అమెరికాలో కాల్పుల కలకలం.. తెలుగు యువకుడు దుర్మరణం..
Publish Date:Feb 12, 2022
Advertisement
ఎన్నో ఆశలతో అమెరికాలో అడుగుపెట్టాడు. ఉన్నత చదువుల కోసం యూఎస్ వెళ్లాడు. తన కుమారుడి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని సంతోషించారు ఆ తల్లిదండ్రులు. 27 ఏళ్ల సత్యకృష్ణ అమెరికా వెళ్లి నెల రోజులు అవుతోంది. వెళ్లినప్పటి నుంచీ రోజూ పేరెంట్స్‌కు ఫోన్ చేస్తున్నాడు. అమ్మా ఇక్కడ చాలా బాగుంది. నాన్నా.. ఇక్కడ తెలుగు వాళ్లు ఫ్రెండ్స్ అయ్యారు. ఈరోజు ఇది తిన్నా.. అక్కడికెళ్లా.. ఇక్కడికెళ్లా.. అంటూ ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ చెబుతుండేవాడు. ఓ స్టోర్‌లో పార్ట్‌టైమ్ వర్క్ చేస్తున్నానని చెప్పాడు ఆ మాటలు విని.. మావోడు అమెరికాలో ఇక సెటిల్ అయినట్టేనని ఎంతో ఆనందించింది ఆ కుటుంబం. అయితే, ఏమైందో ఏమోగాని ఈసారి సమయానికి కొడుకు నుంచి రావాల్సిన ఫోన్ కాల్ రాలేదు. అతని తల్లిదండ్రులు కాస్త కంగారు పడ్డారు. చాలాసేపు ఎదురు చూశారు. అంతలోనే వారి మొబైల్ రింగ్ అయింది. ఫోన్ చూస్తే కొడుకు నెంబర్ కాదు.. కొత్త నెంబర్. కాకపోతే అది యూఎస్ ఫోన్ నెంబరే కావడంతో సంతోషంగా ఆ కాల్ అటెండ్ చేశారు. అవతలివారు చెప్పిన విషయం విని.. క్షణాల్లో కుప్పకూలిపోయారు ఆ పేరెంట్స్. తమ కుమారుడు ఇక లేడనే విషయం తెలిసి.. బోరున విలపించారు. అమెరికాలో జరిగిన కాల్పుల ఘటనలో అభంశుభం తెలీని తమ తనయుడు చనిపోయాడని తెలిసి.. విలవిల్లాడిపోయారు ఆ పేరెంట్స్. అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. అలాబామా రాష్ట్రంలో ఓ దుండగులు జరిపిన కాల్పుల్లో విశాఖపట్నం జిల్లాకు చెందిన యువకుడు చిట్టూరి సత్యకృష్ణ (27) ప్రాణాలు కోల్పోయాడు. పాత బర్మింగ్ హోంలోని ఓ స్టోర్‌లో క్లర్క్‌గా పనిచేస్తోన్న సత్యకృష్ణ నెల రోజుల క్రితమే ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. అంతలోనే ఉన్మాదుల కాల్పుల్లో మృత్యువాత పడటం తీవ్ర విషాధం నింపింది. సత్యకృష్ణ మృతి వార్త తెలియగానే అతని కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కొడుకు చివరిచూపులు చూసేందుకు.. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సాయం చేయాలని కోరారు.
http://www.teluguone.com/news/content/telugu-man-killed-in-usa-firing-39-131681.html





