రేవంత్ రెడ్డికి హైకమాండ్ చివాట్లు ? ఆయనపై కంప్లైంట్ చేసిందెవరు?
Publish Date:Oct 14, 2021
Advertisement
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.వరుస కార్యక్రమాలతో కేడర్ లో జోష్ నింపుతున్నారు. అధికార పార్టీకి సవాళ్లు విసురుతున్నారు. దళిత గిరిజన దండోరా సభలు.. తాజాగా చేపట్టిన నిరుద్యోగ గర్జనలతో కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. పార్టీలో చేరికలు జోరందుకున్నాయి. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి జెట్ స్పీడులో వెళుతుంటే.. అదే సమయంలో ఆయనకు బ్రేకులు వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రేవంత్ కు పీసీసీ పగ్గాలు ప్రకటించినప్పుడే కొందరు సీనియర్లు ఓపెన్ గానే అసంతృప్తి వ్యక్తం చేయగా.. తాజాగా మరో సీనియర్ నేత రేవంత్ పై ఏకంగా హైకమాండ్ కే ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. సీనియర్ ఫిర్యాదుతో హైకమాండ్ రేవంత్ రెడ్డికి క్లాస్ పీకారని అంటున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీ వెళ్లారు. అయితే హైకమాండ్ పిలుపుతోనే ఆయన హస్తిన వెళ్లారని చెబుతున్నారు. కాంగ్రెస్ హైకమాండ్‌కు రాష్ట్రంలోని పరిస్థితులపై వివరణ ఇచ్చారట రేవంత్. అదే సమయంలో అధిష్టానం పెద్దలు ఓ విషయంపై ఆయనను వివరణ కోరినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో రేవంత్ ప్రజా దర్బార్ పేరుతో ఆయన అభిమానులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రేవంత్ సైన్యం పేరుతో మరో గ్రూప్ కూడా యాక్టివ్ గా ఉంది. దీనికి అనుబంధంగా నియోజకవర్గాల వారీగా కొందరు రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ హల్ చల్ చేస్తున్నారు. దీనిపై టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ గా స్పందించారట. రేవంత్ ప్రజా దర్బార్ అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న క్యాంపెయిన్ విషయాన్ని ఆయన ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారట. టీపీసీసీ చీఫ్ అయిన తరువాత కూడా ఇలాంటి ప్రచారం ఎందుకని ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. ఈ విషయాన్ని కాంగ్రెస్ పెద్దలు కూడా సీరియస్‌గానే తీసుకుని.. ఇలా ఎందుకు జరుగుతోందని రేవంత్ రెడ్డి వివరణ కోరినట్టు తెలుస్తోంది. ప్రజా దర్బార్ విషయంపై ఢిల్లీ పెద్దలు ప్రశ్నించడంతో షాకయ్యారట రేవంత్ రెడ్డి. ఈ విషయం అధిష్టానం వరకు ఎలా వెళ్లిందని ఆరా తీసిన రేవంత్ రెడ్డి.. దీని వెనుక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారని తెలుసుకున్నారట. ఢిల్లీ నుంచి వచ్చిన తరువాత ఉత్తమ్‌ను కలిసి దీనిపై వివరణ ఇచ్చారనే చర్చ కూడా సాగుతోంది. రేవంత్ పీసీసీ చీఫ్ అయినప్పటి నుంచి ఆయనతో కొందరు సీనియర్ నేతలకు గ్యాప్ వచ్చింది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేరుగానే రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయగా.. ఉత్తమ్ మాత్రం పార్టీ వేదికల మీదే తన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిని ఇబ్బందిపెట్టేలా ఆయన కాంగ్రెస్ హైకమాండ్‌కు ఫిర్యాదు చేసి ఉంటారని రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ భావిస్తున్నారు. మొత్తానికి రాష్ట్ర కాంగ్రెస్‌లో దూసుకుపోవాలని భావిస్తున్న రేవంత్ రెడ్డికి అనుకోని అనుభవాలు ఎదురవుతున్నాయనే చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి అనుచరులు మాత్రం ఎవరూ ఏం చేసినా తమ నేతకు నష్టం జరగదని చెబుతున్నారు. రోజురోజుకు రేవంత్ గ్రాఫ్ పెరిగిపోతుందని, ఆయన సీఎం కాకుండా ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/revanth-reddy-questoined-by-aicc-leaders-over-praja-darbar-39-124537.html





