అమరావతి వర్సెస్ మావిగన్ కాదు.. విజనరీ వర్సెస్ మెంటల్ కేసు..! : సోమిరెడ్డి

Publish Date:Jul 2, 2026

Advertisement

 

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ రెడ్డి ఇటీవల నిర్వహించిన ప్రెస్‌మీట్‌ను పరిశీలిస్తే ఆయన ఏమి మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కాని పరిస్థితి కనిపిస్తోందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ గందరగోళమే ఎక్కువగా కనిపిస్తోందని విమర్శించారు.

జగన్ కొత్తగా "రేపటి ఎన్నికల్లో అమరావతికి – మావిగన్‌కు మధ్య పోటీ" అనే నినాదాన్ని తీసుకొచ్చారని, ఇది అమరావతికి – మావిగన్‌కు మధ్య పోటీ కాదని, భవిష్యత్తును నిర్మించే విజనరీ నాయకత్వానికి, విధ్వంసక రాజకీయాలకు మధ్య పోటీ అని పేర్కొన్నారు. అభివృద్ధికి – అరాచకానికి, సంక్షేమానికి – విధ్వంసానికి మధ్య జరిగే పోటీగా దీనిని ప్రజలు చూస్తున్నారని అన్నారు.

ఒకప్పుడు అమరావతి రాజధానిపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించిన జగన్, ఆ తర్వాత మూడు రాజధానుల సిద్ధాంతాన్ని తెచ్చారని, విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటిస్తామని చెప్పారని గుర్తుచేశారు. ఇప్పుడు మళ్లీ "మావిగన్" అనే కొత్త నినాదాన్ని తెరపైకి తీసుకువచ్చారని, అసలు ఆయన వైఖరి ఏమిటో ప్రజలకు స్పష్టంగా అర్థం కావడం లేదన్నారు.

దేశమంతా అమరావతికి అండగా నిలుస్తుంటే జగన్ రెడ్డి ఒక్కరే వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. అమరావతి ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అని పేర్కొన్నారు. పేరులో "గన్" ఉందని రాజధాని పేరులోనూ "గన్" ఉండాలని కోరుకోవడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.

మూడు రాజధానుల పేరుతో ప్రజలను మభ్యపెట్టినందుకే గత ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లకే పరిమితమైందని, ఇప్పుడు "మావిగన్" పేరుతో మరో రాజకీయ నినాదం తీసుకొస్తే మూడు సీట్లు కూడా రావడం కష్టమేనని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ నేతలే జగన్ ముఖం చూడని పరిస్థితి వస్తుందని, ఆ పార్టీలోనే తిరుగుబాటు ప్రారంభమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు.

దేశంలో హైవేపై రాజధాని నిర్మించిన రాష్ట్రం ఒక్కటీ లేదని, కానీ జగన్ మాత్రం హైవేపై రాజధాని నిర్మిస్తామని చెబుతున్నారని విమర్శించారు. ఇప్పటికే అమరావతిలో 50 వేల ఎకరాలకు పైగా భూమిలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేట్ సంస్థలు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాయని తెలిపారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు 15 జాతీయ బ్యాంకులు అమరావతిలో కార్యకలాపాలకు సిద్ధమవుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ పెట్టుబడులు, జాతీయ స్థాయి సంస్థలు, మౌలిక వసతులు ఏర్పడుతున్న ఈ సమయంలో వాటన్నింటినీ బుల్డోజర్‌తో తొక్కేస్తానన్నట్లుగా మాట్లాడటం అత్యంత బాధ్యతారాహిత్యమని విమర్శించారు.

భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్ర రాజధాని అంశంపై లోక్‌సభలో ఇంత విస్తృత మద్దతు లభించడం అరుదని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, జనసేన, టీఎంసీ, ఆప్, బీఆర్ఎస్, సమాజ్‌వాదీ పార్టీ, బీజేడీ, ఆర్జేడీ, జేడీయూ, శివసేనతో పాటు 20కి పైగా రాజకీయ పార్టీలు అమరావతికి మద్దతు ప్రకటించాయని చెప్పారు.

దేశం మొత్తం అమరావతి వెనుక నిలిస్తే వైసీపీ మాత్రం ఆ చర్చను బహిష్కరించి బయటకు వెళ్లిపోయిందన్నారు. రైతుల త్యాగాలతో నిర్మితమవుతున్న రాజధానికి దేశమంతా అండగా నిలబడుతుంటే జగన్ దానిని వ్యతిరేకించడం రాష్ట్ర ప్రజల మనోభావాలను అవమానించడమేనని అన్నారు.

అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయని తెలిపారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, ఎయిమ్స్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్, ఇగ్నో రీజినల్ సెంటర్, జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలు, ఎన్విడియా భాగస్వామ్యంతో ప్రతిపాదిత ఏఐ యూనివర్సిటీ వంటి సంస్థలు అమరావతికి వస్తున్నాయని పేర్కొన్నారు.

రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది పడుతున్న ఈ సమయంలో ప్రజలను కొత్త కొత్త నినాదాలతో తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం దురదృష్టకరమని విమర్శించారు. జగన్ రెడ్డి ఆలోచన చూస్తుంటే అమరావతి అభివృద్ధిని ఎలా అడ్డుకోవాలన్నదానిపైనే దృష్టి పెట్టినట్లు కనిపిస్తోందన్నారు.

ఎకరాకు రూ.10 కోట్ల విలువ అంచనా వేసినా, భూమి విలువ, ప్రభుత్వ భవనాలు, సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, విద్యాసంస్థలు, ప్రైవేట్ నిర్మాణాలు కలిపితే లక్షల కోట్ల రూపాయల ప్రజల ఆస్తి అమరావతిలో ఏర్పడుతోందన్నారు. అలాంటి ప్రజల ఆస్తిని ధ్వంసం చేయాలని మాట్లాడటం బాధ్యతాయుత రాజకీయాలకు తగదన్నారు.

రాష్ట్ర భవిష్యత్తు కోసం వేలాది మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని, వారి త్యాగాల ఫలితంగానే ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం సాధ్యమవుతోందన్నారు. అలాంటి రైతుల ఆశలు, ఆస్తుల విలువ, వారి భవిష్యత్తు నాశనం కావాలని కోరుకోవడం రాజకీయ నాయకుడికి తగిన లక్షణం కాదన్నారు.

జగన్ ఇప్పుడు ఏపీని "జంగిల్ రాజ్" అంటున్నారని, కానీ ఆయన సీఎంగా ఉన్నప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవో ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. బయటకు రావాలంటే చెట్లు నరికించడం, పరదాలు కట్టించడం, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిపివేయడం, భారీ పోలీసు బందోబస్తు మధ్య పర్యటనలు చేయడం జరిగేదన్నారు.

దీనికి విరుద్ధంగా కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రజల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని, పరదాలు లేవని, చెట్లు నరికించడం లేదని, ట్రాఫిక్‌ను గంటల తరబడి నిలిపివేయడం లేదని తెలిపారు. ఇదే చంద్రబాబు పరిపాలనకు, జగన్ పాలనకు మధ్య ఉన్న తేడా అని అన్నారు.

అమరావతికి లక్షల కోట్ల పెట్టుబడులు రావడం, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు ఏర్పడటం, అంతర్జాతీయ రాజధానిగా ఎదుగుతుండటం చూసి జగన్‌లో అసహనం పెరుగుతోందని విమర్శించారు. అమరావతి రైతులు, మహిళలు ఉద్యమం చేసిన సమయంలో వారిపై జరిగిన వేధింపులను రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదన్నారు. పాదయాత్రగా తిరుమలకు వెళ్తున్న మహిళలను ఇబ్బందులకు గురిచేయడం, భోజన టెంట్లు తొలగించడం, అవమానించడం వంటి ఘటనలు ప్రజల కళ్లముందే ఇంకా మెదులుతున్నాయని గుర్తుచేశారు.

ప్రస్తుతం అమరావతిలో రూ.57,821 కోట్ల విలువైన 97 రకాల అభివృద్ధి పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు భారీ పెట్టుబడులతో ముందుకొస్తున్నాయని, క్వాంటమ్ వ్యాలీ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు కార్యరూపం దాల్చుతున్నాయని తెలిపారు.ప్రజావేదికను కూల్చినట్టే అమరావతి అభివృద్ధిని కూడా కూల్చేస్తాననే సంకేతాలను జగన్ ఇస్తున్నారని, రాష్ట్ర ప్రజలు ఈ విధ్వంస రాజకీయాలను గమనిస్తున్నారని అన్నారు.

జగన్‌మోహన్ రెడ్డి ఒక విషయం గుర్తుంచుకోవాలని, ఈ దేశంలో చట్టానికి ఎవరూ అతీతులు కాదని పేర్కొన్నారు. అనేక కేసుల్లో కొద్ది సంవత్సరాల్లోనే విచారణ పూర్తై తీర్పులు వెలువడుతున్నాయని, అయితే జగన్‌పై నమోదైన అవినీతి కేసులు 14 ఏళ్లుగా విచారణలోనే కొనసాగుతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఆ కేసుల విచారణ ఎప్పుడు పూర్తవుతుందా అని ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఇప్పటికైనా జగన్ రెడ్డి మానవత్వంతో వ్యవహరించాలని హితవు పలికారు..!

సీఎం నారా చంద్రబాబు నాయుడు రోజుకు 16 నుంచి 17 గంటలు రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమిస్తున్నారని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్థానిక సంస్థలను బలోపేతం చేస్తున్నారని, మంత్రి నారా లోకేష్ ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు తీసుకురావడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. యువతకు ఉపాధి, పరిశ్రమలు, పెట్టుబడులు, ప్రపంచస్థాయి మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు.
 

By
en-us Political News

  
తెలంగాణ పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ (PCS), హైదరాబాద్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా విధులు
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
టీచర్లకూ మధ్యాహ్న భోజనం.. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో సరికొత్త పర్యాటక విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది.
తెలంగాణ పోలీస్ శాఖ భద్రతా ఏర్పాట్లలో కీలక మార్పులు చేపట్టింది.
పోస్టాఫీసు నుంచి స్పీడ్ పోస్ట్‌లో వచ్చే పార్శిల్‌లో మందులు ఉంటాయని భావిస్తారు.
కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం వీబీ జీ రామ్ జీ ఏపీ నుంచి ప్రారంభమై దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది.
కర్ణాటక రాజధాని బెంగళూరు నగర శివార్లలో గురువారం తెల్లవారుజామున ఒక ఊహించని ఘోర విషాదం చోటుచేసుకుంది.
కంచన్ భాగ్ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీశ్ రావుతో పాటు ఇతర నేతలను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో మాజీ ఐపీఎస్ అధికారి ఏ.కే. ఖాన్ కుమారుడు మొహ్సిన్ ఖాన్‌తో పాటు తబ్రేజ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
పుణేకు చెందిన ప్రముఖ రియల్టర్ కేతన్ అగర్వాల్ దారుణ హత్య కేసు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది.
శ్రీకాకుళం తీరప్రాంతంలో అపారంగా లభ్యమవుతున్న బీచ్ శాండ్ మరియు హెవీ మినరల్స్ (భారీ ఖనిజాలు) ఆంధ్రప్రదేశ్ రాజకీయ, ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చగల సత్తా ఉన్న అంశాలు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.