తెదేపా-బీజేపీలు పోరాడవలసింది పరస్పరం కాదు కేంద్రంతో
Publish Date:Nov 5, 2015
Advertisement
తెదేపా-బీజేపీ నేతల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంతో మీడియాకు పని కల్పిస్తున్నారు. వారి యుద్దాలకి ఎవరి కారణాలు వారికి ఉండవచ్చును. ఆ రెండు పార్టీల అధిష్టానాలు కూడా వాటిని నివారించేందుకు గట్టి ప్రయాత్నాలు ఏవీ చేస్తున్నట్లు కనబడటం లేదు. బహుశః దానికీ ఎవరి కారణాలు వారికి ఉండి ఉండవచ్చును. అవి చేస్తున్న యుద్దాల కంటే, వాటి గురించి మీడియాలో అనేక కోణాలలో వస్తున్న రాజకీయ విశ్లేషణల వలన ఆ రెండు పార్టీలకు ఇంకా నష్టం జరిగే అవకాశం ఉందని గ్రహిస్తే వారు ఈవిధంగా మీడియా ముందుకు వచ్చి పరస్పరం కత్తులు దూసుకోరు. ఆ రెండు పార్టీలు కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రాభివృద్ధి చేస్తాయనే ఆలోచనతోనే ప్రజలు వాటికి ఓట్లు వేసి అధికారం కట్టబెట్టారు. ఎన్నికల ముందు జనసేన పార్టీని స్థాపించి రాజకీయాలలోకి వచ్చిన దాని అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఆ రెండు పార్టీలు కలిసి రాష్ట్రాభివృద్ధి చేస్తాయనే ఆలోచనతోనే పోటీ చేయకుండా తప్పుకొని వాటికి మద్దతు ఇచ్చేరు. ఆయన ఎన్డీయే అభ్యర్ధుల తరపున చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీలతో కలిసి చేసిన ప్రచారం ఆ రెండు పార్టీల విజయానికి ఎంతో దోహదపడింది. కనుక పరస్పరం కత్తులు దూసుకొంటున్న తెదేపా-బీజేపీలు తమ తరపున ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలను, భరోసాను నిలబెట్టు కోవలసిన బాధ్యత ఉంది. ఏదో ఒక లోపం..లేదా కారణం చూపిస్తూ పరస్పరం విమర్శలు చేసుకోవడం కంటే, రెండు పార్టీల నేతలు కలిసి రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టులు, అమలుకావలసిన హామీల గురించి కేంద్రంపై ఒత్తిడి తేగలిగితే వాళ్ళకీ, ప్రజలకీ రాష్ట్రానికి కూడా మేలు జరుగుతుంది. అలా కాక ఆ రెండు పార్టీల మధ్య సాగుతున్న ఈ యుద్ధాల వలన రాష్ట్ర అభివృద్ధి నిలిచిపోయినట్లయితే, అందుకు ఆ రెండు పార్టీలే చివరికి మూల్యం చెల్లించుకోవలసి రావచ్చునని గ్రహిస్తే మంచిది..
http://www.teluguone.com/news/content/tdp-45-52048.html





