హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా? రేవంత్ దెబ్బతో కారు,కమలంలో గుబులు..
Publish Date:Aug 15, 2021
Advertisement
తెలంగాణ రాజకీయాలకు ప్రస్తుతం కేంద్రంగా మారిన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు అనూహ్యంగా మారిపోతున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నిక బీసీ సామాజిక వర్గం చుట్టే తిరుగుతోంది. 2004 నుంచి ఇక్కడ బీసీ నేతగా ఈటల రాజేందరే గెలుస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా ఆయనే బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉండబోతున్నారు. ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ బీసీ కార్డును ఉపయోగిస్తున్నారు. అయితే ఈటల సగం బీసీ, సగం ఓసీ అంటూ టీఆర్ఎస్ ప్రచారం చేసింది. అంతేకాదు బీసీ సామాజికవర్గానికి చెందిన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. తెలంగాణ ఉద్యమంలో శ్రీనివాస్ యాక్టివ్ రోల్ పోషించారు. దళిత బంధు పథకంతో ఆ వర్గం ఓట్లను.. గెల్లు శ్రీనివాస్‌ను అభ్యర్థిగా నిలబెట్టడం ద్వారా బీసీల ఓట్లను తన ఖాతాలో వేసుకోవాలని టీఆర్ఎస్ ఆశ పెట్టుకుంది. హుజురాబాద్ లో బీజేపీ, టీఆర్ఎస్ నుంచి బీసీ అభ్యర్థులే ఉండటంతో.. కాంగ్రెస్ కూడా బీసీనే బరిలోకి దింపాలని డిసైడైందని తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కొండా సురేఖ రంగంలోకి దిగబోతోందని సమాచారం. కొండా సురేఖ పేరును కాంగ్రెస్ అధిష్టానం దాదాపుగా ఖరారు చేసిందని తెలుస్తోంది. శనివారం జరిగిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో హుజురాబాద్ అభ్యర్థి ఎంపికపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. సురేఖతో పాటు కవ్వంపల్లి సత్యనారాయణ, కృష్ణారెడ్డి, ప్యాట రమేష్ పేర్లను కాంగ్రెస్ పరిశీలించిన పీసీసీ నేతలు.. కొండా సురేఖ పేరును ఆ పార్టీ ఖారారు చేసినట్లు తెలుస్తోంది.మొదట కేసీఆర్ దళిత బంధుకు కౌంటర్ గా ఎస్సీ అభ్యర్థిని బరిలోకి దింపాలని భావించిందట. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహా పేరు అనుకున్నా ఆయన ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. హుజురాబాద్ బరిలో కొంజా సురేఖను పోటీలో నిలబెట్టడానికి కాంగ్రెస్‌కు ఓ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. హుజురాబాద్ నియోజకవర్గంలో దళితుల తర్వాత ఎక్కువగా ఓటర్లున్నది మున్నురు కాపులే. దాదాపు 28 వేలకు పైగా వీరి ఓట్లు ఉన్నాయి. పద్మశాలీ ఓట్లు కూడా దాదాపు 18 వేల వరకు ఉన్నాయి. కొండా దంపతుల్లో మురళీ కాపు కాగా.. సురేఖ పద్మశాల. ఈ లెక్కన కొండా బరిలో ఉంటే మున్నూరుకాపు సామాజిక వర్గంతో పాటు పద్మశాలి ఓట్లు కూడా కలిసివస్తాయని కాంగ్రెస్ అంచనా వేస్తుందని చెబుతున్నారు. అంతేకాదు హుజురాబాద్ నియోజకవర్గానికి వరంగల్ జిల్లాతో లింకులుంటాయి. నియోజకవర్గంలోని కమలాపుర్ మండలం ఇప్పుడు కూడా వరంగల్ జిల్లా పరిధిలోనే ఉంది. గతంలో కొండా సురేఖ ప్రాతినిద్యం వహించిన శాయంపేట, పరకాల నియోజకవర్గాలకు పక్కనే హుజురాబాద్ ఉంటుంది. ఈ నియోజకవర్గం పరిధిలో కొండా దంపతులకు భారీగా అనుచర గణం ఉందని చెబుతున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన కొండా సురేఖ కాంగ్రెస్ ఎమ్మేల్యేగా చేశారు. ఆమె భర్త కొండా మురళి ఎమ్మెల్సీగా కొనసాగారు. వైఎస్ అభిమానులుగా మొదటి నుంచి పార్టీలో కొనసాగిన కొండా దంపతులు మధ్యలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2014లో టీఆర్ఎస్ నుంచి గెలిచిన కొండా సురేఖ.. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరిగి కాంగ్రెస్‌లోకి మారారు. కాని వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. వరంగల్ రాజకీయాలను శాసించిన వీరు కొంత కాలంగా స్తబ్ధుగా ఉండిపోయారు. రేవంత్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు కాగానే వారిలోనూ కొత్త ఉత్సాహం నెలకొంది. ఈనేపథ్యంలో రేవంత్ రెడ్డి టికెట్ ఇస్తే పోటీ చేయడానికి రెడీగా ఉన్నట్లు కొండా దంపతులు సంకేతాలు పంపారని నట్లు సమాచారం. కొండా సురేఖ అభ్యర్థి అయితే హుజురాబాద్ లో ఇప్పుడు అందరూ అనుకుంటున్నట్లు టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ కాకుండా త్రిముఖ పోరు ఉంటుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాంగ్రెస్ బలపడటంతో గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. మున్నురుకాపు, పద్మశాలీ ఓట్లతో పాటు మైనార్టీ ఓట్లు కూడా కొండా దంపతులకు గంపగుత్తగా పడే అవకాశం ఉందంటున్నారు. ఆర్థికంగా బలమైన వారే కావడంతో గట్టిగా శ్రమిస్తే హుజురాబాద్ లో కాంగ్రెస్ సంచలన నమోదు చేస్తుందని గాంధీభవన్ లోనూ చర్చ సాగుతోంది. తెలంగాణ అవిర్భావం తర్వాత వచ్చిన ఎన్నికలేవి కాంగ్రెస్‌కు కలిసి రాలేదు. ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాలను కూడా ఆ పార్టీ కోల్పోయింది. ఆ ఓటములన్నీ అప్పటి పీసీసీ అధ్యక్షుడి ఖాతాలో పడిపోయాయి. అయితే ఇప్పుడు టీపీసీసీకి కొత్త టీం వచ్చింది. ఈ టీంకు హుజురాబాద్ ఉప ఎన్నిక ఛాలెంజ్‌గా మారింది. దీంతో ఆచితూచి సురేఖను బరిలోకి దింపాలని కాంగ్రెస్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
http://www.teluguone.com/news/content/revanth-reddy-confirm-konda-surekha-as-huzurabad-cong-candidate-39-121506.html





