తెలంగాణ తెలుగుదేశంలో ముసలం
Publish Date:Sep 14, 2015
Advertisement
తెలంగాణ తెలుగుదేశంలో జరుగుతున్న కోల్డ్ వార్...బ్లాస్ట్ అయ్యింది. కొద్దిరోజులుగా రేవంత్ రెడ్డిపై గుర్రుగా ఉన్న సీనియర్లు....తమ ఆక్రోశాన్ని బహిరంగంగా బయటపెట్టేశారు, టీటీడీపీ భేటీలో రేవంత్ ను డైరెక్ట్ గా టార్గెట్ చేసిన సీనియర్లు... తమను కాదని యువనేతకు పగ్గాలిస్తే మరో సంక్షోభం తప్పదని పార్టీ అధినేతకు సంకేతాలు పంపారు. పైకి ఎర్రబెల్లి, రేవంత్ మధ్యే ఆధిపత్య పోరు జరుగుతోందని అనుకున్నా, సీనియర్లంతా మూకుమ్మడిగా ఈ యువ నాయకుడిపై యుద్ధం ప్రకటించారు. అటు అసెంబ్లీ అయినా, ఇటు ప్రజాక్షేత్రమైనా తెలంగాణ టీడీపీ నుంచి రేవంత్ రెడ్డి మాత్రమే ఫోకస్ అవుతున్నాడని, చివరికి గవర్నర్ ను కలిసినా... మీ హీరో ఏడంటూ అడుగుతున్నారని ఫీలవుతున్నారట. ఒకవేళ తెలంగాణ టీడీపీ సారథ్య బాధ్యతలు రేవంత్ కి దక్కితే తమ పరిస్థితి మరింత దిగజారిపోతుందని భయపడుతున్నారట ఈ పేకాట బ్యాచ్.
రేవంత్ దూకుడును తట్టుకోలేకపోతున్న సీనియర్లు...ఎలాగైనా అడ్డుకట్టవేయాలనే ఆలోచనకు వచ్చారని, లేదంటే తమను మొత్తానికే మర్చిపోయే ప్రమాదముందని, చంద్రబాబు సైతం పట్టించుకోరని మదనపడుతున్నారట. పైగా తెలంగాణ టీడీపీకి కొత్త సారధిని నియమించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో, అది రేవంత్ కి దక్కకుండా సీనియర్లంతా జట్టు కట్టారని తెలుస్తోంది. అందుకే టీటీడీపీ సమావేశంలో రేవంత్ టార్గెట్ గా మోత్కుపల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారని,దానికి మిగతా సీనియర్లంతా మద్దతు పలికారని అంటున్నారు. పరోక్షంగా ఎర్రబెల్లికి కొమ్ముకాస్తున్న సీనియర్ లీడర్లంతా, రేవంత్ కి కీలక బాధ్యతలు దక్కకుండా పావులు కదుపుతున్నారని, చంద్రబాబుపైనా ఒత్తిడి పెంచుతున్నారని అంటున్నారు. ఇక గతంలోనే పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఆశించిన ఎర్రబెల్లి...ఈసారి ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తున్నారట, అయితే అనుకోని విధంగా రేవంత్ రెడ్డి రాకెట్ లా పోటీలోకి దూసుకురావడంతో, సీనియర్ల మద్దతు కోరారని, అందుకే మోత్కుపల్లి, ఎల్.రమణ లాంటి నేతలంతా యువ నాయకుడికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారని అంటున్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్ అడ్డంగా దొరికిపోయినప్పుడు...పైకి టీఆర్ఎస్ కుట్ర అంటూ కామెంట్స్ చేసినా...లోలోన సంతోషపడ్డారని, ఏ చిన్న సందు దొరికినా రేవంత్ ను తొక్కేయాలని ఎత్తులు వేస్తోందట ఈ పేకాట బ్యాచ్.
అయితే ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని జైలుపాలై కష్టాలుపడ్డ రేవంత్ రెడ్డిపై చంద్రబాబుకు సానుభూతి ఉందని, పైగా కేసీఆర్, టీఆర్ఎస్ ను ధీటుగా ఢీకొట్టాలంటే అతనే కరెక్ట్ అనే భావనలో ఉన్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి, కానీ సీనియర్ లీడర్ ఎర్రబెల్లిని కాదని, రేవంత్ కి పగ్గాలు అప్పగిస్తే అసలుకే మోసం వస్తుందని సందిగ్ధంలో పడ్డారంటున్నారు, దాంతో ఈ ఇద్దరిలో ఒకరిని అధ్యక్యుడిగా, మరొకరిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించాలనే నిర్ణయానికి వచ్చారని, ఒకవేళ రేవంత్ కే పగ్గాలివ్వాల్సి వస్తే, ఎర్రబెల్లికి మళ్లీ పాత పోస్టే ఇచ్చే అవకాశముందని అంటున్నారు. అయితే వీరిద్దరిలో ఎవరికి ఏ పదవి ఇచ్చినా పొసగదని, ఆధిపత్య పోరుతో పార్టీ కేడర్ నలిగిపోవడం ఖాయమంటున్నారు మిగతా నేతలు. పైగా తెలంగాణలో పార్టీ అధికారంలోకి వస్తే తానే సీఎం అభ్యర్ధినంటూ రేవంత్ చెప్పుకుంటున్నారని, చంద్రబాబు కూడా సీనియర్లను కాదని, రేవంత్ కే ప్రాధాన్యత ఇస్తున్నారని మోత్కుపల్లి లాంటి లీడర్లు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ రెడ్డి లాంగ్వేజ్ పైనా అభ్యంతరం తెలిపిన మోత్కుపల్లి.... పులులు, సింహాలంటూ సినిమా డైలాగ్ లు మానేయాలంటూ చురకలంటించినట్లు తెలుస్తోంది.
అయితే తెలంగాణలో టీడీపీ...పునర్ వైభవం సాధించాలంటే రేవంత్ లాంటి ఫైర్ ఉన్న నాయకుడే కావాలని, టీటీడీపీని నడిపించగల సత్తా ఒక్క రేవంత్ రెడ్డికి మాత్రమే ఉందని చంద్రబాబు భావిస్తున్నారట. పైగా కేసీఆర్ ను, టీఆర్ఎస్ నేతలను సమర్ధంగా ఎదుర్కోవాలంటే అది రేవంత్ వల్లే సాధ్యమని, అందుకే గులాబీ నేతలు కూడా అతడ్ని టార్గెట్ చేశారని చెబుతున్నారట. అయితే దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్లను కాదని, జూనియరైన రేవంత్ కి పగ్గాలు అప్పగిస్తే, కొత్త తల నొప్పులు వస్తాయని భావిస్తున్న అధినేత...ఆచితూచి అడుగులేస్తున్నారు. ఇప్పటికే వలసలతో సతమతమవుతూ, ఓటుకు నోటు కేసుతో ఇబ్బందులు పడుతున్న పార్టీలో మరో సంక్షోభం వస్తే, తెలంగాణలో నిలదొక్కుకోవడం కష్టమని భావిస్తున్న చంద్రబాబు...సీనియర్లను బుజ్జగించే పనిలో పడ్డారట.
http://www.teluguone.com/news/content/t-tdp-45-50051.html





