బుగ్గన మెడకూ బియ్యం ఉచ్చు!?
Publish Date:Dec 28, 2024
Advertisement
ఒక వైపు పేర్ని నాని కుటుంబంతో సహా పరారీలో ఉన్నారు. ఆయన భార్య పేర్ని జయసుధ పేరిట ఉన్న గోదాం నుంచి భారీగా రేషన్ బియ్యం మాయం అయినట్లు తేలడంతో ఆయన ఇక తప్పించుకునే మార్గం లేదని ఖరారు చేసుకునే కుటుంబంతో సహా పరారైనట్లు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. న్యాయస్థానాలలో కూడా పేర్ని నాని కుటుంబానికి ఊరట లభించే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని న్యాయ నిపుణులు సైతం చెబుతున్నారు. మాయం అయిన బియ్యం విలువకు సమానంగా సొమ్ములు చెల్లిస్తామంటూ ఆయన న్యాయవాదులు చెప్పడంతోనే పేర్ని కుటుంబం బియ్యం మాయం చేసినట్లు అంగీకరించినట్లైందని అంటున్నారు. అయితే ఇలా గోదాముల నుంచి బియ్యం మాయం ఒక్క పేర్ని కుటుంబానికి మాత్రమే పరిమితం కాలేదన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గోదాములు ఉన్న వైసీపీ నేతలు మరింత మంది కూడా రేషన్ బియ్యం అక్రమంగా తరలించేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మాజీ ఆర్థిక మంత్రి, వైసీపీ సీనియర్ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి బేతంచర్లలో ఉన్న గోదాం నుంచి కూడా పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించేశారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ ఆరోపణలు రాగానే బుగ్గన స్పందించారు. ఆ గోడౌన్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతూనే..ఆ గోడౌన్లలో కొన్ని తన బంధువులకు చెందినవి అయి ఉండొచ్చంటూ ముక్తాయించడం ఆ ఆరోపణలకు మరింత బలం చేకూర్చింది. తన బంధువుల గోదాంల నుంచి రేషన్ బియ్యం మాయమైతే తనకేం సంబంధం అంటూ బుగ్గన చేసిన వ్యాఖ్యలతోనే బేతంచర్లలోని గోదాంలలో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పక్కదారి పట్టిందని అంగీకరించినట్లైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎంతగా దబాయించాలని చూసినా.. బేతంచర్ల గోదాంల నుంచి రేషన్ బియ్యం మాయం అయ్యాయనీ, అది తన మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనన్న భయంలో బుగ్గన ఉన్నారనీ ఆయన మాటలను బట్టే అవగతమౌతోంది. బుగ్గన బంధువుల పేరు మీద గోడౌన్లు నడిచినా ఆయన సహకారం, మద్దతు లేకుండా బియ్యం మాయం చేయడం సాధ్యం కాదని పరిశీలకులు చెబుతున్నారు. బేతంచర్ల గోదాముల వ్యవహారంలో విజిలెన్స్ దర్యాప్తు ఆరంభమైంది. మాయమైన బియ్యం లెక్కలు నేడో రేపో బయటకు రాకపోవు. ఈ భయంతోనే బుగ్గన మీడియా ముందుకు వచ్చి మరీ ఆ గోదాములతో తనకు సంబంధం లేదని వివరణ ఇచ్చుకుంటున్నారని అంటున్నారు. అలాగే వైసీపీకి అలవాటైన ఎదురుదాడికీ పాల్పడుతున్నారు. అదే సమయంలో బియ్యం మాయంతో తనకేం సంబంధం లేదని చెప్పుకుంటున్నారు. పరిస్థితి చూస్తుంటే బుగ్గనకూ అజ్ణాత వాసంలోకి వెళ్లక తప్పని పరిస్థితి త్వరలోనే ఎదురు కావచ్చునంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/rice-trap-for-buffana-and-neck-39-190426.html