శాసన సభలో తెలంగాణపై బిల్లు కోసం సీమాంధ్ర సభ్యుల ఆలోచన
Publish Date:Jun 28, 2013
Advertisement
నేడో రేపో తెలంగాణా అంటూ రాష్ట్ర రాజధానిలో మొదలయిన హడావుడిని చూసి మళ్ళీ సమైక్య నేతలు నిద్రలేచి, దానిని నిలువరించేందుకు సమావేశాలు మొదలుపెట్టేసారు. ముందుగా రేపు రాష్ట్ర పర్యటనకి వస్తున్న పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ కి రాష్ట్రాన్ని విడదీయవద్దంటూ వినతిపత్రం ఈయడంతో తమ కార్యక్రమాలు మొదలు పెట్టి, తెలంగాణాను అడ్డుకొనేందుకు క్రమంగా తమ ప్రయత్నాలు ముమ్మరం చేయాలని వారు నిశ్చయించుకొన్నారు. రాయల తెలంగాణాను వ్యతిరేఖిస్తూ కర్నూలు లేదా అనంతపురం జిల్లాలలో ఒక బహిరంగ సభను నిర్వహించాలని కూడా యోచిస్తున్నారు. అయితే దీని ప్రధానోదేశ్యం రాయల తెలంగాణాను వ్యతిరేఖించడమే కాక, అసలు రాష్ట్ర విభజనను వ్యతిరేఖించడమే. ఇక, ఇటునుంచి వీలుకాకపోతే అటు నుంచి నరుక్కు రావాలని సీమాంధ్ర నేతలు ఆలోచిస్తున్నారు. ఇంత వరకు తెరాస నేతలు శాసన సభలో తెలంగాణపై బిల్లు పెట్టమని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తుండటం, దానిని ప్రభుత్వం తిరస్కరిస్తుండటం జరుగుతోంది. అయితే ఈసారి తామే తెలంగాణా బిల్లు పెట్టేందుకు ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని సీమంద్రా నేతలు భావిస్తున్నారు. తద్వారా సభలో దాదాపు సగంపైగా ఉన్న సీమంధ్ర సభ్యులు బిల్లుకి వ్యతిరేఖంగా ఓటేసి, తెలంగాణావాదానికి చట్ట సభలో కానీ, రాష్ట్రంలో గానీ పూర్తి మద్దతు లేదని తెలియజెప్పాలనుకొంటున్నారు. అయితే, ఇది వారు ఊహిస్తున్నంత తేలిక కాదు. సభలో సీమంద్రాకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారు 175 మంది సభ్యులున్నపటికీ, ఒకసారి బిల్లు ప్రవేశపెడితే, అప్పుడు తెరాస కూడా ఇదే అదునుగా చేసుకొని కాంగ్రెస్, వైకాపా, తెదేపా అధినేతలకు ‘తెలంగాణకు అనుకూలమో, వ్యతిరేఖమో తేల్చుకోమంటూ మరో మారు అగ్నిపరీక్ష పెట్టక మానదు. అటువంటి పరిస్థితులను చేజేతులా ఏ పార్టీ ఆహ్వానించుకోదు గనుక, దీనిని తెరాస తప్ప అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేఖించవచ్చును.
http://www.teluguone.com/news/content/seemandhra-leaders-39-23930.html