన్న పోరు తోడికోడళ్ల రగడలానే మారింది. మహా రాష్ట్రకే కాదు యావత్ భారతా వనికి వీరి గోడు మంచి కాలక్షేపంగా మారింది. ఎన్నికల కమిషన్ ముందు ఇరు వర్గాలూ పార్టీ, సింబల్ తమకు ఎందుకు ఇవ్వాలన్నది వివరిస్తూ సంబంధిత పత్రాలు అధికారుల ముందు పెట్టారు. ఇక వారే తేల్చవలె. షిండే 40 మంది ఎమ్మెల్యేలతో ఉద్ధవ్ థాక్రేను ఎదిరించి వేరు కుంపటి పెట్టడం అధికారంలోకి వచ్చేయడం జరిగి నెల రోజులు అయింది. మహారాష్ట్ర రాజకీయాల్లో ఇంతటి సంక్షోభం శివసేన ఎప్పుడూ ఎదుర్కొనలేదు. జూన్ 30న రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయింది. బిజెపి మద్దతుతో షిండే ముఖ్యమంత్రిగా , ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అయిన సంగతి అందరికీ తెలిసిందే. అధికారం చేజిక్కించుకోవడం అయిపోయింది. కానీ పార్టీ గుర్తు విషయంలో గోల ఆరంభమయింది. అసలు శివసేన పార్టీ అంటేనే థాక్రే వారిది కనుక పార్టీ, సింబల్ రెండూ మాకే చెందుతాయని ఉద్ధవ్ థాక్రే గొంతు చించు కుంటున్నారు. కానీ మొత్తం 55 మంది ఎమ్మెల్యేల్లో 44 మంది ఎమ్మెల్యేలు, 18 మంది లోక్‌సభ ఎంపీలు తన వేపు వచ్చేరు గనుక శివసేన మాదే అవుతుందని షిండే గొడవ పెట్టుకున్నారు. అధికారం పోయి, ప్రజల మద్దతు, ఎమ్మెల్యేలను కోల్పోయిన థాక్రేకు శివసేన అసలు పార్టీ సింబల్ ఇవ్వడం న్యాయం కాదని షిండే వాదన. అందు వల్ల ఎన్నికల కమిషన్‌పై ఇద్దరూ ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఇంతకు ముందు థాక్రే వర్గాన్ని రద్దు చేయాలని, పార్టీ సింబల్‌ను తమకు కేటాయించాలని మహా అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్‌ను షిండే కోరారు. కానీ ఆ విషయంలో నిర్ణయం అప్పుడే తీసుకోవద్దంటూ ఇటీవల స్పీకర్‌కు సుప్రీం కోర్టు చెప్పింది. ఇదిలా ఉండగా, ముంబై కార్పొరేషన్ ఎన్నికలతో పాటు అనేక ప్రాంతీయ సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ కారణంగా పార్టీ సింబల్ విషయంలో ఇరు వర్గాలు త్వరపడుతున్నాయి. ఇసి కి పార్టీ పేరు, గుర్తు విషయంలో తమ వాదనలు వినాలని కోరుతూ ఇరువర్గాలు ఇప్పటికే అభ్యర్ధనలు అందజేశారు.
http://www.teluguone.com/news/content/thakrey-and-shinde-goes-for-oarty-symbol-25-140445.html





