స్టీఫెన్ హకింగ్.. ఒక్క కదలికతో విశ్వాన్ని శోధించిన వీరుడు..!
Publish Date:Jan 8, 2025
Advertisement
వైకల్యం.. మనిషి కొనితెచ్చుకునే సమస్య కాదు. కొందరు పుట్టుకతో వైకల్యంతో పుడతారు. మరికొందరు ప్రమాదవశాత్తు వైకల్యానికి లోనవుతారు. అయితే వైకల్యం ఉంది కదా మన వల్ల ఏం అవుతుందిలే అని కొందరు జీవితంలో ముందుకు వెళ్ళలేక ఆగిపోతారు. ఏదో ఒక విధంగా జీవితాన్ని అలా కానిచ్చేస్తూ ఉంటారు. కానీ మరికొందరు మాత్రం తమ వైకల్యం తమ లక్ష్యాలకు అడ్డు కాదని భావిస్తారు. జీవితంలో నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు. ఫలితంగా ప్రతిభతో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అలాంటి వారిలో స్టీఫెన్ హాకింగ్ ఒకరు. కేవలం ఒకే ఒక కదలికతో ఏకంగా విశ్వాన్ని శోధించిన ఘనుడు ఆయన. జనవరి 8వ తేదీ స్టీఫెన్ హాకింగ్ జననం. ఈ సందర్భంగా ఆయన కృషిని గుర్తు చేసుకుంటే జీవితానికి కావలసినంత చైతన్యం లభిస్తుంది.
స్టీఫన్ విలియం హాకింగ్.. 1942, జనవరి 8వ తేదీన జన్మించారు. ఈయన ప్రసిద్ధ బ్రిటీష్ సైద్దాంతిక శాస్త్రవేత్త. ముఖ్యంగా విశ్వనిర్మాణ శాస్త్రవేత్త. ఈయన మరణించే సమయానికి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ థియరిటికల్ కాస్మాలజీ రీసెర్చ్ సంస్థకు డైరెక్టర్ గా ఉన్నాడు.
వైకల్యం..
విధి మనుషుల జీవితాలతో ఆడుకుంటుంది. ఆడుతూ పాడుతూ సాగుతున్న సాఫీ జీవితంలో పెద్ద సునామీలా సమస్యలు విరుచుకుపడేలా చేస్తుంది. స్టీఫెన్ హాకింగ్ జీవితంలో కూడా అంతే.. ఆయనకు 21ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ఎమియోట్రోఫిక్ లేటరల్ స్కెర్లోసిస్ అనే నాడీమండలానికి సంబంధించిన జబ్బు వచ్చింది. ఇది కాలంతో పాటు పెరుగుతూ పోయింది. క్రమంగా స్టీఫెన్ హాకింగ్ శరీరంలో ప్రతి అవయవాన్ని కబళించింది. ఆయన శరీరం చచ్చుబడిపోయేలా చేసింది.
స్టీఫెన్ హాకింగ్ తన 20 ఏళ్ల వయసులో కాస్మాలజీ, జనరల్ రిలెటివిటీ పరిశోధనల కోసం ఆక్స్‌ఫర్డ్ కు వెళ్ళాడు. అక్కడి వెళ్ళిన తరువాతే ఆయన జీవితం మలుపు తిరిగింది. భోజనం చెయ్యాలన్నా, బూట్లు లేసులు వేసుకోవాలన్నా, ఇతర పనులు చెయ్యాలన్నా కూడా శరీరం సహకరించేది కాదు. క్రిస్మస్ సెలవులకు ఇంటికి వెళ్లినప్పుడు ఆయన పరిస్థితి ఆయన కుటుంబం ఆందోళన చెందింది. వైద్య పరీక్షలు నిర్వహించగా మోటార్ న్యూరాన్ వ్యాధి అనే భయంకరమైన జబ్బు ఉన్నట్టు తేలింది. నరాలు, వెన్నుపూసపై ఇది ప్రభావం చూపుతుంది. దీని కారణంగానే తొందరలోనే ఆయన శరీరం చచ్చుబడిపోయింది.
అయితే ఆయన మెదడు మాత్రం అద్భుతంగా పనిచేసేది. అంతేకాదు ఆయన ముఖంలో ఒక దవడ ఎముక మాత్రం కదిలేది. ఆ ఒక్క దవడ ఎముక కదలికలే.. స్టీఫెన్ హాకింగ్ ప్రయోగానికి మూలాధారం. ఆ దవడ ఎముకకు ఒక పరికరాన్ని అమర్చారు. స్టీఫెన్ హాకింగ్ ఆలోచనలు అన్నింటిని ఆ పరికరం సంభాషణ రూపంలో వ్యక్తం చేసేది. ఇలా ఆయన శరీరం కదలని స్థితిలో కూడా విశ్వాన్నిశోధిస్తూ తన పరిశోధనలు సాగించాడు. అలాంటి స్థితిలోనే కృష్ణబిలాలకు సంబంధించిన అనేక విషయాలు కనుగొన్నాడు.
1985లో ఆయనకు నిమోనియా వచ్చింది.అప్పటి నుంచీ ఒక చక్రాల కుర్చీకి పరిమితమయ్యాడు. తన చేతి చిటికెన వేలి కదలికల సాయంతో ‘వాయిస్ సింథసైజర్’తో తన ఆలోచనలను శాస్త్ర లోకానికి అందించేవాడు. చిటికెన వేలు కదలికల్ని ఒక హ్యాండ్ కంట్రోలర్ యంత్రానికి అమర్చిన తెరపై అక్షరాలను స్కాన్ చేసే కర్సర్ నియంత్రిస్తుంది. ఆయన ఎంచుకున్న అక్షరాల్ని, యంత్రంలోని వ్యవస్థ తనంతట తానే పని చేసే ‘అల్గారిదమ్’ సాయంతో మాటలు వాక్యాల రూపంలో తెరపై ప్రదర్శిస్తుంది. ఆయన కృషికి కొందరు మిత్రుల సహకారం కూడా తోడైంది. కంప్యూటర్ ఇంజనీర్ డేవిడ్ ఒక చిన్న కంప్యూటర్‌ని స్టీఫెన్ హాకింగ్ వీల్‌ఛైర్‌కు అమర్చాడు. అందులోని సింథసైజర్ ఆయన ఆలోచనను మాటగా మార్చి ఎదుటి వారికి వినిపిస్తుంది. స్టీఫెన్ హకింగ్ ఆరోగ్యం బాగున్నప్పుడు ఆయన గొంతునే సింథసైజర్ కు అమర్చారు. దాని వల్ల స్టీఫెన్ హాకింగ్ నేరుగా మాట్లాడినట్టే ఉండేది. డాక్టరేట్ సంపాదించేలోపే స్టీఫెన్ మరణిస్తాడని అనుకున్నారంతా.. కానీ ఆయన పట్టుదల, ఆత్మస్థైర్యం ముందు మృత్యువు ఓడిపోయింది.
*రూపశ్రీ.
http://www.teluguone.com/news/content/scientist-stephen-hawking-life-story-35-190995.html