తెలంగాణకు మళ్లీ తమిళిసై.. బీఆర్ఎస్ కు దబిడిదిబిడేనా?
Publish Date:Apr 29, 2024
Advertisement
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సోమవారం (ఏప్రిల్ 29) నుంచి పది రోజుల పాటు రాష్ట్రంలోనే మకాం వేసి లోక్ సభ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. తెలంగాణలో అత్యధిక లోక్ సభ స్థానాలలో విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ వ్యూహాత్మకంగా తమిళిసైను ఎన్నికల ప్రచారంలోకి దింపిందని అంటున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ బలహీనపడిందని భావిస్తున్న బీజేపీ ఆ స్థానాన్ని ఆక్రమించుకుని రాష్ట్రంలో బలోపేతం అయ్యేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. ఇప్పటికే లోక్ సభ ఎన్నికలలో పేరుకే త్రిముఖ పోటీ అనీ, ప్రధానంగా ఎన్నికల పోరు కాంగ్రెస్, బీజేపీల మధ్యే అన్నట్లుగా ఉంది. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకూ బీఆర్ఎస్ అన్ని విషయాలలోనూ తడబడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. లోక్ సభ టికెట్ కేటాయించిన తరువాత కూడా అభ్యర్థులు పోటీకి వెనుకడుగు వేయడం, కేసీఆర్ వినా ఇతర నేతలెవరూ పెద్దగా ప్రచారంలో పాల్గొనకపోవడం చూస్తుంటే ముందే బీఆర్ఎస్ చేతులెత్తేసినట్లు కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. కేసీఆర్ ఒక్కరే బస్సు యాత్రతో రాష్ట్రమంతటా పర్యటిస్తున్నారు. ఇతర సీనియర్ నేతల ప్రచారం పార్టీ సమావేశాలు, సదస్సులకే పరిమితమైనట్లుగా కనిపిస్తున్నది. తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే అగ్రనేతలను బీజేపీ రంగంలోకి దింపి ప్రచారం హోరెత్తిస్తోంది. ఇప్పటికే ప్రధాని మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్ వంటి అగ్రనేతలు ఓ దఫా ప్రచారం కంప్లీట్ చేయగా.. రెండో టర్మ్ ప్రచారానికి సైతం షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది. వీరితో పాటుగా తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ తమిళి సైతం తెలంగాణలో ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ మేరకు తమిళి సై ప్రచార షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది. కీలక నియోజకవర్గాలలో ఆమె బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా విస్తృత ప్రచారం నిర్వహించనున్నారు. పది రోజుల పాటు తెలంగాణలోనే మకాం వేసి మరీ ప్రచారం నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. తెలంగాణ గవర్నర్ గా పని చేసిన తమిళిసై లోక్ సభ ఎన్నికలకు ముందు గవర్నర్ పదవికి రాజీనామా చేసి సొంత రాష్ట్రమైన తమిళనాడులో చెన్నై సౌత్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. తమిళనాడులో ఎన్నికలు తొలి దశలోనే పూర్తయిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె సేవలను తెలంగాణలో బీజేపీ ప్రచారానికి ఉపయోగించుకోవాలని కమలం పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. తెలంగాణ గవర్నర్ గా పని చేసిన తమిళిసై కు రాష్ట్రంలో పరిచయాలు ఉన్నాయి. అలాగే ప్రజాదర్బార్ వంటి కార్యక్రమాలతో గవర్నర్ గా ఆమె ప్రజాభిమానం కూడా సంపాదించుకున్నారు. అంతే కాకుండా గవర్నర్ గా తనకు ఇవ్వాల్సిన ప్రొటోకాల్ ను కూడా కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వడం లేదని అప్పట్లో పలు సందడర్భాలలో తమిళిసై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. గవర్నర్ గా ఉన్న సమయంలో అప్పుడు అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కార్ పై ఓ రేంజ్ లో విమర్శలు చేసిన తమిళిసై ఇప్పుడు బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా మరింత జోరుగా బీఆర్ఎస్ ను విమర్శలతో చెండాడుతారని పరిశీలకులు అంటున్నారు. ఆమె ప్రచారం ప్రజలపై ఏ మేరకు ప్రభావం చూపుతుంది, బీఆర్ఎస్ కు ఎంత మేర నష్టం చేకూరుస్తుంది అన్నవిషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పై, అధికారంలో ఉండగా కేసీఆర్ సర్కార్ వ్యవహరించిన తీరుపై సాధికారికంగా విమర్శలు చేయగలిగే మాజీ గవర్నర్ తమిళిసైని స్టార్ క్యాంపెయినర్ గా బీజేపీ రంగంలోకి దింపింది.
http://www.teluguone.com/news/content/tamilisye-to-campaign-in-telangana-39-174715.html