జగనన్న పాలనలో మహిళలపై దారుణాలెన్నో..!?
Publish Date:Mar 19, 2022
Advertisement
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై వైసీపీ దుండగుల దాడి.. ఫర్నీచర్ ధ్వంసం.. మొన్నా మధ్య తమ పార్టీకే చెందిన ప్రకాశం జిల్లా నాయకుడు సుబ్బారావుగుప్తాపై వైసీపీ నేతల దాడి.. మోకాళ్లపై కూర్చోబెట్టి మరీ క్షమాపణలు చెప్పించిన వైనం.. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి సతీమణిపై అసెంబ్లీ సాక్షిగా సిగ్గులేని వ్యాఖ్యలు.. తాజాగా కృష్ణాజిల్లా మచిలీపట్నం మండలంలో వీఏఓ గరికపాటి నాగలక్ష్మిపై వైసీపీ గ్రామస్థాయి నేత గరికపాటి నరసింహారావు లైంగికంగా, మానసికంగా వేధించిన తీరు.. ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు. కేసు నమోదు చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన వైనం.. స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసినా స్పందించని జిల్లా ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ .. ఎక్కడికి వెళ్లినా తనకు న్యాయం జరగదనే నిస్సహాయతలో ఆత్మ హత్యాయత్నం.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచిన వీఓఏ నాగలక్ష్మి.. తాజాగా కృష్ణా జిల్లా కైకలూరు సీఐ వైవీ నాయుడు, ఎస్సై గాయత్రి వేధింపులతో కలిదిండి మండలం మూలలంక వాసి కొక్కిలిగడ్డ లక్ష్మి ఆత్మహత్యా యత్నం.. ఆంధ్రప్రదేశ్ లో అసలేం జరుగుతోందో అర్థం అవుతోందా..!? సీఎం జగన్ రెడ్డి ఏలుబడిలో నిర్విరామంగా.. నిరంతరాయంగా ఎన్నెన్నో దారుణాలు జరిగిపోతూనే ఉన్నాయి. లైంగిక వేధింపులతో వీఓఏ నాగలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నా స్వేచ్ఛగా బయటే తిరుగుతున్న నిందితుడు నరసింహారావు. లైంగికంగా, మానసికంగా వేధించడమే కాకుండా అసభ్య పదజాలంతో నోటికొచ్చినట్లు దూషిస్తూ ప్రభుత్వ కార్యాలయంలోనే నాగలక్ష్మిపై దాడికి యత్నించిన నిందితుడు. నరసింహారావు తనపై దాడికి చేశాడని ఫిబ్రవరి 24నే బందరు తాలూకా పోలీస్ స్టేషన్ లో నాగలక్ష్మి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు.. కేసు నమోదు చేయలేదు. నిందితుడు నరసింహారావు చేసిన ఒత్తిళ్లకు కిందిస్థాయి పోలీసు అధికారులు తలొగ్గారని, స్పందన కార్యక్రమంలో ఈ నెల 14న జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ కు నాగలక్ష్మి నేరుగా స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. అక్కడ కూడా నాగలక్ష్మికి న్యాయం జరగలేదు. దీంతో మార్చి 16న ఆత్మహత్యా యత్నానికి పాల్పడడం ఆమె ఎంతగా భయపడ్డారో, మరెంతగా నిస్సహాయురాలిగా భావించారో వెల్లడవుతోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ మరుసటి రోజు తెల్లవారుజామున నాగలక్ష్మి తుదిశ్వాస విడిచారు. అయినా నరరూప రాక్షసుడిగా, అపర కీచకుడిగా మారిన వైసీపీ నేత నరసింహారావు స్వేచ్ఛగా కాలరెగరేసుకుని తిరిగిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. గ్రామస్థాయి వైసీపీ నేతలే ఇంతలా రెచ్చిపోవడం వెనుక ఆ పార్టీలోని ఏయే పెద్దల అభయహస్తం ఉందో.. ఎంత స్ధాయి నేతల వెన్నుదన్ను అతడికి ఉందో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదైతేనేం నాగలక్ష్మి తనువు చాలించిన తర్వాత పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో పోలీసులు తాపీగా సీన్ లోకి ఎంటరయ్యారు. స్పందన కార్యక్రమంలో ఎస్పీకి నాగలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వేధింపులు, బెదిరింపుల సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు మీడియాకు పోలీసులు చెప్పేసి ‘మమ’ అనిపించుకున్నారు. మార్చి 17న నాగలక్ష్మి కుమారుడు పార్థశివసాయి ఇచ్చిన ఫిర్యాదుతో అదే రోజు కేసు నమోదు చేయడం, నిందితుడ్ని అరెస్ట్ కూడా చేసినట్లు మీడియాకు పోలీసులు ఓ ప్రకటన విడుదల చేయడం గమనించదగ్గ అంశం. అరెస్ట్ చేసిన దానికి రుజువుగా నిందితుడితో డీఎస్పీ సహా కిందిస్థాయి సిబ్బంది వరకూ ఫొటోలు రిలీజ్ చేయడం విశేషం. అయితే.. తనపై నరసింహారావు లైంగికంగా వేధించాడని, దూషిస్తూ దాడి చేశాడని ఫిబ్రవరి 24నే నాగలక్ష్మి ఫిర్యాదు చేసినా, అనంతరం స్పందన కార్యక్రమంలో నేరుగా ఎస్పీకే కంప్లైంట్ చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. పోలీసులు చెబుతున్నట్లు 16వ తేదీనే లైంగిక వేధింపుల సెక్షన్ కింద కేసు నమోదు చేసి ఉంటే అదే రోజున ఎందుకు నరసింహారావును అదుపులోకి తీసుకోలేదని ప్రశ్నలు పలువురి నుంచి పోలీసులకు ఎదురవుతున్నాయి. నిజంగా ఆ రోజే నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు నాగలక్ష్మికి పోలీసులు చెప్పినా ఆమె బలవంతంగా ప్రాణాలు తీసుకుని ఉండేది కాదు కదా అంటున్నారు. పైగా నాగలక్ష్మి ఫిర్యాదు ఇస్తే.. నరసింహారావుకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపామని పోలీసులు చెప్పడం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. సీఎం జగన్ రెడ్డి దిశ యాప్ తెచ్చామన్నారు.. నిందితుల్ని 24 గంటల్లో పట్టేస్తామని గొప్పలు చెప్పారు. మహిళలపై నేరాల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దోషులు ఎంతటి వారైనా జైలు ఊచలు లెక్కపెట్టిస్తామంటూ ప్రగల్బాలు పలికారు. పార్లమెంటులో దిశ చట్టాన్ని ఆమోదింప చేసుకోకపోవడంలో వైసీపీ సర్కార్ చేతకానితనం బట్టబయలైంది. ఇప్పుడు తన పార్టీకి చెందిన వ్యక్తే ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడడం, ప్రభుత్వ కార్యాలయంలోనే భౌతిక దాడికి యత్నించడంపై సీఎం జగన్ రెడ్డి ఇంతవరకూ ఎందుకు స్పందించలేదని, ఎందుకు చర్యలు తీసుకోలేదనే విమర్శలు సర్వత్రా వస్తున్నాయి. వైసీపీ నేత నుంచి తనకు జరిగిన అన్యాయంపై ఓ మహిళ స్వయంగా పోలీస్ స్టేషన్లోను, ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోలేదనే ప్రశ్న వస్తోంది. నాగలక్ష్మి ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన బందరు తాలూకా పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ పై చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామస్థాయి వైసీపీ నేత గరికపాటి నరసింహారావు తన కోర్కె తీర్చాలంటూ అనేకసార్లు తనను అడిగాడని, రాయడానికి, చెప్పడానికి వీల్లేని విధంగా అసభ్యంగా ప్రవర్తించి ఇబ్బంది పెట్టాడని నాగలక్ష్మి జిల్లా ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనడాన్ని చూస్తే.. ఆమె ఎంత మానసిక వేదనకు గురయ్యారో అనే విషయం తేటతెల్లం అవుతోంది. వెలుగు కార్యాలయంలో జరిగిన గొడవలో తన భార్య ముందే ‘ఎప్పటికైనా నిన్ను అనుభవించి తీరతా’ అంటూ హెచ్చరించడం చూస్తే.. అధికారం తమ పార్టీ చేతుల్లో ఉంది.. సీఎం జగన్ తమపై చర్యలు తీసుకోరనే ధీమా, బరితెగింపు నరసింహారావులో ఉన్నాయని అంటున్నారు. అసలే ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోయి, పుట్టెడు కష్టాల్లో ఉన్న తమకు వైసీపీ దుర్మార్గుల పీడ ఎప్పుడు వదిలిపోతుందదో.. ఎప్పుడు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోగలుగుతామో అని ప్రజలు ఎదురుచూపులు చూస్తున్నారు. ఎప్పుడు ఛాన్స్ వస్తే.. అప్పుడు వైసీపీకి గుణపాఠం చెప్పాలని డిసైడ్ అయినట్లు సూచనలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/special-story-on-voa-nagalakshmi-case-in-ap-39-133229.html





