మళ్లీ యాంటిసిపేటరీ బెయిలు కోసం హైకోర్టుకు సజ్జల, పిల్ల సజ్జల
Publish Date:Mar 3, 2025
Advertisement
వైసీపీ హయాంలో అటు ప్రభుత్వంలోనూ ఇటు పార్టీలోనూ చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు అరెస్టు భయంతో గజగజలాడిపోతున్నారు. తానే కాదు.. జగన్ హయాంలో వైసీపీ సోషల్ మీడియా వింగ్ బాధ్యతలు నిర్వహించిన ఆయన కుమారుడిదీ అదే పరిస్ధితి. తననే కాదు, తన కుమారుడినీ అరెస్టు నుంచి ఎలా తప్పించాలో తెలియక సజ్జల రామకృష్ణారెడ్డి నానా యాతనా పడుతున్నారు. ఇప్పటికే తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో సజ్జల, సోషల్ మీడియా కేసులలో ఒకదానిలో ఆయన కుమారుడు సజ్జల భార్గవ్ ముందస్తు బెయిలుపై ఉన్నారు. అదే సజ్జల అండ్ సన్ ఇప్పుడు తాజాగా పోసాని కృష్ణ మురళి కేసులో తమను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లపై వైసీపీ హయాంలో తన దూషణల పర్వం, అనుచిత భాషా ప్రయోగం, అసభ్య పదజాలంతో విమర్శలు చేయడమే కాకుండా వారి కుటుంబ సభ్యులపై కూడా ఇష్టారీతిగా చేసిన విమర్శల వెనుక ఉన్నదీ, అలాగే ఒక కులాన్ని లక్ష్యంగా చేసుకుని విద్వేష పూరిత వ్యాఖ్యలు చేయడం వెనుక ఉన్నదీ అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డేనని పోసాని కృష్ణ మురళి పోలీసుల విచారణలో వెల్లడించారు. సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు సజ్జల భార్గవ్ ఇచ్చిన స్క్రిప్ట్ మేరకే తాను మాట్లాడేవాడిననీ, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాడిననీ పోసాని అంగీకరించారు. దీంతో ఈ కేసులో పోలీసులు తమ తలుపుతట్టి అరెస్టు చేయడం ఖాయమని భావించిన సజ్జల, ఆయన కుమారుడూ ముందస్తు బెయిలు కోసం కోర్టును ఆశ్రయించారు. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు సజ్జల భార్గవ్ లు ముందస్తు బెయిలు కోసం కోర్టును ఆశ్రయించడం ఇదే మొదటి సారి కాదు. ఈ ఒక్క కేసులోనే కాదు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే తెలుగేదశం కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయలుపై ఉన్నారు. అదే విధంగా ఆయన కుమారుడు పిల్ల సజ్జల అదేనండీ సజ్జల భార్గవ్ సోషల్ మీడియా కేసులో ముందస్తు బెయిలు పొందారు. ఇప్పుడు పోసాని కేసు విషయంలో కూడా తండ్రీ కొడుకులు సజ్జల అండ్ పిల్ల సజ్జలకు కోర్టు మరోసారి ముందస్తు బెయిలు మంజూరు చేస్తుందా లేదా అన్నది చూడాలి. వైఎస్ హయాంలో జరిగిన అన్ని తప్పిదాలు, నిబంధనల ఉల్లంఘనలు, సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల వ్యవహారాల్లో ప్రతి విషయంలోనూ సజ్జల, పిల్ల సజ్జలలలో ఒకరి ప్రమేయం, హస్తం ఉందనడంలో సందేహం లేదు. ఎందుకంటే వైసీపీ హయాంలో ప్రభుత్వం, పార్టీ పరంగా అన్ని వ్యవహారాలలోనూ సజ్జల రామకృష్ణారెడ్డి చక్రం తిప్పారు. ఇక వైసీపీ సోషల్ మీడియా వింగ్ వ్యవహారంలో పిల్ల సజ్జలే బాధ్యుడు. దీంతో వారిద్దరూ మరిన్ని కేసులలో కూడా ముందస్తు బెయిలు పిటిషన్ లు దాఖలు చేసుకునేందుకు సిద్ధంగా ఉండాలి.
http://www.teluguone.com/news/content/sajjala-and-his-son-file-petition-in-high-court-for-anticipatory-bail-39-193750.html





