రోడ్డుపై బాణసంచా కాల్చొద్దన్నందుకు ..ఎస్ఐను చంపేశారు.!
Publish Date:Nov 9, 2026
Advertisement
ప్రజల ప్రాణాలకు ముప్పు కలగకూడదని హెచ్చరించడమే ఆయన చేసిన నేరమైంది. రోడ్డుపై బాణసంచా కాల్చొద్దని చెప్పడమే ఆయన పాలిట శాపమైంది. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ పోలీసు అధికారి.. కొందరు యువకుల విచక్షణారహిత దాడికి బలయ్యారు. పండుగ పూట ఇంటికి తిరిగొస్తాడని ఎదురుచూస్తున్న కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చారు. రీల్స్ పిచ్చి, క్షణికావేశం కలిసి ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. తమిళనాడులో జరిగిన ఈ దారుణ ఘటన సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. తమిళనాడు రాష్ట్రంలోని తేని జిల్లాలో దీపావళి వేళ ఈ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. సమాజంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు అధికారే.. చివరకు కొందరు యువకుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. మృతుడిని తేని డీఎస్పీ కార్యాలయంలో స్పెషల్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సెంథిల్ కుమార్‌గా గుర్తించారు. ఆదివారం రాత్రి విధులు ముగించుకున్న సెంథిల్ కుమార్ సాధారణ దుస్తుల్లో తన ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరారు. రోజంతా విధుల్లో గడిపిన ఆయన.. కుటుంబ సభ్యుల వద్దకు చేరుకోవాలనే ఆలోచనతో ప్రయాణం సాగిస్తున్నారు. కానీ మార్గమధ్యంలో కనిపించిన ఓ దృశ్యం ఆయన ప్రాణాలనే ప్రమాదంలో పడేస్తుందని ఊహించలేదు. సమాధర్మపురం ప్రధాన రహదారిపై కొందరు యువకులు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తూ బాణసంచా కాలుస్తున్నారు. పండుగ సంబరాల పేరుతో నడిరోడ్డుపై నిప్పులు చిమ్ముతూ.. వాటిని వీడియోలు, రీల్స్‌గా చిత్రీకరిస్తున్నారు. అటుగా వెళ్లే వాహనదారులు, పాదచారుల భద్రతకు ముప్పు ఏర్పడటాన్ని గమనించిన సెంథిల్ కుమార్ వారిని అడ్డుకున్నారు. రోడ్డుపై బాణసంచా కాల్చడం ప్రమాదకరమని, ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాదు.. వారి చర్యలను తన సెల్ఫోన్లో రికార్డు చేసేందుకు ప్రయత్నించారు. అంతే.. అప్పటివరకు పండుగ సంబరాల్లో ఉన్న యువకుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మాటామాటా పెరిగి వాగ్వాదానికి దారితీసింది. హెచ్చరించినందుకు అంతటి కక్షా.? ఒక పోలీసు అధికారి అన్న గౌరవం కూడా లేకుండా ఆ యువకులు సెంథిల్ కుమార్‌పై మూకుమ్మడిగా దాడికి దిగారు. విచక్షణ కోల్పోయి తీవ్రంగా కొట్టారు. ఊహించని ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడి రోడ్డుపైనే కుప్పకూలిపోయారు. కాసేపటి క్రితం వరకు ప్రజల భద్రత కోసం ఆలోచించిన ఆ ఖాకీ అధికారి.. ఇప్పుడు తన ప్రాణాల కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. స్థానికులు వెంటనే స్పందించి ఆయనను ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. కానీ విధి మరోలా తలచింది. ఆసుపత్రికి చేరుకునేలోపే సెంథిల్ కుమార్ ప్రాణాలు విడిచారు. ఓ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి.. ఇంటికి చేరకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయారు. పండుగ వేళ ఇంటికి వస్తాడని ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులకు ఆయన మరణవార్త పిడుగులా తగిలింది. దీపావళి దీపాల వెలుగులు నిండాల్సిన ఆ ఇంట్లో ఒక్కసారిగా చీకట్లు అలుముకున్నాయి. విధి నిర్వహణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న పోలీసు అధికారి.. చివరకు రోడ్డుపై బాణసంచా కాల్చవద్దని చెప్పినందుకే ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నిందితుల కోసం ఐదు ప్రత్యేక బృందాలు.! ఈ ఘటనపై తమిళనాడు సౌత్ జోన్ ఐజీ విజయేంద్ర బిదారీ తీవ్రంగా స్పందించారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ఐదు ప్రత్యేక క్రైమ్ బృందాలను రంగంలోకి దించారు. సీసీటీవీ ఫుటేజీలు, ఇతర ఆధారాలను పరిశీలించి ఈ హత్యతో సంబంధం ఉన్న ప్రధాన నిందితులతో సహా నలుగురిని అరెస్ట్ చేశారు. మరోవైపు, దీపావళి వేళ తమిళనాడు వ్యాప్తంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు, బాణసంచా ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. పలు ప్రాంతాల్లో పది హత్య కేసులు నమోదుకాగా, బాణసంచా ప్రమాదాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. అగ్నిమాపక శాఖకు కూడా 160 అత్యవసర కాల్స్ వచ్చాయి.! పండుగ అంటే ఆనందం.. కుటుంబంతో కలిసి గడిపే మధుర క్షణాలు. కానీ ఇతరుల భద్రతను పట్టించుకోకుండా చేసే నిర్లక్ష్యం, క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతున్నాయి. కేవలం రీల్స్ కోసం నడిరోడ్డుపై బాణసంచా కాల్చడం.. వారించిన వారిపై దాడికి దిగడం ఎంతటి ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుందో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. ఒక్క క్షణం ఆవేశం.. ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఒక కుటుంబానికి జీవితాంతం కన్నీటిని మిగిల్చింది. ఇది కూడా చదవండి: మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించింది: సీఎం చంద్రబాబు [ SI Senthil Kumar Murder,Tamil Nadu News, Theni District,Tamil Nadu Police, Police Officer Killed, Special Sub Inspector, Diwali Murder Case, Diwali Violence, Firecracker Dispute, Firecracker Attack, Social Media Reels, Reels Addiction, Police Officer Attack, Theni Crime News, Tamil Nadu Crime News, Four Arrested, Police Investigation, CCTV Footage, Law and Order, South Zone IG, Vijayendra Bidari ]
http://www.teluguone.com/news/content/si-senthil-kumar-murder-25-236655.html




