రూ. 2.73 లక్షల కోట్లతో ఏపీలో రిలయెన్స్ యూసీజీ కాంప్లెక్స్.!
Publish Date:Aug 20, 2026
Advertisement
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏపీలో భారీ పెట్టుబడి ప్రణాళికతో ముందుకు వచ్చింది. దాదాపు 2.73 లక్షల కోట్ల రూపాయల అంచనాతో ఇన్వెస్ట్ మెంట్ తో రాష్ట్రంలో ఎనర్జీ ప్రాజెక్టును నెలకొల్పేందుకు సంస్థ ముందుకు వచ్చింది. వచ్చే 30 ఏళ్లలో ఈ దశలవారీ పెట్టుబడులతో ఏలూరు జిల్లాలో దేశంలోనే మొట్టమొదటి సమగ్ర భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ (యూజీసీ) కాంప్లెక్స్‌ను నిర్మించాలని రిలయన్స్ భావిస్తోంది. ఈ ప్రతిపాదిత ప్రాజెక్ట్ కోసం ఆంధ్రప్రదేశ్‌లోని చింతలపూడి, రేచర్ల బొగ్గు బ్లాకులను ఎంపిక చేశారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఈ వేలం ప్రక్రియ ద్వారా ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ ఈ రెండు బొగ్గు బ్లాకులను దక్కించుకుంది. క్షేత్రస్థాయి పరిశోధనలు, ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలు, వాణిజ్యపరమైన లాభదాయకత ఆధారంగా పెట్టుబడుల కేటాయింపులు జరగనున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను మూడు దశల్లో అభివృద్ధి చేయడానికి కంపెనీ ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రాథమిక అన్వేషణ, ప్రయోగాత్మక పైలట్ పనులతో ప్రారంభమయ్యే మొదటి దశను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే పట్టాలెక్కించనుంది. పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైన అనంతరం, పూర్తిస్థాయి వాణిజ్య ఉత్పత్తి దిశగా అడుగులు వేస్తుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభించే సమయానికి దాదాపు 3 వేల నుంచి 5 వేల మందికి ప్రత్యక్షంగానూ, పాతిక వేల మందికిపైగా పరోక్షంగానూ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నది అంచనా. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నేషనల్ కోల్ గ్యాసిఫికేషన్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా రిలయన్స్ ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించింది. 2030 నాటికి దేశవ్యాప్తంగా 100 మిలియన్ టన్నుల బొగ్గు గ్యాసిఫికేషన్ సామర్థ్యాన్ని సాధించాలన్నది కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ లక్ష్య సాధనలో ఏపీలో రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెట్ ఏలూరు జిల్లాలో నిర్మించనున్న యూజీసీ కాంప్లెక్స్ కీలక పాత్ర పోషిస్తుందనడంలో సందేహం లేదు. రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్ట్ ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడమే కాక, మౌలిక వసతుల కల్పన, వ్యాపార రంగాలు వేగంగా విస్తరిస్తాయని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రాథమిక సర్వే పనులు వేగవంతం కావడంతో, త్వరలోనే క్షేత్రస్థాయిలో మార్పులు కనిపిస్తాయన్న ఆశాభావం వ్యక్తమౌతోంది. Reliance Industries Investment inAP , Underground Coal Gasification AP, Mukesh Ambani AP Project, Eluru Coal Gasification Project, Andhra Pradesh Employment Generation
http://www.teluguone.com/news/content/reliance-industries-investment-inap--36-229354.html





