తెలంగాణా యం.యల్సీ ఎన్నికలలో ఏడవ కృష్ణుడు!
Publish Date:May 21, 2015
Advertisement
సాధారణంగా ఎవరికయినా ఎన్నికలలో ఎవరు గెలుస్తారనే ఉత్కంట కలగడం సహజం కానీ ఎవరెవరు నామినేషన్లు వేయబోతున్నరనే దానిపై కూడా ఉత్కంట ఏర్పడటం ఈ యం.యల్సీ. ఎన్నికలలోనే చూస్తున్నాము. తెలంగాణాలో ఉన్న ఆరు స్థానాలలో నాలుగు అధికార తెరాసకు ఒకటి కాంగ్రెస్ పార్టీకి పోతే మిగిలిన ఆ ఒక్క స్థానానికి ఏ పార్టీకి చెందిన నేత నామినేషన్ వేస్తారనే ఉత్కంట ఈరోజు మధ్యాహ్నం 3గంటలకి నామినేషన్ల వేసే గడువు ముగిసేవరకు కొనసాగింది. అందుకు కారణం తెదేపా, బీజేపీ కూటమికి తగినంత మంది యం.యల్యేలు లేకపోవడం, వారి ఆ బలహీనతను సొమ్ము చేసుకొందామనే ఆలోచనతో తెరాస పార్టీ ఐదవ అభ్యర్ధిని కూడా నిలబెట్టాలనుకోవడమే. ఒక్కో యం.యల్సీ.కి కనీసం 18మంది యం.యల్యేల మద్దతు అవసరం. కానీ తెదేపా-బీజేపీ కూటమికి కేవలం 16 మందే ఉన్నారు. తెరాసకున్న మొత్తం 75మంది యం.యల్యేల మద్దతుతో నలుగురిని మాత్రమే గెలిపించుకోగలదు. కానీ ఐదవ అభ్యర్ధిని కూడా నిలబెట్టింది. తెదేపా-బీజేపీ కూటమి తమ అభ్యర్ధిని ప్రకటించిన తరువాతనే తమ అభ్యర్ధి పేరు బయటపెట్టాలని తెరాస భావించడంతో చివరి నిమిషం వరకు ఉత్కంట సాగింది. తెదేపా-బీజేపీ కూటమి తరపున వేం నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయగా, తెరాస తరపున ఎమ్మెల్సీ అభ్యర్థులుగా తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి, యాదవ్ రెడ్డి, నేతి విద్యాసాగర్, బి.వెంకటేశ్వర్లు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆకుల లలిత నామినేషన్ వేశారు. మొత్తం ఆరు స్థానాలకి ఏడుగురు పోటీ చేస్తున్నారఋ. అంటే తెరాస ఐదవ అభ్యర్ధిగా నిలబెట్టిన బి.వెంకటేశ్వర్లు గెలవాలంటే, ప్రతిపక్ష పార్టీలకు చెందిన యం.యల్యేలు క్రాస్ ఓటింగ్ చేయవలసి ఉంటుందన్న మాట. అయితే తాము ఎవరితోనూ బేరసారాలు చేయబోమని ప్రతిపక్షాలకు చెందిన కొందరు యం.యల్యేలే తమకు మద్దతు తెలుపుతారనే బలమయిన నమ్మకంతోనే తాము ఐదవ అభ్యర్ధిని నిలబెట్టామని తెలంగాణా ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మీడియాతో అన్నారు. కానీ బేరసారాలు చేయకుండా, ఎటువంటి పదవులు ఆశజూపకుండా ఈరోజుల్లో ప్రత్యర్ధ పార్టీలకు చెందిన యం.యల్యేల ఓట్లు ఆశించడం సాధ్యమేనా అంటే జవాబు అందరికీ తెలుసు. కనుక నామినేషన్ల ఉపసంహరణ తరువాత కూడా ఏడవ కృష్ణుడు బరిలో ఉంటాడా లేదా? అనే దానిని బట్టి ‘డీల్’ కుదిరిందో లేదో తేలిపోతుంది.
http://www.teluguone.com/news/content/telangana-45-46529.html





