సీమాంధ్రలో పార్టీల ఎన్నికల పొత్తులు
Publish Date:Nov 29, 2013
Advertisement
ఈ రాష్ట్ర విభజన అంశం ఏదో ఒక కొలిక్కి వస్తే ఎన్నికల పొత్తులపై నిర్ణయం తీసుకొందామని అన్ని రాజకీయ పార్టీలు వేచి చూస్తున్నాయి. అయితే రాష్ట్ర విభజన జరిగినా, జరుగకపోయినా, సీమాంధ్రలో తెదేపా, బీజేపీలు చేతులు కలిపే అవకాశం ఉంది. ఈ ఎన్నికలలో భారీ విజయం సాధిస్తామని వైకాపా భావిస్తున్నందున ఒంటరిగానే పోటీ చేయవచ్చును. కాంగ్రెస్ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఎందుకంటే అది రాష్ట్ర విభజన చేసేందుకు నిర్ణయించుకొన్ననాడే మానసికంగా ఓటమికి సిద్దపడి, ముందుకు సాగుతోంది. అయితే ఈసారి తన స్వశక్తి మీద కంటే జగన్ శక్తి మీదే అది ప్రదానంగా ఆధారపడుతోంది గనుక, ఈవిషయంలో కాంగ్రెస్ పెద్దగా చింతించడం లేదు. తేదేపాకు చంద్రబాబు, వైకాపాకు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నుండి కిరణ్ కుమార్ రెడ్డి గనుక తప్పుకొని వేరే పార్టీ పెట్టుకొంటే ఆ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా పేరున్న నేతలొక్కరూ ఉండరు. పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ ముఖ్యమంత్రి కావాలని కలలు కంటునప్పటికీ, ఆయనకి స్వంత జిల్లా ప్రజలలోనే ఎంత వ్యతిరేఖత ఉందో మొన్ననే స్పష్టం అయింది గనుక ఆయనని ముందు పెట్టుకొని ఎన్నికల రణరంగంలో దూకడం కాంగ్రెస్ పార్టీకి ఆత్మహత్యతో సమానమవుతుంది. కానీ కాంగ్రెస్ ప్రదానోదేశ్యం ఎన్నికలలో గెలవడం కాక, ఓట్లను చీల్చి తెదేపాను అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే గనుక ఆ తెలివితేటలూ పుష్కలంగా ఉన్నబొత్సకో లేక మరొక కన్నయ్యకో ఆ భాద్యతలు అప్పగించవచ్చును. రాష్ట్రంలో ఏ పార్టీతో బీజేపీ ఎన్నికల పొత్తులు పెట్టుకొంటుందో, వారిని వ్యతిరేఖించే పార్టీతో మజ్లిస్ పొత్తులు పెట్టుకొంటుందని చెప్పడానికి పెద్ద రాజకీయ పరిజ్ఞానం అవసరం లేదు. ఇక లెఫ్ట్ పార్టీలు ఎన్ని వాదనలు చేస్తునప్పటికీ, చివరికి మళ్ళీ తెదేపాతోనే పొత్తులకి సిద్దం కావచ్చును. తెలంగాణాలో మాత్రం సీపీఐ, తెరాసల మధ్య పొత్తులకి అవకాశం ఉంది.
http://www.teluguone.com/news/content/seemandhra-39-27919.html