ఆకస్మిక బదిలీల మతలబు ఏమిటో.. ఉచ్చులు బిగుస్తునాయా?
Publish Date:Feb 15, 2022
Advertisement
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 24 గంటల వ్యవధిలో రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది, ఇద్దరు ముఖ్య అధికారులను బదిలీ చేసింది. సోమవారం ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక బాధ్యతల్లో ఉన్న ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆకస్మికంగా బదిలీ అయ్యారు. ఆ సస్పెన్స్ వీడక ముందే, డీజీపీ గౌతం సవాంగ్’ను ప్రభుత్వం మంగళవారం బదిలీ చేసింది. ఏమిటి మతలబు? ఎందుకు ఇలా కీలక బాధ్యతల్లో ఉన్న ఇద్దరు ఆఫీసుర్లు ఒకరి వెంట ఒకరుగా, బదిలీ అయ్యారు? ఈ బది’లీలలు’ ఇక్కడితో ఆగుతాయా? ఇంకా కొనసాగుతాయా అనే చర్చ జరుగుతోంది. ప్రవీణ్ ప్రకాష్ చరిత్ర చెప్పాలంటే చాలానే ఉందని అంటారు. ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. అంతే వివాదాస్పదుడు. సహచర ఐఏఎస్ అధికారులే కాదు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఆయన అంటే అదో రకమైన వ్యతిరేకతను పెంచుకున్నారు అంటారు. ఆయన పేరు వింటేనే అదోలా మారిపోతారు. మరోవంక, ఆయనను సీఎంఓ నుంచి తప్పించేదుకు, సీఎస్’ల స్థాయిలో ప్రయత్నాలు జరిగాయి. అయినా ముఖ్యమంత్రితో ఉన్న బంధం కారణంగా ఆ ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. రివర్స్’లో సిఎస్’ బదిలీ అయ్యారు. సరే అది వేరే విషయం అనుకోండి. అయితే, ఇప్పుడు ఎవరూ అడగకుండానే, ఎవరి ఒత్తిడి లేకుండానే ముఖ్యమంత్రి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా, లేక ఆయన్ని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా వెనక్కి పపండంలో (సీఎంవోలోకి రాక ముందు ప్రవీణ్ ప్రకాష్ ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గానే ఉండేవారు) ఇంకేదైనా మతలబు ఉందా అనే విషయంలో అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదలా ఉంటే, అది జరిగి 24 గంటలు కూడా గడవక ముందే ప్రభుత్వం మంగళవారం నాడు డీజీపీ గౌతం సవాంగ్‌ను బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. తదుపరి పోస్టింగ్ కోసం జీఏడీకి రిపోర్టు చేయాలని గౌతం సవాంగ్ ను ఆదేశించారు. కొత్త డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతల్లో కసిరెడ్డి వి ఆర్ ఎన్ రెడ్డిని నియమించారు. అయితే, డీజీపీ బదిలీకి సహేతుకం అయినా, కాకపోయినా కొన్ని కారణాలు అయితే కనిపిస్తున్నాయి. జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అస్తవ్యస్థంగానే నడుస్తోంది. అందుకు పోలీసు వ్యవస్థ బాధ్యత కంటే, రాజకీయ జోక్యం ఎక్కువ కావడమే ప్రధాన కారణం అయినా, పోలీసు యంత్రాంగం బద్నాం అవుతూ వచ్చింది. ఈ క్రమంలో గౌతం సవాంగ్ ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అదే సమయంలో ఆయన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కూడా, గౌతం సవాంగ్ పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం నుంచి ఎదురైన ఒత్తిళ్ళకు సవాంగ్ కూడా ఇబ్బందులు పడ్డట్లు అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. సో.. సవాంగ్ బదిలీకి సవా లక్ష కారాణాలు కనిపిస్తున్నాయని అధికార వర్గాల్లో వినవస్తోంది. అయితే ఇప్పుడు ఈ ఆకస్మిక బదిలీకి మాత్రం, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాద్యాయుల ఆందోళన సందర్భంగా ముఖ్యంగా చలో విజయవాడ ఆందోళనను కట్టడి చేయలేకపోవడం ఒక కారణంగా చెపుతున్నారు. అయితే, తక్షణ కారణం అయితే జగన్ రెడ్డి బాబాయి వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయం ముఖ్యమంత్రి ఆశించిన విధంగా, ‘వ్యవహరించడం’లో డీజీపీ విఫలమయ్యారని, జగన్ రెడ్డి గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఇప్పుడా కేసు ఉచ్చు బిగుస్తున్న సంకేతాలు స్పష్టంకావడంతో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని అధికార, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదలా ఉంటే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేయడం అంటే సమస్యలను కొని తెచ్చుకోవడమే అనే అభిప్రాయం ఐఏఎస్ , ఐపీఎస్ అధికారుల్లో ఉందని అంటున్నారు. అందుకే, ఐఏఎస్, ఐపీఎస్’ లు కేంద్ర సర్వీసుల వైపు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/reasons-behind-praveen-prakash-and-gautam-sawang-transfers-39-131822.html





