రేవంత్ రెడ్డి, కేసీఆర్, వైఎస్... కామన్ పాయింట్ ఏంటి?
Publish Date:Nov 22, 2016
Advertisement
మనిషన్నాక కూసింత కళాపోషణ వుండాలి అంటారు! కాని, ప్రతీ మనిషికీ కళా పోషణ వుండొచ్చు. వుండకపోవచ్చు. కాని, అందరికీ వుండేది సెంటిమెంట్! ఇప్పుడు అలాంటి సెంటిమెంట్ కే లోనవుతున్నారు తెలంగాణ టీడీపీలో వన్ మ్యాన్ ఆర్మీ రేవంత్ రెడ్డి!
ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక టీ టీడీపీకి తీవ్రమైన సవాళ్లే ఎదురవుతున్నాయి. ఒక్కొక్కరుగా నేతలు టీఆర్ఎస్ లోకి జంప్ చేసేశారు. అయినా కూడా పచ్చ కండువా మార్చకుండా పట్టుదలతో వుంటున్నారు రేవంత్ రెడ్డి. అంతే కాదు, ఆయన మీద ఓటుకు నోటు కేసు ఒత్తిడి ఎంత వున్నా కేసీఆర్ ను తెగించి విమర్శించటంలో ముందుంటున్నారు. అందుకే, మీడియాలో రేవంత్ ఏ మాట మాట్లాడినా బ్రేకింగ్ న్యూస్ అవుతూనే వుంటోంది!
రేవంత్ కి ... కేసీఆర్ తో రాజకీయంగా పడకపోయినా ఒక్క విషయంలో మాత్రం ఇద్దరూ ఒకేలా ఆలోచిస్తున్నారనిపిస్తోంది! అదే సెంటిమెంట్ల విషయం! ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు సెంటిమెంట్ల గురించి ఇప్పుడు కొత్తగా చెప్పాలంటారా? ఆయన ఏం చేసినా సెంటిమెంట్ ప్రకారమే చేస్తారు. రీసెంట్ గా వాస్తు బాగాలేదని తన సెంటిమెంట్ కోసం కొత్త భవనం కట్టిస్తామన్నారు. అప్పుడు విపక్షాలు చేసిన గొడవ అందరికీ తెలిసిందే!
రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ లా సెంటిమెంట్స్ ఫాలో అవుతున్నారు. కాకపోతే, ఆయన ప్రజాధనంతో ముడిపడని వ్యక్తిగత నమ్మకాల్ని ఆచరిస్తున్నారు. ఈ మధ్య టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ జూబ్లిహిల్స్ పెద్దమ్మ గుడి నుంచి పార్టీ ఆఫీస్ కి సైకిల్ పై వెళ్లారు! ఇలా చేస్తే పెద్దమ్మ అనుగ్రహం తన మీద వుంటుందని ఆయన భావించారట! అంతే కాదు, తాజాగా మరో సెంటిమెంట్ స్టోరీ ఆయనే స్వయంగా చెప్పారు. భూపాలపల్లి నుంచి రైతు పోరు యాత్ర ప్రారంభించిన తనకు టీడీపీ సీనియర్ నేత సీతక్క బొట్టు పెట్టి ఆశ్వీర్వదించి పంపిందన్నారు. సీతక్క ఆశీస్సులతో తన పోరు తప్పకుండా విజయవంతం అవుతుందని రేవంత్ చెప్పుకొచ్చారు!
ఇంతకు ముందు చేవెళ్ల చెల్లెమ్మ సబితా గురించి.... వైఎస్, ఇలాగే సెంటిమెంటల్ గా వుండేవారు! ఆయన ఆమె వుంటేనే ప్రచారం మొదలు పెట్టేవారు. ఇప్పుడు రేవంత్ కూడా సీతక్కను అలాగే భావిస్తున్నారు. చూడాలి మరి, సీతమ్మ ఆశీర్వాదం రేవంత్ ను ఎంత వరకూ కష్టాల నుంచి గట్టెక్కిస్తుందో!
http://www.teluguone.com/news/content/revanth-reddy-45-69355.html





