సర్కారే సమ్మె కోరుతోందా?
Publish Date:Jan 30, 2022
Advertisement
ప్రభుత్వం అంటే ఒక భరోసా. ఒక విశ్వాసం.అయితే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, ఉద్యోగుల పీఆర్సీ విషయంలో ఉద్యోగుల విశ్వాసాన్ని కోల్పోయింది. అందుకే ఉద్యోగ సంఘాల నాయకులు బహిరంగంగా ప్రభుత్వం మీద విశ్వాసం లేక పోవడం వల్లనే, చర్చలకు ముందస్తు షరతులు విధించ వలసి వస్తోందని అంటున్నారు.
ప్రభుత్వం మూడు సంవత్సరాల క్రితం 27 శాతం ఐఆర్ ఇచ్చింది. సో.. సహజంగానే పీఆర్సీ ఫిట్మెంట్ అంతకంటే ఒక శాతమో, అర శాతమో ఎక్కువ ఉంటుందని ఉద్యోగులు ఆశించారు. కానీ, ప్రభుత్వం ఊరించి, ఊరించి చివరకు, కొవిడ్ కారణంగా చూపింది ఐఆర్ కంటే ఫిట్మెంట్ నాలుగు శాతం తగ్గించింది.హెచ్ఆర్ఏకు కోత పెట్టింది. ఇంతచేసి, ఉద్యోగులను దోషులుగా చిత్రించే ప్రయత్నం చేస్తోంది. ఎస్మా ప్రయోగిస్తామని బెదిరిస్తోది. అందుకే ఉద్యోగులు ప్రభుత్వాన్ని విశ్వసించ లేని పరిస్థితి వచ్చిందని, పరిశీలకులు అంటున్నారు. అందుకే, సర్కార్ బెదిరింపులకు దిగినా ఎస్మాను ఎక్కుపెట్టినా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈ రోజు (ఆదివారం) కూడా రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.
అలాగే, కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు, పెన్షన్స్ బిల్స్ తయారు చేయాలని ప్రభుత్వం మరోసారి ట్రెజరీలు, డిడి, పిఏవో అధికారులకు సర్క్యూలర్ జారీ చేసింది. అయినా మెజార్టీ ఆఫీసుల్లో ట్రెజరీ సిబ్బంది హాజరుకాలేదు. కొన్ని ప్రాంతాల్లో మొత్తానికి సబ్ ట్రెజరీ కార్యాలయాలు తెరుచుకోలేదు. జిల్లా కేంద్రాల్లోని ట్రెజరీ కార్యాలయాల్లో 50 శాతం సిబ్బంది మాత్రమే హాజరయ్యారు. పోలీస్ శాఖ, కోర్టు సిబ్బంది వేతన బిల్లులను మాత్రమే ప్రస్తుతం ప్రొసెస్ చేస్తున్నారు.
అయినా, ప్రభుత్వం బింకం వదలడం లేదు. అంతే కాదు, ఉద్యోగులను ఇంకా రెచ్చగొట్టేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఇప్పటికిప్పుడు, ఉద్యోగులు సమ్మె ప్రతిపాదనను వెనక్కి తీసుకుని, కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు తీసుకునేందుకు అంగీకరించినా, ఇప్పటికిప్పుడు జీతాలు పూర్తి స్థాయిలో చెల్లించే పరిస్థితిలో సర్కార్ ఖజానా లేదు. కొత్త ఆర్థిక సంవత్సరం వరకు, ఇక అప్పులు తెచ్చుకునే వెసులు బాటు కుడా లేదని అంటున్నారు. మరో వంక జనవరిలో చెల్లించవలసిన డిసెంబర్ జీతాలనే ప్రభుత్వం ఇప్పటికీ పూర్తిగా చెల్లించలేదని ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు. నిజానికి, చెల్లించే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. ఖాళీ ఖజానా ఎక్కిరిస్తోందని, అధికార వర్గాల సమాచారం అంటున్నారు. అందుకే, వరసగా రెండు నెలలు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించే ప్రమాదం ఉందని, అందుకే, ఉద్యోగులను రెచ్చగొట్టి సమ్మెకు పంపేందుకు అవసరమైన ఇంధనాన్ని ప్రభుత్వమే అందిస్తోందని మాట కూడా అధికార, రాజకీయ వర్గాల్లో వినవస్తోంది.
పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఇవ్వవలసిన పీఎఫ్, ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చే పరిస్థితి లేక ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 పెంచింది. ఆ విధంగ కొంత ఊపిరి తీసుకుంది. ఇప్పటికే రిటైర్ అయిన ఉద్యోగులకు ఇవవలసిన పీఎఫ్ బకాయిలే రూ.800 కోట్లు ఉంటుందని అంచనా. ఇతర బకాయిలూ కలిపితే రూ.2,100 కోట్లు చెల్లించాలని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. పదవీ విరమణ వయసు పెంచకపోతే కొత్తగా నెలనేలా రిటైరయ్యే ఉద్యోగులకు చెల్లించివలసిన మొత్తం తడిసి మోపెడవుతుంది. అందుకే జగన్ రెడ్డి ప్రభుత్వం పదవీ విరమణ వయసును రెండేళ్ళు పెంచి ఆ మేరకు కుషన్ తీసుకుందని అంటున్నారు.
అలాగే, కొత్త ఆర్థిక సంవత్సరం వచ్చి కొత్త అప్పులకు పచ్చ జెండా ఊపెవ్రకు వరకు ఉద్యోగుల జీతాల చెల్లింపు నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వమే, వెనకుండి సమ్మెకు ఎగదోస్తోందా.. అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి, నిజంగా ఉద్యోగులు సుదీర్ఘ సమ్మెకు పోతే, ఉద్యోగుల జీతాలే కాదు, ఉద్యోగులు సహకరించడం లేదనే నెపంతో, టూ బర్డ్స్ ఎట్ వన్ షాట్ అన్నట్లుగా సంక్షేమ పథకాలకు కూడా పంగనామాలు పెట్టవచ్చనే, దుష్ట పన్నాగం ఉన్నా ఉండవచ్చని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/strategy-of-jagan-behind-dealing-with-employees-39-130934.html





