కర్ణాటక డిప్యూటీ సీఎంగా సిద్దరామయ్య కొడుకు
Publish Date:May 29, 2026
Advertisement
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా.. డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టనుండటం ఖాయమైంది. నాయకత్వ మార్పు నేపథ్యంలో తన కుమారుడు, ఎమ్మెల్యే యతీంద్ర సిద్ధరామయ్యకు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని పార్టీ అధిష్ఠానాన్ని సిద్ధరామయ్య కోరడం ... దానికి కాంగ్రెస్ హైకమాండ్ సుముఖంగా ఉందన్న ప్రచారం జరుగుతోంది. కీలకమైన సీఎల్‌పీ నేతగా డీకే ఎన్నిక శనివారం (30-5-26న) జరగనుంది. జూన్ 1న డీకే సర్కార్ ప్రమాణస్వీకారం చేయనున్నారంట. అంతవరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య కొనసాగుతారు. కాగా, మంత్రివర్గ కూర్పుపై ఢిల్లీలో సిద్ధరామయ్య, డీకే పార్టీ అధిష్ఠానంతో వరుస సమావేశాలు జరుపుతున్నారు. ఈ సమావేశంలో సిద్ధరామయ్య తన డిమాండ్లను అధిష్ఠానం ముందుంచినట్టు చెబుతున్నారు. యతీంద్ర సిద్ధరామయ్యకు ఉపమఖ్యమంత్రి పదవిని సిద్ధరామయ్య ఆశిస్తున్నారు. దీనితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు కేజే జార్జి, జి.పరమేశ్వరలకు క్యాబినెట్‌లో చేటు కల్పించాలని సిద్ధరామయ్య కోరినట్టు తెలుస్తోంది. ఆ ఇద్దరూ కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్ష పదవిని ఆశించడం లేదని ఆయన వివరించినట్టు తెలిసింది. కాంగ్రెస్ అధిష్ఠానం సూచనల మేరకు సిద్ధరామయ్య తన పదవికి గురువారం రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఆమోదించేందుకు, మంత్రిమండలిని రద్దు చేసేందుకు గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ లాంఛనంగా అంగీకరించారు. అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగేంత వరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాల్సిందిగా సిద్ధరామయ్యకు గవర్నర్ సూచించారు.
http://www.teluguone.com/news/content/siddaramaiah-36-221240.html





