మనిషి ఆశలతో, ఆశయాలతో ఆటాడుకునే దుర్మార్గమిది.. మానవ అక్రమ రవాణా అవగాహనా దినోత్సవం..!
Publish Date:Jan 11, 2025
Advertisement
మనతో పాటూ ఉన్న మనుషులు ఉన్నట్టుండి ఏమైపోయారో తెలియకపోయినా లేదా వారు ఏదో ప్రమాదంలో ఇరుక్కున్నారన్న విషయం తెలిసినా మన పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. అలా జరిగినప్పుడు ఏం చేయాలో, మనమేం చేయగలమో కూడా అర్ధం కాదు. అందుకే ఇటువంటివి జరిగినప్పుడు ఎదురయ్యే పరిణామాలు గురించి అందరికీ అవగాహన కలిగించేందుకు ప్రతి సంవత్సరం జనవరి 11వ తేదీన మానవ అక్రమ రవాణా అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది పెరిగిపోతున్న ఆధునిక బానిసత్వం గురించి అవగాహన పెంచడానికి, ప్రాణాలతో బయటపడిన వారి హక్కుల కోసం వాదించడానికి, అన్ని రకాల మానవ అక్రమ రవాణాను నిర్మూలించడానికి ఒక అవకాశం ఇస్తుంది.
మానవ అక్రమ రవాణా అంటే.....
మనుషులని కిడ్నాప్ చేయటమో లేదా ఏమార్చటమో చేసి తర్వాత వారిని బలవంతంగా వ్యభిచారం చేయించటానికో, బలవంతపు వివాహాల కోసమో, అనైతిక కార్యకలాపాలు, కర్మాగారాల్లో పనులు చేయించటానికో ఇలా చాలా రకాలుగా ఉపయోగించుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈ అక్రమ రవాణా సమస్య నానాటికీ పెరుగుతోంది. అందుకే దీన్ని ఆపటానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది.
మానవ అక్రమ రవాణా దినోత్సవం ఎప్పుడు మొదలైంది..
మానవ అక్రమ రవాణాను నిరోధించడానికి, ఎదుర్కోవడానికి యునైటెడ్ స్టేట్స్‌లో చేసిన ‘ట్రాఫికింగ్ బాధితుల రక్షణ చట్టం2000’ చట్టానికి ఆమోదం తెల్పటంతో ఈ దినోత్సవం మొదలైంది. ఆ తర్వాత ఈ సమస్య ప్రభావం ప్రపంచమంతటా ఉందని గుర్తించిన దేశాలన్నీ దాన్ని నివారించటానికి తగిన చట్టాలు ఏర్పాటు చేసుకున్నాయి.
భారతదేశంలో మానవ అక్రమ రవాణా- తీసుకున్న చర్యలు..
భారతదేశంలో పురుషులు, మహిళలు, పిల్లలు వివిధ కారణాల కోసం అక్రమ రవాణా చేయబడ్డారు, చేయబడుతున్నారు. దేశంలోని మహిళలు, అమ్మాయిలను లైంగిక దోపిడీ కోసం, బలవంతపు వివాహాల కోసం రవాణా చేస్తున్నారు. పురుషుల అవసరం ఎక్కువగా ఉన్నచోట పురుషులు, అబ్బాయిలను రవాణా చేసి కార్మికులుగా, మసాజ్ చేసే వారిగా, ఎస్కార్ట్లుగా ఉపయోగించుకుంటున్నారు. వీరు కొన్ని సార్లు లైంగిక దోపిడీకి కూడా గురవుతుంటారు.
ఇక పిల్లలు కర్మాగార కార్మికులుగా, ఇంటి పనివారిగా, అడుక్కునేవారిగా, వ్యవసాయ కూలీలుగా మార్చబడతారు. అలాగే కొన్ని తీవ్రవాద, తిరుగుబాటు గ్రూపుల ద్వారా శిక్షణ ఇవ్వబడి అసాంఘిక కార్యకాలపాల కోసం ఉపయోగించుకుంటారు. భారతీయ మహిళలు మిడిల్ ఈస్ట్ దేశాలకి వాణిజ్య లైంగిక దోపిడీ కోసం రవాణా చేయబడుతున్నారట. ప్రతి సంవత్సరం మిడిల్ ఈస్ట్, యూరప్ దేశాలకు పనివారిగా, తక్కువ నైపుణ్యం ఉన్న కార్మికులుగా వెళ్లిన భారతీయ వలసదారులు కొన్నిసార్లు మానవ అక్రమ రవాణా పరిశ్రమలో చిక్కుకుంటున్నారు. కొన్ని సార్లు కార్మికులు నకిలీ నియామక విధానాల ద్వారా తీసుకెళ్లి అక్కడ బానిసలుగా మార్చబడుతున్నారు. ముఖ్యంగా ఆ దేశాలకి వెళ్తే ఆదాయం పెరిగి కుటుంబం బాగుపడుతుందన్న ఆశతో అప్పు చేసి ఖర్చు పెట్టిన వాళ్ళు ఆ డబ్బు చెల్లించలేక, తిరిగి రాలేక క్రూరమైన యాజమానుల చేతుల్లో అష్ట కష్టాలు పడతారు. కొన్నిసార్లు ప్రాణాలు కూడా కోల్పోతారు.
ఇవన్నీ గుర్తించిన భారతదేశం 2011లో "ట్రాఫికింగ్ బాధితుల చట్టం 2000" ప్రోటోకాల్‌ను ఆమోదించింది. మన భారత పౌరులు అలాంటివాటిలో చిక్కుకోకుండా ఒక పక్క అవగాహన కల్పిస్తూనే, మరో పక్క అలా చిక్కుకున్నవారిని ఆయా దేశాల్లోని ఎంబసీల ద్వారా కాపాడే ప్రయత్నం చేస్తుంది. వారు స్వదేశం చేరటానికి అన్ని రకాలుగా సాయం అందిస్తుంది.
మానవ అక్రమ రవాణాని నివారించేందుకు ఏం చేయాలి...
నేషనల్ హ్యూమన్ ట్రాఫికింగ్ అవేర్‌నెస్ డేలో పాల్గొనడం వల్ల అక్రమ రవాణా వ్యతిరేక ఉద్యమానికి సహకరించేందుకు అందరికీ అవకాశం లభిస్తుంది. దీని గురించి స్పష్టంగా తెలుసుకనే అవకాశం కూడా లభిస్తుంది. మానవ అక్రమ రవాణాని ఎలా గుర్తించాలి?, ఎలా కంప్లైంట్ చేయాలి? అనే వాటి గురించి అందరికీ తెలిసేలా వర్క్‌షాప్‌లు, వెబినార్లు లేదా శిక్షణా సెషన్లను నిర్వహిస్తారు. ఈ సమస్య గురించి సోషల్ మీడియాలో అవగాహన కల్పించడానికి, దానికి సంబంధించిన పోస్ట్‌లు, కథనాలను షేర్ చేయాలి. ఈ అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు సహకరించి, ప్రాణాలతో బయటపడిన వారికి సహాయం అందించాలి.
రాజకీయ నాయకులు, లాయర్లతో పాటూ కలిసి మానవ అక్రమ రవాణాను సమర్థవంతంగా పరిష్కరించే చట్టాలు, విధానాలకు మద్దతు ఇవ్వాలి. అక్రమ రవాణా నిరోధక చట్టాల కోసం గొంతు విప్పాలి. అవేర్‌నెస్ ఈవెంట్‌లను నిర్వహించాలి. ఈ మానవ అక్రమ రవాణా మీద అందరూ తగిన అవగాహన పొందటం వల్ల మనవాళ్ళు, మనకి తెలిసినవాళ్ళు ఏ మోసకారుల చేతుల్లోనో, ముఠాల చేతుల్లోనో చిక్కుకుని బలి కాకుండా కాపాడుకోవచ్చు.
*రూపశ్రీ.
http://www.teluguone.com/news/content/national-human-trafficking-awareness-day-35-191183.html