మళ్ళీ ఇండియాకి వస్తావా.. వద్దు తల్లోయ్..
Publish Date:Jun 3, 2015
Advertisement
ఇండియా నెత్తిన అనేక విదేశీ బండలు వున్నాయి. వాటిలో వివాదాస్పద రచయిత్రి తస్లిమా నస్రీన్ ఒకరు. బంగ్లాదేశ్‌కి చెందిన ఈ రచయిత్రి వివాదాస్పదమైన తన రచనల కారణంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. ముస్లిం తీవ్రవాదులు ఈమెను హత్య చేయడానికి ప్రయత్నాలు చేస్తూ వుండటంతో మన దేశానికి వచ్చి తలదాచుకున్నారు. ఇలాంటి ఉదారమైన పనులు చేయడంలో ఆరితేరిన మన ఇండియా నాయకులు ఆమెకు మన దేశంలో అధికార లాంఛనాలతో ఆశ్రయం కల్పించారు. దశాబ్దానికి పైగా ఆమె మన దేశంలో అతిథి సత్కారాలు అందుకుంటూనే వుంటున్నారు. ఆమెకి, మనదేశానికి ఎలాంటి సంబంధం లేకపోయినా, ఆమె వల్ల మన దేశానికి ఒరిగిందేమీ లేకపోయినా ఆమె అతిథి సత్కారాలు, గౌరవాలు అందుకుంటూనే వున్నారు. ఆమెకు ఆతిథ్యం ఇవ్వడం, భద్రత కల్పించడం తదితర ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయి. ఆమె ఎక్కడికైనా వెళ్ళిందంటే అక్కడ ముస్లిం సంఘాలు ప్రత్యక్షమై ఆందోళన చేస్తూ వుంటాయి. ఆ సందర్భంలో ఆమెకు రక్షణ కల్పించడం స్థానిక పోలీసులకు తలనొప్పిగా మారుతోంది.
ఈ నేపథ్యంలో తస్లిమా నస్రీన్ హఠాత్తుగా మాయమైపోయింది. ఈ మహాతల్లి ఎక్కడికి వెళ్ళిందా అని ఆరా తీస్తే, అమెరికాకి వెళ్ళిపోయినట్టు తెలిసింది. తనకు ఇండియాలో భద్రత లేదని ఆమెకి అర్థమైందట. అందుకే ఓ ఫైన్ మార్నింగ్ అమెరికాకి వెళ్ళిపోయిందట. ఆమెకు తన స్వదేశంలో భద్రత లేదు... అప్పనంగా అతిథి సత్కారాలు అందించిన ఇండియాలో భద్రత లేదు. ఇప్పుడు అమెరికాలో అయితే భద్రత లభిస్తుందని అక్కడకు వాలిపోయింది. సంతోషం.. ఆమె అక్కడే సెటిలైపోతే మనకి మరీ సంతోషం. ఖర్చులైనా తగ్గుతాయి. అయితే తస్లిమా నస్రీన్ మనకు ఆ సంతోషాన్ని కూడా మిగిల్చేట్టు లేరు. మళ్ళీ తాను ఎప్పటికైనా ఇండియాకి తిరిగి వచ్చేస్తానని ఆవిడగారు అమెరికా నుంచి సందేశం పంపించారు. ఇండియాలో వుంటే తనకు ప్రాణహాని వుండదని అనిపించినప్పుడు తాను తప్పకుండా ఇండియాకి వస్తానని ఆమె ఏదో మనల్ని ఉద్ధరిస్తున్నట్టు ప్రకటించారు. తాను ఎప్పుడు ఇండియాకి వచ్చినా ఇండియా తనకు భద్రత కల్పిస్తుందన్న నమ్మకం వుందని కూడా ఆమె చెప్పారు. అవును... మనకి ఇలాంటి వాళ్ళకి భద్రత కల్పించడం తప్ప మరో పని వుంటేగా... అందుకే తస్లీమా మేడమ్.. మీరు దయచేసి అమెరికాలోనే సెటిలవ్వండి.. లేకపోతే మీ బంగ్లాదేశ్‌కి వెళ్ళిపొండి. అంతేగానీ మా ఇండియాకి మాత్రం రాకండి. అసలు... రాకోయీ అనుకోని అతిథీ అనే పాట తస్లిమా నస్రీన్ లాంటివాళ్ళని ఉద్దేశించే రాసి వుంటారు.
http://www.teluguone.com/news/content/taslima-nasrin-45-47015.html





