ఫలితం ఏదైనా బిడ్డలను అక్కున చేర్చుకోండి.... సీపీ సజ్జనార్
Publish Date:Apr 28, 2026
Advertisement
పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదలకు ముందుగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ భావోద్వేగపూర్వక సందేశం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు మధ్యాహ్నం సమయంలో పదవ తరగతి పరీక్ష ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఆయన చేసిన ఈ విజ్ఞప్తి ప్రాధాన్యత సంతరిం చుకుంది. పరీక్ష ఫలితాలు జీవితాన్ని నిర్ణయించేవి కావని, దీర్ఘ ప్రయాణంలో ఇది ఒక చిన్న దశ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. ఇటీవల ఇంటర్మీడియట్ ఫలితాల అనంతరం చోటుచేసుకున్న కొన్ని విషాద ఘటనలు తనను తీవ్రంగా కలిచివేశాయని తెలిపారు. మార్కులు తక్కువ రావడం లేదా ఫెయిల్ కావడం వల్ల ప్రాణాలు తీసుకోవడం సమస్యలకు పరిష్కారం కాదని, అది కుటుంబాలకు తీరని బాధను మాత్రమే మిగులుస్తుందని హెచ్చరించారు. మహిళా భద్రత విభాగం చేసిన పరిశీలనలో తల్లిదండ్రుల ఒత్తిడి, అధిక అంచనాలు కూడా కొన్నిసార్లు పిల్లలపై ప్రభావం చూపుతున్నాయని వెల్లడించారు. ఓటమి అనేది విజయానికి మొదటి మెట్టు మాత్రమేనని, అది జీవితానికి ముగింపు కాదని ప్రతి విద్యార్థి గుర్తుంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ ఆశలను పిల్లలపై భారంగా మోపకుండా, వారికి అండగా నిలవాలని కోరారు. ఫలితం ఎలా ఉన్నా పిల్లలను ప్రేమగా అక్కున చేర్చుకుని, వారిలో నమ్మకం నింపాలని తెలిపారు. మార్కుల కంటే పిల్లల ప్రాణం, వారి ఆనందమే ముఖ్యమని స్పష్టం చేశారు. ఫలితాల తర్వాత పిల్లల ప్రవర్తనను జాగ్రత్తగా గమనించి, వారు మౌనంగా లేదా ఒంటరిగా ఉంటే వెంటనే మాట్లాడి ధైర్యం చెప్పాలని సూచించారు. అవసరమైతే పనులన్నీ పక్కనపెట్టి వారితో సమయం గడపాలని తల్లిదండ్రులకు సూచించారు. ఉపాధ్యాయులు కూడా ఈ సమయంలో విద్యార్థులతో సంభాషించి, వైఫల్యం తాత్కాలికమేనని వారికి భరోసా కల్పించాలని పిలుపునిచ్చారు. చదువులో వెనుకబడిన ఎంతో మంది పట్టుదలతో ప్రపంచస్థాయి విజయాలను సాధించిన ఉదాహరణలు ఉన్నాయని గుర్తుచేశారు. పరీక్షల కంటే ప్రాణం గొప్పదని, ప్రతి విద్యార్థి వెనుక ఒక కుటుంబం ఉందని గుర్తుంచుకోవాలని చెప్పారు. ఎలాంటి ఆందోళన వచ్చినా తల్లిదండ్రులు లేదా ఆత్మీయులతో పంచుకుని ధైర్యంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనర్ తెలిపారు.
http://www.teluguone.com/news/content/telangana-10th-class-results-2026-36-218505.html




