డాక్టర్ సుధాకర్ కేసులో కుట్రకోణం.. సీబీఐ దర్యాప్తుతో ప్రభుత్వం ఇరుకున పడనుందా?
Publish Date:Sep 1, 2020
Advertisement
జగన్ సర్కార్ కు కోర్టుల్లో అనేక సందర్భాల్లో ఎదురు దెబ్బలు తగిలిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో ప్రభుత్వం అభాసుపాలైంది. పదేపదే కోర్టుల్లో అక్షింతలు పడటంతో.. చివరికి ఆయనను ఎస్ఈసీగా నియమించక తప్పలేదు. ఓ రకంగా ఇది జగన్ సర్కార్ కి మాయని మచ్చలా మిగిలిపోతుందని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే, ఇప్పుడు తాజాగా మరో వ్యవహారం కూడా ప్రభుత్వ ప్రతిష్టని దెబ్బతీసే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. డాక్టర్ సుధాకర్ అంశం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆసుపత్రులలో మాస్కులు లేవని, వైద్యుల రక్షణ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని డాక్టర్ సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆయనను సస్పెండ్ చేశారు. మాస్క్ లు ఇవ్వమని అడిగినందుకు సస్పెండ్ చేయడం ఏంటని విమర్శలు వ్యక్తమైనా ప్రభుత్వం లెక్క చేయలేదు. అంతేకాదు, ఆయన పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నారని ఆరోపిస్తూ ఆయనను నడిరోడ్డుపై ఈడ్చుకెళ్తూ విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన మానసిక స్థితి బాలేదని చెప్తూ ఆయనను మానసిక వైద్యశాలలో చేర్పించారు. సాధారణంగా ఉన్న తనకు మానసిక రోగికి ఇచ్చే మందులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ మానసిక ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు డాక్టర్ సుధాకర్ లేఖ కూడా రాశారు. ఈ మొత్తం వ్యవహారం హైకోర్టుకి చేరడంతో.. హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. తాజాగా డాక్టర్ సుధాకర్ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. సుధాకర్ కేసులో కుట్రకోణం దాగి ఉందని, మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని సీబీఐ వ్యాఖ్యానించింది. దీనిపై స్పందించిన హైకోర్టు.. ఈ కేసుకు సంబంధించి నవంబర్ 11న పూర్తి స్థాయి నివేదికను అందించాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను నవంబర్ 16వ తేదీకి వాయిదా వేసింది. కాగా, సుధాకర్ కేసులో కుట్రకోణం దాగి ఉందని సీబీఐ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. మాస్క్ లు అడిగిన పాపానికి సుధాకర్ ని పిచ్చి వాడిగా ముద్ర వేసారని.. మొదటి నుండి సుధాకర్ తల్లి, విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ప్రభుత్వ పెద్దలు మాత్రం ఆయన వెనుక ప్రతిపక్ష పార్టీ ఉందని, ఆయన తాగి న్యూసెన్స్ చేసారని, ఆయన పిచ్చి వాడని ఆరోపించారు. కానీ తాజాగా సీబీఐ సుధాకర్ కేసులో కుట్రకోణం దాగి ఉందని చెప్పడం.. ప్రభుత్వ పెద్దల్ని ఇరుకున పెట్టిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఈ వ్యవహారాన్ని వైద్య, దళిత సంఘాలు సీరియస్ గా తీసుకున్నాయి. ఈ కేసులోని కుట్రకోణం బయటపడితే ప్రభుత్వ మరోసారి అభాసుపాలయ్యే అవకాశముందని అంటున్నారు. దళిత డాక్టర్ పట్ల ప్రభుత్వ వ్యవహరించిన తీరుపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశముంది. తాజాగా ఇదే అంశంపై టీడీపీ నేత వర్ల రామయ్య ట్విట్టర్ ద్వారా స్పందించారు. డాక్టర్ సుధాకర్ ను పిచ్చివాడిగా చిత్రీకరించేందుకు కుట్ర జరుగుతోందని తాము ఎంత మొర పెట్టుకున్నా వినలేదని విమర్శించారు. ఇప్పుడు, సీబీఐ అందులో కుట్ర దాగి ఉందని హైకోర్టు కు చెప్పింది అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సీబీఐ దర్యాప్తులో జోక్యం చేసుకోకుండా అసలు ముద్దాయిలు అరెస్ట్ అయ్యేలా చూడాలని డిమాండ్ చేస్తున్నామని వర్ల రామయ్య పేర్కొన్నారు.
http://www.teluguone.com/news/content/tdp-criticising-ap-govt-in-dr-sudhakars-case-39-103512.html