తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు.. సీఎం కేసీఆర్ కు సవాలే?
Publish Date:Sep 15, 2021
Advertisement
తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ పాలనపై తన యూ ట్యూబ్ చానెల్ తో పాటు రాజకీయంగా పోరాటం చేస్తున్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ ఇంకా జైలులోనే ఉన్నారు. ఆయనపై దాదాపు 32 కేసులు నమోదు చేశారని తెలుస్తోంది. ఆ కేసుల్లో భాగంగా వివిధ ప్రాంతాల్లోని కోర్టుల్లో మల్లన్నను హాజరు పరుస్తున్నారు పోలీసులు. బుధవారం నల్గొండ జిల్లా కోర్టుకు తీసుకువచ్చారు. మల్లన్న దళితులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఈ ఏడాది ఫిబ్రవరి 26న అడ్డగూడూరుకు చెందిన మహిళ అక్కడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తును చేపట్టిన పోలీసులు.. మల్లన్నను ఎస్సీ, ఎస్టీ కోర్టులో హాజరుపరిచారు. మల్లన్నకు న్యాయమూర్తి ఈ నెల 21 వరకు రిమాండ్ విధించారు.ఈ సందర్భంగా ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు తీన్మార్ మల్లన్న. సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేండ్ల బాలికపై అత్యాచారం చేసి చంపేసిన ఘటన ప్రస్తుతం తెలంగాణను షేక్ చేస్తోంది. వారం రోజులవుతున్నా నిందితుడిని పోలీసులు పట్టుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై స్పందిస్తూ కేసీఆర్ సర్కార్ ను నిలదీశారు తీన్మార్ మల్లన్న. సైదాబాద్ హత్యాచార ఘటనలో నిందితుడ్ని పట్టుకోలేని పోలీసులు తనపై కక్ష సాధిస్తూ ప్రభుత్వానికి సహకరిస్తున్నారని ఆరోపించారు. తన భార్య, అత్తమామలు కూడా దళితులేనని, తాను తన కుటుంబ సభ్యులను ఎలా కించపరుస్తానని ప్రశ్నించారు. ఇదంతా తనపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కుట్ర తప్ప మరోటి కాదన్నారు. తనపై ఇప్పటికే 35 కేసులు బనాయించారని మల్లన్న ఆవేదన వ్యక్తం చేశారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పోలీసులు తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి ప్రభుత్వానికి తమ వంతు సహకరిస్తున్నారని మల్లన్న ఆరోపించారు. తమకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నవారిపై కక్ష సాధింపు చర్యలకు కాకుండా ప్రజలకు రక్షణ కల్పించే చర్యలు తీసుకోవాలని మల్లన్న అన్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే గిరిజన బాలిక దారుణ హత్యకు గురైందని మండిపడ్డారు.
http://www.teluguone.com/news/content/teenmar-mallanna-hot-comments-on-kcr-chaitra-case-39-123041.html





