ఆర్టీసి బస్సులో రేణుకా చౌదరి ఉచిత ప్రయాణం
Publish Date:Dec 11, 2023
Advertisement
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఆర్టీసి బస్సులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు రోజుల క్రితం మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత ఆర్టీసీ బస్సు పథకాన్ని మహిళలకు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో రేణుకా చౌదరి బస్సులో ప్రయాణించారు. సోమవారం గాంధీ భవన్ నుంచి మహిళలతో కలిసి బస్సులో ప్రయాణం చేశారు. ఉచిత బస్సు పథకాన్ని ఆమె మహిళలకు వివరించారు. ఉచిత బస్సు వల్ల మహిళలకు, విద్యార్థులకు ఎంతో ఉపయోగమన్నారు. ప్రభుత్వం వచ్చి రెండు రోజులు కాకముందే విమర్శలు మొదలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన వాగ్దానాలను కాంగ్రెస్ నెరవేరుస్తుందన్నారు. ఉచితాలు ప్రజల సంక్షేమం కోసమని, దాని వల్ల సోమరిపోతులు అవ్వడం ఉండదన్నారు.
మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించే మహాలక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అసెంబ్లీ సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖతో పాటు ఇతర మంత్రులు, సీఎస్ శాంతి కుమారి, బాక్సర్ నిఖత్ జరీన్ ఉచిత బస్సు సేవలను ప్రారంభించారు.
మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణలోని మహిళలందరూ ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులో మాత్రమే ఈ సదుపాయం ఉంటుంది. సిటీలో అయితే ఆర్డినరీ, మెట్రో బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. తెలంగాణ మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. వీరు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. ఏదైనా గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుంది.ఉచితంగా ప్రయాణించేందుకు బస్సులలో మహిళలకు సున్నా ధరతో టికెట్ ఇస్తారు. వీటికి అయ్యే ఖర్చును ఆర్టీసీకి ప్రభుత్వం రీఎంబర్స్ మెంట్ చేస్తుంది. ఈ స్కీమ్ అమలుకు రోజుకు రూ. 7 కోట్ల వరకు ఖర్చు అవుతున్నట్లు తెలుస్తోంది. రద్దీ ఎక్కువగా అయితే బస్సుల సంఖ్యను కూడా పెంచుతామని ఆర్టీసీ ఇప్పటికే స్పష్టం చేసింది.
ఎన్నికల మేనిఫెస్టోలో మొత్తం ఆరు పథకాలను కాంగ్రెస్ పొందుపరిచింది. వాటిలో ఒకటి మహాలక్ష్మి ఉచిత బస్సు సర్వీసు పథకం. అధికారం చేపట్టిన రెండు రోజుల్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని అమలు చేయడం గమనార్హం.
http://www.teluguone.com/news/content/renuka-chowdary-travel-free-rtcbus-25-166824.html





