ఆ రాష్ట్రాల ఎన్నికలు తెలంగాణపై ప్రభావం చూపుతాయా?
Publish Date:Jan 30, 2022
Advertisement
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకు పలచనవుతోంది. కాంగ్రెస్ పార్టీతో ఉన్న తరతరాల అనుబంధాన్ని తెంచుకుని, పార్టీ సీనియర్ నాయకులు బయటకు వెళ్ళిపోతున్నారు. ఉత్తర ప్రదేశ్’ (ఆర్పీ సింగ్) మొదలు కర్ణాటక ( సీఎం ఇబ్రహీం) వరకు అనేక్ర రాష్ట్రాలలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
ఇక అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న ఐదు రాష్ట్రాలలో, ప్రస్తుతం ఒక్క పంజాబ్’లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుంది. అయినా,ఎన్నికల ప్రకియ ప్రారంభానికి ముందు పంజాబ్’తో పాటు ఉత్తరాఖండ్, గోవాలోనూ కాంగ్రెస్’కు కొంత అనుకూల వాతవరణం కన్పించింది. అయితే ఇప్పడు ఆ పరిస్థితి లేదని సర్వేలు సూచిస్తున్నాయి. పంజాబ్ కూడా చే’జారిపోవడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు.
మరోవంక ఉత్తరప్రదేశ్’లో ప్రియంకా వాద్రా ఎంతో కొంత ప్రభావం చూపుతారని, పార్టీ తిరిగి పట్టాల మీదకు వస్తుందని అనుకుంటే, అదీ కనిపించడం లేదు. గత (2017) ఎన్నికల్లో 7 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ, రేపటి ఎన్నికల్లోనూ సింగిల్ డిజిట్ ‘కే పరిమితం అవుతుందని సర్వేలు చెపుతున్నాయి. దీంతో ప్రియాంకా కూడా పార్టీని రక్షించలేరనే నిజం నిర్ధారణ అయిందని అందుకే, సీనియర్ నాయకులు ఎవరి దారి వారు చూసుకుంటున్నారని అంటున్నారు.
అదలా ఉంటే, జాతీయ పరిణామాల ప్రభావం తెలంగాణ, రాజకీయాలపై, ముఖ్యంగా రాష్ట్ర కాంగ్రెస్’పై ఏ విధంగా ఉంటుందనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా, రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్త మవుతున్న నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ తెరాసకు ప్రత్యన్మాయంగా నిలబడగలదా? అనే చర్చ రాజకీయ, మీడియా వర్గాల్లో జరుగుతోంది. నిజానికి,దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ బలంగానే వుంది. 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం అయితే కట్టలేదు కానీ, ప్రధాన ప్రతిపక్ష హోదాను కట్ట బెట్టారు. సరే, కాంగ్రెస్ పార్టీ ఆ హోదాను నిలుపుకోలేక పోయింది అనుకోండి, అది వేరే విషయం.
అయితే, 2019 లోక్ సభ ఎన్నికలలో అనూహ్యంగా బీజేపీ నాలుగు స్థానాలు గెలుచుకోవడంతో తెరాసకు ప్రత్యాన్మాయం, కాంగ్రెస్సా, బీజేపీనా అన్న చర్చ మొదలైంది. అయితే, రాష్ట్రంలో బీజేపీ కంటే కాంగ్రెస్ బలమైన పార్టీ అనే అభిప్రాయం ఉన్నా, 2019 తర్వాత జరిగిన అన్ని ఉపఎన్నికలలో కాంగ్రెస్ కంటే బీజేపీ మెరుగిన్ ఫలితాలు సాధించింది. అప్పటి పీసీసీ చీఫ్ సిట్టింగ్ స్థానం హుజూర్ నగర్’ మొదలు హుజూరాబాద్ వరకు కాంగ్రెస్ ఓటమి చవిచూసింది. చివరకు మాజీ సీఎల్పీ నాయకుడు జానారెడ్డి స్ట్రాంగ్ హోల్డ్ నాగార్జున సాగర్ ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. మరో వంక బీజేపీ అధికార తెరాస సిట్టింగ్ సీట్లు దుబ్బాక,హుజురాబాద్’లలోగెలిచింది. జీహెచ్ఎంసిలోనూ కాంగ్రెస్ పార్టీ రెండు డివిజన్లకు పరిమితం అయితే, బీజేపీ రెండు నుంచి 48కి ఎదిగింది.
ఇలా ఇంతవరకు బీజేపీ చేయి సాదించింది అంతే కాకుండా, ఇండియా టుడే నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ తాజా సర్వే లోనూ బీజీపీదే ఫై చేయిగా నిలిచింది. బీజేపీ ప్రస్తుతమున్న నాలుగుకు అదనంగా మరో రెండు స్థానాలు కలుపుకుని, మొత్తం ఆరు లోక్ సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని సర్వే సూచించింది. మరోవంక కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతమున్న మూడు లోక్ సభ స్థానాల్లో ఒకటి కోల్పోయి, రెండుకు పరిమితం అవుతుందని సర్వే చెప్పింది.ఇలాంటి పరిస్థిలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, మరింత బలహీనమైతే, ఆ ప్రభావం రాష్ట్రపైనా ఉంటుందని, అంటున్నారు. అంతే కాకుండా, ఇప్పటికీ పార్టీలో కుతకుత ఉడుకుతున్న అసమ్మతి కారణంగానూ కాంగ్రెస్ పార్టీ మరింతగా బలహీనమవుతుంది అంటున్నారు.
అయితే ప్రస్తుతం బీజేపీ ఊపులో ఉన్నా ఆ పార్టీకి రాష్ట్రంలో మూడొంతులకు పైగా నియోజక వర్గాల్లో సరైన అభ్యర్ధులు లేరు. నాయకత్వం, కార్యకర్తల బలం అంతకంటే లేదు. ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో బీజేపీకి అసలే పట్టు లేదు. అదే కాంగ్రెస్ కు రాష్ట్రమంతటా బలమైన పునాదులున్నాయి.అందుకే జాతీయ స్థాయిలో చతికిల పడ్డా, రాష్ట్రంలో కాంగ్రెస్’ ఆశలు వదులు కోవలసిన అవసరం లేదని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/effect-of-five-state-elections-on-telangana-39-130932.html





