వారి నాలుకలకి రెండు వైపులా పదునే!
Publish Date:May 28, 2015
Advertisement
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంతకు ముందు శాసనసభలో మాట్లాడుతూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తలుచుకొన్నందునే తెలంగాణా రాష్ట్రం ఏర్పడిందని, అందుకు తనతో సహా తెలంగాణా ప్రజలందరూ ఆమెకు సదా రుణపడి ఉంటారని అన్నారు. కానీ తెలంగాణా ఇచ్చింది సోనియా గాంధీయే అయినప్పటికీ, అందుకు కారణం రాష్ట్ర సాధన కోసం తమ పార్టీ చేసిన పోరాటాలేనని మరో ముక్క అప్పుడే జోడించారు. ఆయన చెప్పిన మాటలు నూటికి నూరు శాతం నిజం కనుక శాసనసభలో కాంగ్రెస్ సభ్యులు ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. కానీ తెలంగాణా పాఠ్య పుస్తకాలలో ఎక్కడా ఆమె ప్రస్తావన లేకపోవడంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అందరూ మండిపడుతున్నారు. రాష్ట్ర సాధన కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటాల గురించి ఎక్కడా పేర్కొనకుండా కేవలం తెరాస, దాని అధ్యక్షుడు కేసీఆర్ చేసిన పోరాటాల వలననే తెలంగాణా ఏర్పడినట్లు చరిత్రను వక్రీకరించి పిల్లలకు పాఠాలు నేర్పుతున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. అందుకు తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె. తారక రామారావు భలే విచిత్రమయిన సమాధానం చెప్పారు. “గత ఆరు దశాబ్దాలుగా రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటాలలో అనేకమంది బలిదానాలు చేసుకొన్నారు. ముఖ్యంగా 2009లో తెలంగాణ ఇస్తామని యూపీయే ప్రభుత్వం ప్రకటన చేసి, మళ్లీ మాట మార్చిన తరువాత వెయ్యి మందికి పైగా యువకులు బలిదానాలు చేసుకొన్నారు. ఇంత జరుగుతున్నా సోనియా గాంధీ తెలంగాణా ఇచ్చేందుకు వెనుకాడి చివరికి తెరాస ఒత్తిడి కారణంగానే తెలంగాణా ఏర్పాటు చేసారు. ఒకవేళ తెలంగాణా చరిత్రలో కాంగ్రెస్ పార్టీ గురించి దాని అధ్యక్షురాలు సోనియా గాంధీ గురించి వ్రాయవలసి వస్తే ఈ చేదు నిజాలన్నిటినీ కూడా పేర్కొనక తప్పదు. అందుకు కాంగ్రెస్ పార్టీ సిద్దమేనా? తెలంగాణా ఏర్పాటు చేసిన క్రెడిట్ కోరుకొంటున్నకాంగ్రెస్ పార్టీ ఈ సమస్యలన్నిటికీ మూలకారణం తనేనని అంగీకరించేందుకు సిద్దమేనా?” అని ప్రశ్నించి కల్వకుంట్ల వారి నాలికలకి రెండు వైపులా పదునేనని కెటిఆర్ మరొక్కమారు నిరూపించారు. ఆయన అడిగిన ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ ఏదో డొంక తిరుగుడు సమాధానం చెప్పగలదేమో కానీ దేనినీ ఔనని ఒప్పుకోలేదని అందరికీ తెలుసు.
http://www.teluguone.com/news/content/telangana-history-45-46818.html





