ఈటలకు కేసీఆర్ లెటర్.. ఏంటి మేటర్?
Publish Date:Mar 21, 2022
Advertisement
సీఎం కేసీఆర్ ఎంత ఖతర్నాకో అందరికీ తెలిసిందే. పగ పడితే.. అది చిన్న జీయర్ స్వామి అయినా వదిలేదిలే. ఇక ఈటల రాజేందర్ విషయంలో ఎంతగా వెంటాడారో అంతా చూసిందే. కేసీఆర్‌కు దొరతనం ఎక్కువని.. టన్నులకు టన్నులు అహంకారం ఉంటుందని అంటారు. ఆయన చెప్పింది వినాల్సిందే కానీ, ఆయన ముందు ఎదుటివారు మాట్లాడితే సహించలేరని చెబుతారు. ప్రెస్‌మీట్లలో పలుమార్లు మీడియా ప్రతినిధులపై మాటల దాడి చేసిన విషయం విధితమే. అందుకే, ఆ ఒంటెద్దు పోకడలు పడలేకే, బానిసలా పడుండలేకే.. ఈటల రాజేందర్ కేసీఆర్‌ను వీడారు. ఆత్మాభిమానం కోసం.. అంతలా పోరాడారు. కేసులతో కార్నర్ చేసినా.. హుజురాబాద్‌లో యావత్ ప్రభుత్వ, పార్టీ యంత్రాంగాన్ని మోహరించినా.. రెండు సింహాల పోరుగా సాగిన ఉప ఎన్నికల్లో.. ఈటల రాజేందర్ బ్రహ్మాండమైన విజయం సాధించి.. గులాబీ బాస్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. కేసీఆర్ ఇగోను మరింత కెలికారు. అందుకే కాబోలు, అసెంబ్లీలో ఈటల ముఖం చూడొద్దని అనుకున్నారు కాబోలు.. హౌజ్‌లో బెల్ మోగిన మొదటి గంటలోనే బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు వేసి.. సెషన్ మొత్తం మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేశారు. ఈటల రాజేందర్‌పై కేసీఆర్ అంతగా పంతం పట్టారని అంటున్నారు. కానీ....... అనూహ్యం. ఆశ్చర్యం. సీఎం కేసీఆర్.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ప్రత్యేకంగా లేఖ రాశారు. ఈటలకు బర్త్‌డే విషెష్ చెప్పారు. విషెష్ చెప్పడం మామూలు విషయమే అయినా.. ఈటలకు కేసీఆర్ శుభాకాంక్షలు చెప్పడం మాత్రం సంచలనమే. ఇది కేసీఆర్ నైజానికి పూర్తి విరుద్ధం. ఇంతకీ గులాబీ బాస్ తన మాజీ సహచరుడికి, ఇటీవల తనకు బద్ధ శత్రువైన ఈటలకి.. ఎందుకు సడెన్‌గా విషెష్ చెప్పినట్టు? కేసీఆర్ కడుపులో అంత కోపాన్ని పెట్టుకొని.. బయటకు ఇంత ఆప్యాయంగా లెటర్ రాయడం వెనుక రీజన్ ఏంటి? ఇదే ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇదంతా ప్రశాంత్ కిశోర్ డైరెక్షన్ అంటున్నారు. ప్రత్యర్థులను కన్ఫ్యూజ్ చేసి.. ఆ కన్ఫ్యూజన్‌లో ఎక్కువ కొట్టేయాలనేది పీకే-కేసీఆర్ వ్యూహంగా అంచనా వేస్తున్నారు. ఈటలకు కేసీఆర్ లేఖ రాయడంపై జోరుగా చర్చ జరుగుతోంది. అసలు కేసీఆర్ ఎందుకు ఆ లెటర్ రాశారని అంతా అవాక్కవుతున్నారు. ఎంత తలగోక్కున్నా వారికి పక్కాగా ఇదంటూ ఓ కారణం అంతుచిక్కడం లేదు. అదే పీకే-కేసీఆర్‌కి కావాల్సింది. తమ స్ట్రాటజీ ఏంటో ఇతరుల గెస్‌కు దొరక్కుండా చేసి.. వారిని డిఫెన్స్‌లో పడేయడం.. కేసీఆర్ ఏదో చాణక్యం చేస్తున్నారనే ఆందోళన క్రియేట్ చేయడం.. వారి మైండ్ గేమ్ అంటున్నారు. మరోవైపు, హుజురాబాద్ ఎమ్మెల్యేగా గెలిచాక.. ఈటల రాజేందర్ ఇంపార్టెన్స్ అమాంతం తగ్గిపోయింది. చాన్నాళ్లుగా ఆయన న్యూస్‌లో లేకుండా పోయారు. మామూలు ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. బీజేపీలో అంతగా యాక్టివ్‌గా లేరు. ప్రధాన్యమూ కనిపించడం లేదు. తన భవిష్యత్తుపై కాస్త సందిగ్థంలోనే ఉన్నారని అంటున్నారు. ఇలాంటి సిచ్యుయేషన్‌లో ఈటల రాజేందర్‌కు కేసీఆర్ లేఖ రాయడం వల్ల.. అవసరమైతే ఈటల మళ్లీ మాజీ బాస్ కేసీఆర్ దగ్గరికి వెళ్లే ఛాన్స్ ఉందనే అపోహ క్రియేట్ చేయడమే పీకే-కేసీఆర్ ఎత్తుగడ అంటున్నారు. ఈటలను అటు బీజేపీ వాళ్లు.. ఉద్యమకారులు.. తెలంగాణ సమాజం.. అనుమానంగా చూసేలా.. ఈయన ఎప్పటికైనా ఆయన మనిషే అనే డౌట్ వచ్చేలా.. బర్త్‌డే విషెష్ చెబుతూ లెటర్ రాసి మైండ్ గేమ్‌కి తెర తీశారని విశ్లేషిస్తున్నారు. అయితే, కేసీఆర్ ట్రాప్‌లో చిక్కేంత అమాయకుడేమీ కాదు ఈటల.. కేసీఆర్ జిత్తులమారి ఎత్తుగడలను పదే పదే నమ్మేంత బకారాలేమీ కాదు తెలంగాణ ప్రజలు...అంటున్నారు.
http://www.teluguone.com/news/content/reasons-behind-kcr-letter-to-etela-rajender-39-133290.html





