మళ్ళీ రాయల తెలంగాణా ప్రతిపాదన
Publish Date:Nov 30, 2013
Advertisement
కాంగ్రెస్ అధిష్టానం రోజుకొక మీడియా లీకుతో అనూహ్యమయిన పద్దతిలో రాష్ట్ర విభజనపై ముందుకు సాగుతోంది. ఇది తన ప్రత్యర్ధులను ఏమార్చేందుకు అనుసరిస్తున్న వ్యూహమా లేక నిజంగానే అయోమయంలో ఉండి కొట్టుమిట్టాడుతోందో తెలియని పరిస్థితి. ఇక నేడో రేపో కేంద్రమంత్రుల బృందం రాష్ట్ర విభజనపై తన తుది నివేదికను కేంద్ర మంత్రి వర్గానికి సమర్పించడం, ఆ తరువాత తెలంగాణా బిల్లు శాసనసభకు, పార్లమెంటుకి చేరుకోవడం, ఆమోదం పొందడం జనవరి 1న కొత్త రాష్ట్రాలు ఏర్పాటయిపోవడం అంతా ఇక చిటికెల మీద పనేన్నట్లు మాట్లాడిన కాంగ్రెస్, ఇప్పుడు మళ్ళీ రాయల తెలంగాణా గురించి ఆలోచిస్తున్నట్లు మీడియా లీకులు ఇచ్చింది. పక్కా తెలంగాణావాది అయిన ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ కూడా “తమ అధిష్టానం అటువంటి ప్రతిపాదనలు పరిశీలిస్తోందని, కానీ దానిని తానూ తీవ్రంగా వ్యతిరేఖించానని” మీడియాకి చెప్పడంతో అది నిజమేనని నమ్మవలసి వస్తోంది. రాష్ట్ర విభజనలో తాము ఎటువంటి రాజకీయ ప్రయోజానాలను దృష్టిలో పెట్టుకొని చేయడం లేదని నిత్యం ప్రవచనాలు పలికే కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు ఇప్పుడు, అటు తెలంగాణా వాదులు, ఇటు రాయలసీమ వాసులు కూడా మొదటి నుండి తీవ్రంగా వ్యతిరేఖిస్తున్న ఈ ప్రతిపాదనను ఎందుకు పునః పరిశీలన చేస్తున్నారో వివరణ ఈయవలసి ఉంటుంది. రాయల తెలంగాణాతో తన రాజకీయ ప్రత్యర్ధులను దెబ్బ తీయాలని కాంగ్రెస్ గనుక భావిస్తుంటే, అందుకు పూర్తి విరుదంగా ముందు ఆపార్టీయే రాష్ట్రం నుండి పూర్తిగా తుడిచిపెట్టుకు పోవడం ఖాయం. రాష్ట్ర విభజన చేస్తున్నందున ఇప్పటికే సీమాంధ్రలో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడు చేస్తున్నఈ రాయల తెలంగాణా ఆలోచనతో ఇక తెలంగాణాలో కూడా కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకు పోవడం ఖాయం. తెలంగాణా కోసం ఉద్యమాలు తీవ్రతరం అవడంతో రాష్ట్ర విభజన ఆవశ్యకత ఏర్పడిందని అనుకొంటే, ఇప్పుడు ముందు ప్రకటించిన విధంగా ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలుగా చేయకుండా, బలమయిన రెండు విభిన్న సంస్కృతులు కలిగిన వేర్వేరు ప్రాంతాలను కలిపి, ఎవరూ కోరని విధంగా కొత్త రాష్ట్రాన్ని సృష్టించాలని చూస్తే దానివల్ల మళ్ళీ తెలంగాణా లో ఉద్యమాలు మొదలవడమే కాదు, ప్రజల మధ్య విద్వేషాలు కూడా ఇంకా పెరిగిపోయే ప్రమాదం ఉంది. ఇంతవరకు తెలంగాణా ప్రజలకు సోనియమ్మ ఇలవేల్పు అని టీ-కాంగ్రెస్ నేతలు ఎంత చెక్క భజనలు చేస్తున్నా, తెలంగాణా రాష్ట్రం ఏర్పడుతోందనే ఏకైక కారణంతో తెలంగాణా ప్రజలు వారిని సహిస్తున్నారు. కానీ ఇప్పుడు రాయల తెలంగాణా అంటే మాత్రం సోనియమ్మకు చెక్క భజన చేస్తున్నవారినందరినీ కూడా తమ ప్రాంతం నుండి తరిమి కొడతారు. ఇంతవరకు మౌనంగా ఉన్న కేసీఆర్, తెరాస నేతలు మళ్ళీ తమ నోటికి పనిచెప్పడం ఖాయం. అంతే గాక ఇక ముందు ఒక్క సీమాంధ్రలోనే కాక తెలంగాణాలో సైతం కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోవచ్చును. కాంగ్రెస్ అధిష్టానం ఇంతవరకు ఎప్పుడు కూడా ఎవరో కొందరు నేతల సలహాలు మాత్రమే పరిగణనలోకి తీసుకొంటోంది తప్ప ప్రజల అభిప్రాయాలను, వారి మనోభావాలను, వారి సంస్కృతి సంప్రదాయాల వంటి అనేక అంశాలను పెద్దగా పట్టించుకొన్న దాఖలాలు లేవు. అందుకే అది ఇటువంటి వింత వింత ప్రతిపాదనల గురించి ఆలోచిస్తోంది. రాష్ట్ర విభజన ద్వారా కాంగ్రెస్ తను ఏ రాజకీయ ప్రయోజనం పొందాలని భావిస్తుందో అది మాత్రం నెరవేరకపోగా, మొత్తానికే రాష్ట్రంలో దుంప నాశనమయ్యే పరిస్థితి చేజేతులా కల్పించుకొంటోంది. కాంగ్రెస్ చేస్తున్న ఈ ఆలోచనలు చూస్తుంటే అసలు ఆపార్టీకి తెలంగాణా ఏర్పాటు చేసే ఉద్దేశ్యం, దైర్యం నిజంగా ఉన్నాయా లేదా అనే అనుమానం కూడా కలుగుతోంది.
http://www.teluguone.com/news/content/rayala-telangana-37-27948.html